ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
  • భూ సేకరణ వేగవంతమైతే ప్రాజెక్టులు పూర్తి
  • రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్​కు క్యాబినెట్ ఆమోదం 
  • పేదలకు కడుపు నిండా అన్నం 

యాదాద్రి, భూదాన్​పోచంపల్లి, హుజూర్ నగర్, కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తానని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. భువనగిరి, భూదాన్​పోచంపల్లి, ఆలేరు, హుజూర్ నగర్, కట్టంగూరు, నకిరేకల్​నియోజకవర్గాల్లో ఇన్​చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​తో కలిసి ఆయన పర్యటించారు. లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్​కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్​మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఆలేరు నియోజకవర్గంలోని గంధమల్ల రిజర్వాయర్​కు రూ.550 కోట్లను మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

 బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలతోపాటు అలీనగర్, బొల్లేపల్లి, భీమలింగం కాల్వల పనులను త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసి ప్రాజెక్టులను త్వరగా కంప్లీట్​ చేస్తామని తెలిపారు. హుజూర్​నగర్ నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కు క్యాబినెట్ ఆమోదం లభించిందని తెలిపారు. రూ. 360 కోట్లతో నిర్మించే ఈ లిఫ్ట్​ ఇరిగేషన్​వల్ల 10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడుతుందని, ఈ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాల ద్వారా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని వెల్లడించారు. నకిరేకల్​ నియోజకవర్గంలోని అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సహకరిస్తానని చెప్పారు. ఆయకట్టు రైతాంగం ఆశీర్వాదాలతోనే తాను చట్టసభలకు ఎన్నికైనట్టు మంత్రి తెలిపారు. 

పేదలకు కడుపు నిండా తిండి..

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యంతో ప్రతి నిరుపేద కడుపు నిండా తింటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అనివార్య కారణాలతో రేషన్ కార్డు అప్లికేషన్​ తిరస్కరణకు గురైతే మళ్లీ అప్లయ్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. 

ప్రజాపాలనలో ఇండ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలని, వారి కష్టంతోనే ప్రభుత్వం ఏర్పడిందన్న విషయాన్ని మేము మరిచిపోలేమని తెలిపారు. 

పేదల కలలు నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్..​

పేదల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా ఇన్​చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. గత బీఆర్ఎస్ పాలకులు పేదలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. రేషన్ కార్డులు రావడం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుతాయని తెలిపారు.

 ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి, నకిరేకల్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్​, సివిల్​సప్లయ్ కమిషనర్ డీఎస్​చౌహాన్, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు,  తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అడిషనల్​ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్​రావు, రాంబాబు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రాన్ని శాసిస్తోన్న ఉమ్మడి నల్గొండ

యాదాద్రి, వెలుగు :  'ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తోంది' అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్​ కార్యకర్తల శ్రమతో ఉమ్మడి నల్గొండలో 11 స్థానాలను గెలిచుకున్నామని చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాల్లో కొత్త రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూదాన్ పోచంపల్లిలో ఆయన మాట్లాడారు. విప్లవాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ పథకాలు గేమ్ చేంజర్ గా నిలిచిపోతాయన్నారు. 

కొత్తగా 7,90,967 రేషన్ కార్డులు మంజూరు చేశామని వివరించారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందన్నారు. సన్న బియ్యం పంపిణీ కారణంగా రాష్ట్ర జనాభాలో 84 శాతం ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.