కథలో భాగంగా.. కథని నడిపించేదే పాట

కథలో భాగంగా..  కథని నడిపించేదే పాట

స్వీకార్​ అగస్తి మ్యూజిక్​లో వచ్చిన ఏ పాట విన్నా..కథలో భాగంగా.. కథని నడిపించేదై ఉంటుంది. అందుకే  ‘కేరాఫ్​ కంచరపాలెం’ సినిమా వచ్చి మూడేండ్లు దాటినా అందులోని ప్రతి పాట ఇంకా మనసుని తట్టి లేపుతూనే ఉంది. ఆ తరువాత స్వీకార్​ ట్యూన్స్​ కట్టిన ‘ఓ పిట్ట కథ’, ‘మిడిల్ క్లాస్​ మెలోడీస్’ పాటలు కూడా ​ ఒకదాన్ని మించి మరొకటి హిట్​ అయ్యాయి. కేవలం మ్యూజిక్​ డైరెక్టర్​గానే కాదు సింగర్​, లిరిసిస్ట్​, గిటారిస్ట్​, ఆడియో ఇంజినీర్​గానూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్​ మ్యుజీషియన్​. ఆ విశేషాలన్నీ అతని మాటల్లోనే.. 


వేలల్లో సింగర్స్​.. వందల్లో మ్యూజిక్​ డైరెక్టర్స్.. వాళ్లందరిలో తనూ ఒకడిగా ఉండిపోవాలనుకోలేదు స్వీకార్​. అందుకే మ్యూజిక్​కి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై కాన్సన్​ట్రేట్​ చేశాడు. టెక్నికల్​గానూ తనని తాను మరింత స్ట్రాంగ్​ చేసుకోవడానికి ఆడియో ఇంజినీరింగ్ చేశాడు. ట్యూన్స్, కోరస్​లు పాడుతూ సింగర్​గా ఎదిగాడు. లిరిసిస్ట్​గా, మ్యూజిక్​ ప్రోగ్రామర్​గా పనిచేశాడు. గిటార్​ వాయించాడు, అసిస్టెంట్​ కంపోజర్​గానూ  చేశాడు. డబ్బింగ్ చెప్పాడు. ఆ ఎక్స్​పీరియెన్స్​లే  తనని సక్సెస్​ఫుల్​ మ్యూజిక్​ డైరెక్టర్​గా నిలబెట్టాయి.​ వీటన్నింటి కంటే ముందు స్వీకార్​ పాటల ప్రయాణం ఎలా మొదలైందంటే.. 

మాటల కన్నా ముందే పాటలు “  మా ఫ్యామిలీలో ఎవరికీ మ్యూజిక్​ తెలియదు. పాడటం కూడా రాదు. కానీ, నేను మాత్రం మాటలకన్నా ముందు పాటలే నేర్చుకున్నానట. టేప్​ రికార్డర్​లో పాట ప్లే అవగానే కూని రాగాలు మొదలుపెట్టేవాడినట. అది రానురాను హాబీగా మారింది. ఇళయరాజా, రెహ్మాన్​ పాటలంటే చెప్పలేనంత ఇష్టం. పాట​ వినగానే అది ఫలానా మ్యూజిక్​ డైరెక్టర్​ది అని జనాలు ఎలా గుర్తుపడుతున్నారు? అసలు వాళ్ల పాటలు ఎందుకు హిట్​ అవుతున్నాయని? తెగ ఆలోచించేవాడిని. ఫ్రెండ్స్​తోనూ ఇవే డిస్కషన్స్​.  ఇవన్నీ గమనించి నాకు మ్యూజిక్​ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకుంది అమ్మ. 
పాటలు వింటున్నా.. స్కూల్​కి వెళ్తున్నా.. ఇంతవరకు ఓకే. కానీ, ఫ్రెండ్స్​తో కలిసి సైకిళ్ల​పై షికార్లు నచ్చలేదు అమ్మకి. దాంతో నా అల్లరికి  బ్రేక్స్​ వేయడానికి ఏదైనా పనిలో ఎంగేజ్​ చేయాలనుకుంది. నాకు మ్యూజిక్​ అంటే ఇష్టం ఉండటంతో క్లాసికల్​ మ్యూజిక్​లో చేర్పించింది. అలా హైమావతి, యశోదర, భారతి గారి దగ్గర కర్ణాటక మ్యూజిక్​, హిమాంగినేని గారి దగ్గర హిందూస్తానీ మ్యూజిక్​ నేర్చుకున్నా. సుధాకర్​గారి దగ్గర గిటార్​ కూడా నేర్చుకున్నా.  కానీ, ఇన్నింటిలో ప్రావీణ్యం​ ఉన్నా నన్ను  స్కూల్​ మ్యూజిక్​ గ్రూప్​లో చేర్చుకోలేదు.  అసలు పాడటం తెలియని వాళ్లతో పాటు.. మ్యూజిక్​పై మిడిమిడి జ్ఞానం ఉన్న మా అక్క కూడా ఆ గ్రూప్​లో ఉంది.. కానీ, నాకు చోటు లేకపోవడంతో  బాగా హర్టయ్యా.  దానికి తోడు స్కూల్​లోని ప్రతి ఒక్కరూ ‘ నిన్ను మ్యూజిక్​ గ్రూప్​లో తీసుకోలేదా’ అని అడగడం మరింత బాధపెట్టింది. ఆ కసితో ఇంటర్​లో  ఫ్రెండ్స్​తో కలిసి​ ​బ్యాండ్ ఒకటి పెట్టా.  తెలుగుతో పాటు ఇంగ్లిష్​, హిందీ పాటలు కూడా పర్ఫార్మ్​ చేశా. అలా ఇంటర్​ కంప్లీట్​ చేశా. ఆ వెంటనే చెన్నై  వెళ్లి మ్యూజిక్​ నేర్చుకోవాలని  ప్లాన్​ వేశా.

