పార్టీల నడుమ సైబర్​ వార్​!

పార్టీల నడుమ సైబర్​ వార్​!
  • ప్రత్యర్థుల సోషల్​ మీడియా అకౌంట్స్​లోకి లీడర్ల చొరబాటు
  • ఫిషింగ్​ మెసేజ్​లతో హ్యాకింగ్​.. ఫేక్​ కంటెంట్​ పోస్ట్​
  • గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా కల్పిత కథనాలు
  • ప్రత్యేకంగా ‘అఫెన్సివ్​ గ్రూప్స్​’ ఏర్పాటు..  కోట్లకు కోట్లు ఖర్చు 

హైదరాబాద్​, వెలుగు: ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నాయి. ఫీల్డ్​లోనే కాదు.. ఆన్​లైన్​ వేదికగా దాడులకు దిగుతున్నాయి. ఎదుటి పార్టీ ప్రతిష్టను, ఎదుటి లీడర్​ క్యారెక్టర్​ను దెబ్బతీసేందుకు సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి  ట్రోల్​ చేస్తున్నాయి. ఏకంగా ప్రత్యర్థుల ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టా అకౌంట్లను హ్యాక్​ చేసి,  ఆ అకౌంట్లలోనే ఫేక్​ కంటెంట్​ను, కల్పిత సర్వేలను పోస్టు చేస్తున్నాయి. జనం నమ్మేలా ఈ పోస్టులకు స్పెషల్​ ఎఫెక్ట్స్​ ఇస్తున్నాయి.

ఇట్ల రాష్ట్రంలో పలువురు లీడర్లు సైబర్​ దాడుల బారినపడ్డారు. కొందరు నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలిసింది. సోషల్​ మీడియా ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొన్ని పార్టీలు ప్రత్యేకంగా ‘అఫెన్సివ్​ గ్రూప్​’లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందు కోసం ఆ గ్రూప్స్​కు కోట్లకు కోట్లు చెల్లిస్తున్నాయి. 

మొదట ఫిషింగ్​ మెసేజ్​లు పంపి..

ప్రత్యర్థి సోషల్​ మీడియా అకౌంట్​ను హ్యాక్​ చేసేందుకు మొదట ఫిషింగ్​ మెసేజ్​లు పంపుతా రు. ఆ మెసేజ్​లో ఏముందో తెలుసుకునేందుకు ప్రత్యర్థి ఓపెన్​ చేస్తే.. ఆ వెంటనే ఆ వ్యక్తి సోషల్​ మీడియా అకౌంట్​ హ్యాక్​ అవుతుంది. దీంతో వ్యక్తిగత, సున్నిత వివరాలన్నీ ఎదుటివాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. ఇట్ల ప్రత్యర్థుల సోషల్​ మీడియా  అకౌంట్లలోకి చొరబడి, ఆ అకౌంట్లలోనే తప్పుడు పోస్టులు పెట్టడం కొన్నిరోజులుగా రాష్ట్రంలో సాగుతున్నది.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ బెడద పెరగడంతో బాధిత నేతలు బుగులు పడ్తున్నారు. తమ గురించి తమ సోషల్​ మీడియా అకౌంట్లలోనే చెడుగా ప్రజల్లోకి వెళ్తే గెలుపోటములపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు కొందరు నేతలు  సైబర్​ నిపుణులను సంప్రదిస్తున్నారు. 

ఒక్క అకౌంట్​ హ్యాకింగ్​కు రూ.3 లక్షలు

ప్రత్యర్థికి చెందిన ఏదైనా ఒక సోషల్​ మీడియా అకౌంట్​ను (ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టా వంటి వాటిలో ఏదో ఒకటి) హ్యాక్​ చేసేందుకు హ్యాకర్లకు రూ.2 లక్షల నుంచి 3లక్షల దాకా లీడర్లు చెల్లిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్​లో చర్చ జరుగుతున్నది. పనిని బట్టి అంతకన్నా ఎక్కువ మొత్తమూ చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. హ్యాకర్ల ద్వారా ప్రత్యర్థి అకౌంట్​లోకి చొరబడి.. ఆ తర్వాత ఆ అకౌంట్​లో ఫేక్​ కంటెంట్​ను పోస్ట్​ చేసే పనిని తమ సోషల్ మీడియా వింగ్​కు లీడర్లు అప్పగిస్తున్నారు.

