- సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పవన్
హుస్నాబాద్, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్అన్నారు. సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో అమరులు వేముల నర్సింహులు, చీకట్ల ముత్తయ్య, జంగపల్లి సాయిలు స్తూపాల వద్ద ఆయన కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణను నిజాం నవాబు తన ఆధీనంలో పెట్టుకుని హైదరాబాద్ ప్రత్యేక దేశంగా పాలన సాగిస్తూ దొరలు, దేశ్ముఖ్లు, జమీందార్లు, జాగీర్ధార్లు, రజాకార్లతో తెలంగాణ ప్రజలను చిత్రహింసలకు గురి చేశారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లో 4500 మంది అమరుల ప్రాణత్యాగంతో నిజాంనిరంకుశ పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందన్నారు.
చరిత్ర ఇలా ఉంటే ఈ పోరాటాన్ని బీజేపీ హిందూ, ముస్లిం గొడవగా వక్రీకరిస్తోందని విమర్శించారు. సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో యువ కమ్యూనిస్టులు ప్రభుత్వాల ఫ్యూడల్విధానాలపైన పోరాడాలన్నారు. కార్యక్రమంలో భాస్కర్, సత్యనారాయణ, వనేశ్, జనార్ధన్, శ్రీనివాస్, సుదర్శనచారి, రాజు, పద్మ, సుధాకర్ పాల్గొన్నారు.