సెప్టెంబర్ 17 ఉత్సవాలకు సిద్ధమవుతున్న పార్టీలు

సెప్టెంబర్ 17 ఉత్సవాలకు సిద్ధమవుతున్న పార్టీలు
  • విమోచనంగా బీజేపీ, విలీనంగా కాంగ్రెస్
  • సమైక్య వజ్రోత్సవాలుగా టీఆర్ఎస్ 
  • సాయుధ పోరాట వారోత్సవాలతో సీపీఎం
  • పోలీసులకు సవాలుగా మారనున్న బందోబస్తు
  • ఏర్పాట్లలో బిజీగా మారిన పార్టీలు, ఆఫీసర్లు

జనగామ, వరంగల్, వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 17 కీలకంగా మారనుంది. ఆ రోజు రాజకీయ పార్టీలన్నీ వివిధ రకాల పేర్లతో సంబురాలకు సిద్ధమవుతుండగా.. పోలీసులకు బందోబస్తు సవాల్ గా మారింది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను టీఆర్ఎస్ నిర్వహిస్తుండగా.. విమోచనంగా బీజేపీ, విలీనంగా కాంగ్రెస్ పార్టీలు చేపడుతున్నాయి. ఇక సీపీఎం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలతో ముందుకెళ్తోంది. మరోవైపు ఆఫీసర్లు వజ్రోత్సవ ఏర్పాట్లలో బిజీగా మారారు. కలెక్టర్లు, పోలీసు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, సూచనలు, సలహాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ వైపు ఉత్కంఠ, మరోవైపు సందడి నెలకొంది.

ఉత్సవాలకు టీఆర్ఎస్ ఇన్ చార్జీలు..

తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలకు టీఆర్ఎస్ లీడర్లు సిద్ధమవుతున్నారు. 16న ర్యాలీలు, 17న స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు, అదే రోజు ఛలో హైదరాబాద్, 18న సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. వజ్రోత్సవాలకు బుధవారం ఇన్ చార్జీలను సైతం నియమించారు. పాలకుర్తికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, మెట్టు శ్రీనివాస్‍.. స్టేషన్‍ ఘన్‍పూర్​కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, జనగామకు జడ్పీ చైర్మన్‍ పాగాల సంపత్ రెడ్డి, వరంగల్‍ తూర్పునకు ‘కుడా’ చైర్మన్‍ సుందర్‍రాజ్‍, వరంగల్‍ పశ్చిమకు మేయర్‍  గుండు సుధారాణి, పరకాలకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నర్సంపేటకు ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‍, వర్ధన్నపేటకు డీసీసీబీ చైర్మన్‍ మార్నేని రవీందర్‍, మహబూబాబాద్​కు ఎమ్మెల్సీ బస్వరాజ్‍ సారయ్య, జడ్పీ చైర్‍పర్సన్‍ అంగోతు బిందును నియమించారు. ఇక ములుగుకు ఎంపీ మాలోత్ కవిత, భూపాలపల్లికి ఎంపీ పసునూరి దయాకర్‍, వరంగల్​కు జడ్పీ చైర్‍పర్సన్‍ గండ్ర జ్యోతి, డోర్నకల్​కు ఎమ్మెల్సీ తక్కళపల్లి రవీందర్‍రావు, హుస్నాబాద్​కు రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్‍ నాగుర్ల వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్‍ సుధీర్‍కుమార్ ను అపాయింట్ చేశారు.

బీజేపీ ర్యాలీలతో..

బీజేపీ పార్టీ తెలంగాణ విమోచన దినం సందర్భంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు తీశారు. జనగామలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, హనుమకొండలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్, రావు అమరేందర్ రెడ్డి ర్యాలీలు తీశారు. ములుగులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, వరంగల్ సిటీలో మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్​ రెడ్డి, వన్నాల శ్రీరాములు.. మరిపెడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు, గుగులోత్ లక్ష్మణ్ నాయక్ బైక్ ర్యాలీలు నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడితోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి మదన్, యువ మోర్చా మానుకోట జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ తదితరులు ర్యాలీలు తీశారు. నేడు మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్​ర్యాలీ, రేపు సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. 17న జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు  సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించనున్నారు. అదే రోజు హైదరాబాద్ లో నిర్వహించే అమిత్ షా సభకు తరలివెళ్లనున్నారు.

సీపీఎం భారీ బహిరంగ సభ..

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సీపీఎం లీడర్లు ఘనంగా జరుపుతున్నారు. జనగామ టౌన్​లో ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం జనగామ జిల్లాకేంద్రంలోని ప్రెస్టన్ కాలేజీ గ్రౌండ్​ను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పరిశీలించారు. ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నట్లు చెప్పారు. సాయుధ పోరాట యోధులను, వారి వారసులను, కుటుంబసభ్యులను కలిసి సన్మానం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీపీఎం లీడర్లు సాయుధ పోరాట అమరవీరుల స్తూపాలకు నివాళి అర్పిస్తున్నారు. తొర్రూరులో బొల్లం అశోక్ వెంకట్రాం నర్సయ్య స్తూపానికి నివాళి అర్పించారు.

కాంగ్రెస్ ఒక్కరోజే..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినం పేరుతో ఉత్సవాలకు సిద్ధమవుతోంది. అయితే కేవలం సెప్టెంబర్ 17వ తేదీన మాత్రమే జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నట్లు ఆ పార్టీ పెద్దలు తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ శ్రేణులు రెడీ అవుతున్నారు.

ఏర్పాట్లలో ఆఫీసర్లు..

తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లలో ఆఫీసర్లు బిజీగా మారారు. బుధవారం వరంగల్ కలెక్టర్ గోపి, ఎమ్మెల్యే నరేందర్.. దేశాయిపేటలోని సీకేఎం గ్రౌండ్ ను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం ఉత్సవాలు జరుపుతామని, ఇందులో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు, ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొంటారని తెలిపారు. జనగామలో వజ్రోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ శివలింగయ్య రివ్యూ చేశారు. డీసీపీ సీతారాం, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్​ చైర్​ పర్సన్​ పోకల జమున తదితరులు పాల్గొని సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. ములుగులో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రాంసింగ్ పాటిల్, ఐటీడీఏ పీవో అంకిత్  ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మూడ్రోజుల పాటు సాగే ఉత్సవ ఏర్పాట్లపై మాట్లాడారు. ర్యాలీల్లో హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఆదివాసీ, గిరిజనులను హైదరాబాద్ తరలించేందుకు బస్సులు అందుబాటులో ఉంచాలన్నారు. మరిపెడ పట్టణంలోనూ కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభివన్ ఏర్పాట్లను సమీక్షించారు.