కొద్ది నెలల క్రితం మిర్యాలగూడలో పట్టపగలు ప్రణయ్ హత్య జరిగింది. ఆ హత్యకు కారణం ప్రేమ. తన బిడ్డ (అమృత) ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంగా ఆమె తండ్రి అతి కిరాతకంగా ప్రణయ్‌ను చంపించాడు. ఆ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికే తెలిసిందే. అదొక్కటే కాదు, అలాంటి హత్యలు రోజూ జరుగుతున్నాయి. పరువు కోసమో, అమ్మాయి ప్రేమించలేదనో.. ఇంకో కారణంతోనో ప్రేమపై కత్తి దూస్తున్నరు. ప్రేమించడమే పాపమన్నట్టు ప్రేమికులను కడతేరుస్తున్నరు. దేశంలో జరుగుతున్న హత్యల్లో ప్రేమ పేరిట చంపేస్తున్న కేసులు మూడో స్థానంలో ఉన్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2001 నుంచి 2017 మధ్య ప్రేమ హత్యలు (వివాహేతర సంబంధాలు కలుపుకొని) 28 శాతం పెరిగాయి. ఇటీవల నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2001లో 36,202 హత్యలు జరిగాయి. 2017 నాటికి ఆ సంఖ్య 21 శాతం తగ్గి 28,653 ఘటనలు జరిగాయి. ఇదే కాలంలో వ్యక్తిగత కక్షలతో చేసిన హత్యలు 4.3 శాతం, ఆస్తి తగాదా హత్యల్లో 12 శాతం తగ్గుదల నమోదైంది. కానీ, ప్రేమ హత్యలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 28 శాతం కేసులు పెరిగాయి. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈ ప్రేమ హత్యలే టాప్ ప్లేస్‌లో ఉన్నాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్ టాప్‌లో ఉంటే, తెలుగు రాష్ట్రాలు (ఉమ్మడి ఏపీ) రెండో స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2001 నుంచి 2017 మధ్య ఏటా సగటున 384 ప్రేమ/పరువు హత్యలు జరిగాయి. అంటే రోజూ సగటున ఒకటికిపైనే హత్యలు జరిగాయి. అత్యధికంగా యూపీలో ఆ పదహారేళ్ల కాలంలో ఏటా సగటున 395 మంది ప్రేమ పేరిట బలయ్యారు. ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌లలో ప్రేమ హత్యలే టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. యూపీ, తమిళనాడుల్లో ప్రేమ హత్యలది రెండో స్థానం.
కేరళ, పశ్చిమ బెంగాల్లో తక్కువ
కేరళ, పశ్చిమబెంగాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. ప్రేమ హత్యలు ఐదో స్థానంలోనే ఉన్నా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆ రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు చాలా చాలా తక్కువ. ఇక, పరువుహత్యలు పెరిగాయని చెబుతున్నారు. 2016లో 71 కేసులు నమోదైతే, 2017లో 92 మంది పరువుకు బలయ్యారని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం, ప్రేమ, వివాహేతర సంబంధాలేనని పోలీసులు అంటున్నారు. ‘‘ఈ హత్యల్లో సామాజిక, రాజకీయ కారణాలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కులం, వర్గం, మతం పేరిట పిల్లలను వేరే వాళ్లను ప్రేమించకుండా చేస్తున్నారు. ఆ పద్ధతి మారాలి” అని జేఎన్‌యూ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రతీక్షా బక్షి చెప్పారు. జరుగుతున్న ప్రేమ హత్యల్లో 44 శాతం హత్యలకు కారణం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లని, 56 శాతం హత్యలకు కారణం పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవడం తల్లిదండ్రులకు నచ్చకపోవడం వల్లేనని గురునానక్ దేవ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సత్నమ్ సింగ్ డియోల్ చెప్పారు. ఆయన 2005 నుంచి 2012 మధ్య ఏడేళ్ల పాటు పరువు హత్యలపై రీసెర్చ్ చేశారు.