పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు.. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు

పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు.. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు

దేశంలోని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో కూడా ప్రభుత్వ సంస్థల మాదిరిగానే రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుచేయాలని ఒక పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.  ఈ నివేదిక ప్రకారం, ప్రైవేట్ సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలి. ఈ సిఫార్సులకు బలమైన రాజ్యాంగ పునాదులు ఉన్నాయని ప్యానెల్ స్పష్టం చేసింది.

ఈ సిఫార్సు వెనుక ప్రధాన కారణం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5). 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్‌‌‌‌ను చేర్చారు. దీని ప్రకారం, ప్రైవేట్ విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ ఆర్టికల్ ప్రకారం మైనారిటీ విద్యాసంస్థలకు మాత్రం మినహాయింపు ఉంది.  పార్లమెంటరీ ప్యానెల్ తన సిఫార్సులకు బలం చేకూరుస్తూ, సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించింది. ప్రమతి ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ నిబంధనను సమర్థించింది. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధంగా ఆమోదయోగ్యమని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ కార్యాచరణ

పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తారు. ఈ సిఫార్సులను అమలు చేయాలంటే ఉన్నత విద్యా చట్టాలలో (ఉదాహరణకు UGC చట్టం) సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ సిఫార్సులను వ్యతిరేకించే అవకాశం ఉంది. దీనివల్ల చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.  అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనప్పటికీ, రిజర్వేషన్లను అమలుచేయడంలో వారికి ఎదురయ్యే ఆర్థిక భారాలను ప్రభుత్వం 
పరిశీలించాల్సి ఉంటుంది.

సామాజిక, రాజకీయ ప్రభావాలు

ఈ సిఫార్సుల అమలు సామాజికంగా, రాజకీయంగా అనేక ప్రభావాలను కలిగిస్తుంది. ఈ సిఫార్సులు అమలైతే, విద్యలో సామాజిక న్యాయం మరింత పెంపొందుతుంది. ఇది ప్రైవేట్ విద్యారంగంలో ఒక కొత్త సంస్కరణలకు దారితీస్తుంది. ప్రైవేట్ సంస్థలు కేవలం ఆర్థిక లాభాల కోసం కాకుండా, సామాజిక బాధ్యతతో కూడా నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.  ఈ సిఫార్సులను అమలు చేయడం ద్వారా వెనుకబడినవర్గాల నుండి ప్రభుత్వానికి మద్దతు లభించే అవకాశం ఉంది. 

భారతదేశంలాగే  ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యలో సామాజిక న్యాయం ఒక ముఖ్యమైన అంశం. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు, విద్యా రుణాలు ఇచ్చే పథకాలు ఉన్నాయి. అయితే, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో రిజర్వేషన్లు ఒక ముఖ్యమైన విధానంగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్న రిజర్వేషన్ విధానం దాని ప్రత్యేక సామాజిక, చారిత్రక పరిస్థితుల వల్ల ఏర్పడింది.

ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల వాదనలు

ఎంపీ అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన  ఏర్పాటైన కమిటీ, ప్రైవేట్ కళాశాలల్లో అట్టడుగు వర్గాలకు 40 శాతం తక్కువగా  ప్రవేశాలు జరుగుతున్నాయని  ఈ అంతరాన్ని  తగ్గించడానికి ప్రైవేట్ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయవలసిందేనని సిఫారసు చేసింది.  దీనిని  రెండు సంవత్సరాలలోగా అమలు చేయాలని కోరింది. సాధారణంగా, ప్రైవేట్ విద్యాసంస్థలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొన్ని వాదనలు వినిపిస్తాయి. ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సహాయం లభిస్తుంది కాబట్టి వారు రిజర్వేషన్లు అమలు చేయగలరని, ప్రైవేట్ సంస్థలకు అలాంటి మద్దతు లేనందున ఇది సాధ్యం కాదని వాదిస్తారు. అయితే, పార్లమెంటరీ ప్యానెల్, సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఈ వాదనలకు చట్టపరమైన సమాధానం లభించింది. ప్రైవేట్ సంస్థలు కూడా దేశ సామాజిక లక్ష్యాలను సాధించడంలో భాగం కావాలని ఈ తీర్పులు స్పష్టం చేశాయి.

సిఫార్సుల ప్రాముఖ్యం

పార్లమెంటరీ ప్యానెల్ చేసిన ఈ సిఫార్సులు దేశంలోని ఉన్నత విద్యారంగంలో ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. దేశంలో పెరుగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఖ్య దృష్ట్యా, వాటిలో రిజర్వేషన్లు లేకపోవడంతో వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య అవకాశాలను కోల్పోతున్నారు. ఈ నిర్ణయం అమలయితే అన్నివర్గాల విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను సమానంగా పొందగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‌‌‌‌‌‌‌‌

- డాక్టర్‌‌‌‌ ఎర్రోజు
 శ్రీనివాస్, 
తెలంగాణ వికాస సమితి