నచ్చిన పని చేయమన్నారు
ఇంటర్​ రిజల్ట్స్​​ రాగానే ఫ్రెండ్స్​ అంతా ఎంసెట్​తో బిజీ అయ్యారు. నాకేమో ఇంజినీరింగ్​ ఇంట్రెస్ట్​ లేదు.  చెన్నై వెళ్లి మ్యూజిక్​ నేర్చుకోవాలనుకున్నా. ఇదే విషయం ఇంట్లో చెప్తే..మా సర్కిల్​లో మ్యూజిక్ తెలిసిన ఇద్దరు ముగ్గురితో మాట్లాడారు నాన్న. వాళ్లకి తోచిన సలహాలు వాళ్లు ఇచ్చారు. కొద్దిగా కన్విన్స్​ అయి చెన్నై పంపించారు నాన్న. ఒక పర్ఫెక్ట్​ ప్లానింగ్​తో తిరిగి ఇంటికి రమ్మని చెప్పారు. కానీ, అక్కడికెళ్లాక అసలు ఎక్కడ్నించి మొదలుపెట్టాలో అర్థంకాక తిరిగి ఇంటికొచ్చేశా. దాంతో నాన్న  ‘గ్రాడ్యుయేషన్​ తర్వాత మ్యూజిక్​ గురించి ఆలోచిద్దాం’ అన్నారు. అలా డిగ్రీ చదువుతూ నా బ్యాండ్​తో కలిసి ఎన్నో కాంపిటిషన్స్​ గెలిచా. నేషనల్​ లెవల్స్​ వరకు వెళ్లా. తీరా డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో వాళ్లు ‘లా’ చదవమన్నారు. నాన్న లాయర్​ కావడంతో  నన్ను కూడా లాయర్​ పట్టా తెచ్చుకుని ​నచ్చిన పని చేసుకోమన్నారు. దాంతో  విజయవాడలో లా చదువుతూనే చెన్నై వెళ్లి మ్యూజిక్​ నేర్చుకోవాలనుకున్నా. బేసిక్​ ట్యూన్​  కంపోజిషన్​ నుంచి మిక్సింగ్​ మాస్టర్​ వరకు అన్నింట్లో పర్ఫెక్ట్​ అవ్వాలని ఆడియో ఇంజినీరింగ్​ని ఎంచుకున్నా. అలా మూడేళ్లు చదువు, మ్యూజిక్​తో కుస్తీ పట్టి హైదరాబాద్​ వచ్చేశా. 