కొందరు లీడర్లు సొంతంగానే ఈ తరహా అఫెన్సివ్​ గ్రూపులను నియమించుకున్నట్టు తెలుస్తున్నది. ఇది ఒక యాంగిల్​ అయితే.. ఇలాంటి ఎటాక్​లు జరిగినప్పుడు వాటిని వెంటనే తిప్పికొట్టే సెటప్​లనూ కొన్ని పార్టీలు ఏర్పాటు చేసున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో లీడర్లపై ఈ తరహా సైబర్​ ఎటాక్స్​ జరగడం మొదటిసారని తెలుస్తున్నది. తమ సోషల్​ మీడియాలో నిత్యం తప్పుడు పోస్టులు వస్తుండటంతో అసలేం జరుగుతున్నదో అర్థంకాక కొందరు లీడర్లు..  సైబర్​ ఎక్స్​పర్ట్స్​ను కలుస్తున్నారు. అప్పుడుగానీ వాళ్లకు హ్యాకింగ్​ విషయం బోధపడటం లేదు. ఈ అటాక్స్​ ఎవరు చేశారో.. ఎక్కడి నుంచి చేశారో.. అనేది తెలియనంతా పకడ్బందీగా హ్యాకింగ్​ దాడులు జరుగుతున్నాయి.

ఏం చేస్తదీ గ్రూప్​

మామూలుగా అయితే సోషల్​ మీడియాలో సొంత పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలపై క్యాంపెయిన్​ చేయడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం, కౌంటర్లు ఇవ్వడం కోసం లీడర్లు సొంతంగా సోషల్ మీడియా వింగ్స్​ను ఏర్పాటు చేసుకుంటాయి.  కొన్ని రాజకీయ పార్టీలైతే కార్పొరేట్​ స్థాయిలో ఆఫీసులను తీసుకొని వీటి కోసం స్పెషల్​ వార్​ రూమ్​లను ఏర్పాటు చేశాయి.

అందులో పనిచేసేవాళ్లకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య ప్రత్యర్థిని దెబ్బతీయడమే లక్ష్యంగా అఫెన్సివ్​ గ్రూప్స్​ను కూడా లీడర్లు, పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ గ్రూప్స్​లోని సభ్యులు తమ పార్టీకి, వ్యక్తికి ప్రచారం చేయడంతోపాటు..  ప్రత్యేకంగా ప్రత్యర్థి పార్టీల అకౌంట్ల మీద  కన్నేసి ఉంచుతాయి. ప్రత్యర్థులకు ఫిషింగ్​ మెసేజ్​లు పంపి వారి అకౌంట్లలోకి చొరబడతాయి. ఆ తర్వాత వారిపై నిఘా పెడ్తాయి. ప్రత్యర్థి ఏం చేస్తున్నది అనునిత్యం ఫాలో అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో హనీ ట్రాప్​నూ విసురుతుంటాయి.

ఆ లీడర్లపై ఫేక్​ కంటెంట్​ను తయారు చేసి, వారి అకౌంట్లలోనే పోస్ట్​ చేస్తుంటాయి. వారి ప్రతిష్ఠను దెబ్బ తీసేలా కామెంట్లు, పోస్టులు పెడుతుంటాయి. వారికి నష్టం కలిగించే వైరల్​ వీడియోలు, కంటెంట్​ను వదులుతుంటాయి. అంతేకాదు.. ఇద్దరు లీడర్లు మాట్లాడుకున్నట్టో, లేదా ఊర్లో జనాలు మాట్లాడుకున్నట్టో కొన్ని ఫేక్​ కాల్స్​ను క్రియేట్​ చేసి పోస్ట్​ చేస్తుంటాయి. దాంతోపాటు.. ఫేక్​ సర్వే రిపోర్టులనూ అఫెన్సివ్​ గ్రూప్​లు వదులుతుంటాయి. తద్వారా జనాల్లో ఓ రకమైన అభిప్రాయం క్రియేట్​ అయ్యేలా చేస్తాయి.