పాపం పసివాళ్లు!..కన్నవాళ్లు అమ్ముకున్నారు.. పెంచినవాళ్ల నుంచి అధికారులు లాక్కున్నారు

పాపం పసివాళ్లు!..కన్నవాళ్లు అమ్ముకున్నారు.. పెంచినవాళ్ల నుంచి అధికారులు లాక్కున్నారు
  • ఏడాది కాలంగా శిశుగృహంలోనే చిన్నారులు
  • మానసిక క్షోభలో పెంచిన తల్లిదండ్రులు
  • కోర్టుకు చేరిన వ్యవహారం.. తుదితీర్పుపై ఉత్కంఠ

నల్గొండ, వెలుగు: ఆ పిల్లల్ని కన్నవారెవరో తెలియదు..  పెంచినవాళ్లూ దూరమయ్యారు.. పైసల కోసం పిల్లల్ని అమ్ముకున్న తల్లిదండ్రులను పోలీసులు పట్టుకోలేకపోయారు.. నాలుగైదేండ్లు సాకి, పిల్లలపై మమకారం పెంచుకున్న పేరెంట్స్​ మాత్రం తమ బిడ్డలను తమకు అప్పగించాలని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.. కానీ, వారికి పిల్లల్ని అప్పగించే పరిస్థితి లేదని ఆఫీసర్లు చెప్తున్నారు.. అటు కన్న ప్రేమకు, ఇటు పెంచిన ప్రేమకు దూరమైన11 మంది పసివాళ్లు ఏడాది కాలంగా శిశు గృహంలో తల్లి స్పర్శ కోసం అలమటిస్తున్నారు.. నల్గొండ జిల్లాలో ఓ శిశు విక్రయ ముఠా చేసిన దందా కారణంగా అభంశుభం తెలియని చిన్నారులు, వారిని పెంచుకున్న తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో న్యాయం కోసం పేరెంట్స్ ​హైకోర్టుకు వెళ్లగా తుది తీర్పు వెలువరించే వరకు పిల్లలను ఇతరులెవ్వరికీ దత్తత ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిన్నారులు ప్రస్తుతానికి శిశుగృహలోనే మగ్గుతుండగా, పెంచిన తల్లిదండ్రుల చెంతకు చేరుతారా? లేదా? అన్నది మిలియన్​ డాలర్ల ప్రశ్నగా మారింది. 

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున అమ్మేశారు..

గతేడాది మేలో సూర్యాపేట జిల్లా పోలీసులు శిశు విక్రయాల కేసును ఛేదించారు. ఆ ముఠా సభ్యులు ఎవరెవరికి పిల్లలను అమ్మారో ఆరా తీశారు. చట్టపరంగా పిల్లలను దత్తత తీసుకోలేదనే కారణంతో పెంచిన తల్లిదండ్రుల నుంచి ఆ పిల్లలను తీసుకొని శిశుగృహానికి తరలించారు. అప్పటి నుంచి కన్నవాళ్లు లేక, పెంచినవారికి దూరంగా చిన్నారులు పెరుగుతున్నారు.  ఐదారేండ్లపాటు పిల్లల్ని ప్రేమగా పెంచుకున్న దంపతులు వారిని తమకు అప్పగించాలంటూ ఏడాదిగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలులేని వారిని గుర్తించి వారికి పిల్లలను విక్రయించారు. శిశు విక్రయ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని,  ముంబై , గుజరాత్ ప్రాంతాల నుంచి శిశువులని తెప్పించి, పిల్లలు లేని వారికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున అమ్మారు. కాగా, గత ఏడాది మేలో పోలీసులు ఈ విక్రయ ముఠా గుట్టు రట్టు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 11 మంది చిన్నారులను పెంచిన తల్లితండ్రుల నుంచి నల్గొండ శిశుగృహకు తరలించారు. ఈ ముఠాని విచారించిన పోలీసులు పిల్లల్ని గుజరాత్, ముంబై నుంచి తీసుకొచ్చినట్లు నిర్ధారించినా, ఆ పిల్లల తల్లితండ్రులు ఎవరో తేల్చలేకపోయారు. 