ఆ తర్వాత...
ఇంట్లోవాళ్లని అడిగితే అవసరం కన్నా పది రూపాయలు ఎక్కువే పంపుతారు. కానీ, నాకది ఇష్టం లేదు. నా ప్యాషన్​ని నమ్ముకొని నేను వచ్చా.. అందుకే కష్టమైన, నష్టమైనా నేనే భరించాలి అనుకున్నా. నేను ఉన్న రూమ్​ ఎంత ఇరుకుగా ఉండేదంటే.. కింద కూర్చుంటే ముందు కీబోర్డు, కుడి పక్క కంప్యూటర్, ఎడమ పక్క వాష్​ రూం డోర్​ ..దాన్ని అనుకొని మెయిన్​ డోర్​ ఉండేవి. అయినా అడ్జస్ట్​ అయ్యా. సర్వైవ్​ అవ్వడానికి ఐదొందల రూపాయలకి డబ్బింగ్​​​ కూడా చెప్పా. వాటితోనే వారం మొత్తం గడిపేవాడ్ని. అలా గడిచిపోతున్న టైంలో  ఫ్రెండ్స్​ సాయంతో డివోషనల్​ ఆల్బమ్స్​ పాడే అవకాశాలు వచ్చాయి. అవి విని సీనియర్​ డ్రమ్మర్​ నాని అసిస్టెంట్​గా పెట్టుకున్నారు. ఒకరోజు ఆయన పనిచేస్తున్న ప్రాజెక్ట్​ ఆడియో ఇంజినీర్​ చివరి నిమిషంలో రాకపోవడంతో నేను అతని ప్లేస్​ తీసుకున్నా. అప్పట్నించీ ఫ్రీలాన్స్​ ఆడియో ఇంజినీర్​గా బిజీ అయ్యా. ఇదిలా ఉంటే.. ఒకరోజు పని పూర్తయ్యాక స్టూడియో నుంచి ఏదో పాట హమ్​ చేస్తూ బయటికొస్తున్నా.. పక్క సూట్​లోని  మ్యూజిక్​ డైరెక్టర్​ వచ్చి ‘ఇప్పుడు పాట పాడింది మీరేనా?’ అని అడిగాడు. అవును అని తల ఊపేలోపు ‘నాకు ఒక సాంగ్​ పాడతారా’ అన్నాడు. అలా ‘సెకండ్​ హ్యాండ్’ సినిమాలో మొదటి పాట పాడా. ఆ తర్వాత సింగర్​ నరేంద్ర ద్వారా మణిశర్మ  కాంపౌండ్​లోకి ఎంటర్​ అయ్యా. ఆయన మ్యూజిక్​లో వచ్చిన ‘ దూసుకెళ్తా’ సినిమాలో ‘2010 సమ్మర్​లో ’ పాట పాడా. అయితే ‘సెకండ్​ హ్యాండ్’​ సినిమాకన్నా ముందే ‘దూసుకెళ్తా’  రిలీజ్​ అయింది. 

మ్యూజిక్​ డైరెక్టర్​గా...
‘కేరాఫ్​ కంచరపాలెం’​ డైరెక్టర్​ మహా, నేను స్కూల్​ డేస్​ నుంచి మంచి ఫ్రెండ్స్​. తను డైరెక్ట్​ చేసిన షార్ట్​ఫిల్మ్స్​కి కూడా నేను మ్యూజిక్​ ఇచ్చా.  ఇద్దరికీ ప్రొఫెషనల్​గా, పర్సనల్​గా మంచి రిలేషన్​ ఉండటంతో తను ఇలా విలేజ్​ బ్యాక్​డ్రాప్​లో సినిమా చేద్దామనగానే హ్యాపీగా ఒప్పుకున్నా. మ్యూజిక్​ విషయంలో పూర్తి ఫ్రీడమ్​ ఇచ్చాడు మహా నాకు. నేను కూడా విలేజ్​ బ్యాక్​ డ్రాప్​కి, కథకి తగ్గట్టు ప్రాణం పెట్టి మ్యూజిక్​ చేశా. సినిమా అంతా కంచెరపాలెం ఊళ్లోనే ఉంటుంది కాబట్టి నేను ​అక్కడి జనాలకి తెలిసిన, వాళ్లు విన్న ఇనుస్ట్రుమెంట్స్​నే మ్యూజిక్​లో వాడా. వాళ్లని కలిసి, మాట్లాడి వాళ్ల నేటివిటీకి తగ్గట్టు ట్యూన్స్​ కట్టా. అందుకే పాటలు అంత అందంగా వచ్చాయనుకుంటున్నా. ఆ సినిమా రిలీజ్​ అయ్యాక ఇండస్ట్రీ అంతా నా వైపు చూసింది. అవకాశాలు ‘క్యూ’ కట్టాయి. కానీ, కథాబలం ఉన్న సినిమాలకే మ్యూజిక్​ ఇవ్వాలనుకున్నా. అందుకే సినిమా సెలక్షన్స్​లో ఆచితూచి అడుగులేస్తున్నా. కెరీర్​లో తక్కువ సినిమాలు చేయడానికి రీజన్​ ఇదే. అలాగే నేను మ్యూజిక్​ ఇచ్చిన ‘పిట్టకథ’, ‘మిడిల్​ క్లాస్​ మెలోడీస్’ సినిమాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘స్టాండప్​ రాహుల్​’తో పాటు మరో నాలుగైదు ప్రాజెక్ట్​ల​కి ట్యూన్స్​ కడుతున్నా. 


