
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ మంగళవారం నిపుణులతో భేటీ కానుంది. అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, టెలికాం వివాదాల సెటిల్ మెంట్, అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ డీఎన్ పటేల్ తదితరులు కమిటీ ఎదుట తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జడ్జీలు యూయూ లలిత్, రంజన్ గొగోయ్, ప్రముఖ జ్యురిస్ట్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా ఇప్పటికే ప్యానెల్ కు జమిలిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
కాగా.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 4న ముగియనున్నాయి. ఈ సమావేశాల చివరి వారం మొదటి రోజు పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉండగా.. ఆ గడువును లోక్ సభ పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
బీజేపీ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వంలోని ఈ ప్యానెల్ తన పనిని ముగించేందుకు మరి కొంత సమయం అవసరమని, ఈ నేపథ్యంలో ప్యానెల్ గడువును పొడిగించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలో ప్రస్తుతం 38మంది సభ్యులతో పాటు ఇద్దరు స్పెషల్ ఆహ్వానితులు కూడా ఉన్నారు.