కోర్టును ఆశ్రయించిన పేరెంట్స్  

ఐదారేండ్లపాటు పెంచుకున్న తమ పిల్లలను తిరిగి అప్పగించాలంటూ పెంచిన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పిల్లలు కలగని తాము అమ్మానాన్న అని పిలిపించుకునేందుకే ఇలా చేశామని, నాలుగైదేండ్లపాటు కన్న బిడ్డల్లాగా కడుపులో పెట్టి సాకామని, ఇప్పుడు పిల్లలు లేని ఇల్లు తమకు నరకంలా ఉందని, తమ బిడ్డలను తమకు ఇప్పించాలని కోర్టును వేడుకున్నారు. ఈ కేసును విచారించే క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టప్రకారం దత్తత తీసుకోకపోవడం వల్ల పిల్లల్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదని చెప్పిన కోర్టు.. ప్రతి 15 రోజులకోసారి పిల్లలతో గడిపేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. కాగా, హైకోర్టు తుది తీర్పు వెలువరించే వరకు పిల్లలను ఇతరులెవ్వరికీ  దత్తత ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఏడాదిగా మానసిక క్షోభ..

ఏడాదిగా శిశు గృహలో ఉంటున్న పిల్లలు తమను గుర్తుపడతారో లేదో, అక్కడ వారు ఎలా ఉన్నారో అన్న ఆందోళన పేరెంట్స్ ను వెంటాడుతోంది. వారంతా మానసిక క్షోభకు గురవుతున్నారు. పిల్లల అక్రమరవాణాకు పాల్పడిన దళారులను కఠినంగా శిక్షించాల్సిందేగానీ.. ఏ పాపమూ తెలియని పిల్లలను, వారిని సాకుతున్న తల్లిదండ్రులను విడదీయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇలాంటివి ప్రోత్సహిస్తే పిల్లల విక్రయ ముఠాలు చెలరేగిపోతాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ కేసు ఇలాగే ఏండ్ల తరబడి కొనసాగితే పసిపిల్లలు ఎలాంటి ఆదరణ లేక అనాథలుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 

నా ఆస్తి అంతా రాసిస్తా.. బాబుని అప్పగించండి 

20 ఏండ్ల నుంచి మాకు పిల్లలు లేరు. తెలిసిన వాళ్ల దగ్గరి నుంచి ఓ బాబును తెచ్చి పెంచుకున్నాం. అప్పుడు  బాబు వయస్సు 10 నెలలు. అప్పుడు బాబును పానం బాగాలేకుంటే రూ.3 లక్షలు పెట్టి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించి  కాపాడుకున్నం. కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాం. బాబుకు దగ్గరదగ్గర రెండేండ్లప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుపోయారు. బాబు లేకపోవడంతో నా భార్య ఆరోగ్యం కరాబైంది. నాకున్న ఆస్తి మొత్తం బాబు పేరు మీద రాస్తాను. బాబును మాకే ఇవ్వమని 6 నెలల క్రితం కోర్టును ఆశ్రయించిన.. కోర్టు మాత్రం నెలలో 2 సార్లు కలిసేందుకు అవకాశం ఇచ్చింది. శిశు గృహలో వదిలేస్తే ఏమొస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదివిస్తా.. ఎలాగైనా బాబును అప్పగించి న్యాయం చేయండి.   
-  నాగయ్య, టేకుమట్ల, సూర్యాపేట జిల్లా

11 రోజుల పిల్లాడిగా ఉన్నప్పటి నుండి సాకిన 

పిల్లలు లేకపోవడంతో తెలిసిన వాళ్లకు చెప్తే 11 రోజుల బాబును తీసుకొచ్చి అప్పగించిన్రు. అప్పటి  నుంచి ఏడాదిన్నర పాటు కన్న కొడుకు కంటే ఎక్కువ ప్రేమతో సాకిన. గతేడాది అక్రమ దత్తత అంటూ పోలీసోళ్లు వచ్చి మా బాబును పట్టుకెళ్లి శిశుగృహలో పెట్టిన్రు. ఏడాదిన్నర పాటు పెంచుకొని ఇప్పుడు అక్రమ దత్తత అంటే బాబుపై పానం పట్టుకున్నది. అందుకే బాబు కోసం పోరాడుతున్నం. మా బాబును మాకు ఇచ్చి న్యాయం చేయండి.   
- కొరివి అంజయ్య, సూర్యాపేట