ఆ మాటలు మర్చిపోలేను
ఈ మధ్య ఒక షో చేస్తుంటే సడెన్​గా ఒక ప్రొడ్యూసర్​ కమ్​ డైరెక్టర్​ వచ్చాడు. ‘స్వీకార్​ నువ్వు రెహ్మాన్ కాదు.. ఇళయరాజా కాదు.. నువ్వు నువ్వు మాత్రమే.. నిన్ను నీలానే మేము కూడా చూడాలనుకుంటున్నాం. పొరపాటున కూడా నీ స్ట్రెంత్​ని తక్కువ అంచనా వేయకు’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆ మాటలు నా లైఫ్​లో ఎప్పటికీ మర్చిపోలేను. పర్సనల్​ లైఫ్​ విషయానికొస్తే క్యూట్​ అండ్ స్వీట్​ ఫ్యామిలీ నాది. అమ్మానాన్న నా కెరీర్​కి మెయిన్​ పిల్లర్స్​. అక్క కూడా నన్ను ప్రతి అడుగులో సపోర్ట్​ చేస్తుంటుంది. ఈ లాక్​డౌన్​లోనే పెళ్లయింది నాకు. నా భార్య లహరి ఆర్కిటెక్చర్​గా పనిచేస్తోంది. ‘నిరావల్’​ అనే  బ్యాండ్​తో కలిసి పర్ఫార్మెన్స్​లు ఇస్తుంటా. పెద్ద ఫుడ్డీని నేను. ట్రావెలింగ్​ అంటే చాలా ఇష్టం. 

పాడిన పాటలు
హులాల (ఎక్స్​ప్రెస్​ రాజా), చెప్పవే బాలామణి    ( ఛలో), పట్టి పట్టి( కెరాఫ్​ కంచెరపాలెం), వెన్నెల్లో ఆడపిల్ల( మాస్ట్రో),  వంద స్పీడులో ( ఎక్కడికి పోతావు చిన్నవాడ), సంధ్య, వెచ్చని మట్టిలో(మిడిల్​ క్లాస్​ మెలోడీస్​),  అరెరె ఏంటీ దూరమే        ( అద్భుతం), ఏదో ఏదో( ఒకపిట్ట కథ),         తేరె బ్యూటిఫుల్​ ఆంఖే( లౌక్యం), తకదిమి(అమీతుమీ), ఐసా అంబాని పిల్ల    ( లయన్​)

పేరు మార్చుకున్నా...
నా అసలు పేరు వంశీ అగస్తి. కానీ, వంశీ పేరుతో ఇండస్ట్రీలో బోలెడు మంది సింగర్స్​ ఉన్నారు. దాంతో ‘కళ్లజోడు వంశీ’, పొడవు జుట్టు వంశీ’ అని పిలిచేవాళ్లు నన్ను.  ఒకరోజు చక్రిగారి ప్రాజెక్ట్​కి ఆడియో ఇంజినీరింగ్​ చేస్తుంటే డైరెక్టర్​ వంశీగారు ‘నీ పేరు ఏంటి?’ అని అడిగారు. ‘వంశీ’ అని చెప్తే ‘అది నా పేరుగా’.  నిన్ను కార్తికేయ అని పిలుస్తా’ అన్నారు. ఈ పేర్ల కన్​ఫ్యూజన్​ ఎందుకని అని ‘స్వీకార్’​ అని మార్చుకున్నా.   (ఆవుల యమున)