పూటకో పార్టీ మారుతున్న నేతలు..

పూటకో పార్టీ మారుతున్న నేతలు..
  • ఆఫర్లు ప్రకటిస్తున్న పార్టీలు

హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: త్వరలో ఉప ఎన్నిక జరిగే మునుగోడులో రాజకీయం రంగులు మారుతున్నది. లీడర్లందరూ రోజుకో తీరుగా ప్లేట్​ ఫిరాయిస్తున్నారు. రేటు మారినకొద్దీ.. పార్టీలు మారుతున్నారు. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే.. అటువైపే జైకొడుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లతోపాటు వార్డు మెంబర్లు కూడా పోటీపడి తమ రేట్లను ఫిక్స్​ చేసుకుంటున్నారు. లీడర్ల తీరును చూసి జనం చీదరించుకుంటున్నారు. 

కెపాసిటీని బట్టి డిమాండ్

ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకు రాజకీయ పార్టీలు వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా.. లోకల్​ లీడర్లు డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. లోకల్ లీడర్ల కెపాసిటీని బట్టి ఆయా పార్టీలు ఒక్కో రేట్ ఫిక్స్ చేశాయి. వార్డు మెంబర్​కు రూ. లక్ష, సర్పంచ్, ఎంపీటీసీ మెంబర్​కు రూ. పది లక్షలు, జడ్పీటీసీ మెంబర్​కు రూ. 50 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఏ పార్టీ నుంచి ఎక్కువ పైసలు వస్తే ఆ పార్టీలో చేరేందుకు లీడర్లు సిద్ధంగా ఉంటున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది సర్పంచ్​లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, జడ్పీటీసీ మెంబర్లు పార్టీలు మారారు. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తీసుకున్నవాళ్లలో చివరి వరకు తమవెంటే ఉంటారనే నమ్మకం పార్టీలకు కలగడం లేదు. పార్టీలు మారిన వాళ్లలో కొందరికి ప్రత్యర్థి శిబిరం నుంచి ఎక్కువ ఆఫర్ రావడంతో ప్లేట్ ఫిరాయిస్తున్నారు. 

కారు, కమలం స్పీడ్.. కాంగ్రెస్​లో నిస్తేజం 

మునుగోడులో టీఆర్​ఎస్​, బీజేపీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. టీఆర్​ఎస్​ తరఫున మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నీ తానై ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు వంటి కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. సొంత పార్టీ కేడర్ చేజారకుండా చూస్తున్నారు. పార్టీ నుంచి ఇప్పటి వరకు క్యాండిడేట్​ ఖరారు కాకపోవడంతో ఆయన ఆధ్వర్యంలోనే చేరికలు, ఆఫర్లు కొనసాగుతున్నట్లు చర్చ నడుస్తున్నది. బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటూ జనాన్ని కలుస్తున్నారు. ఆయన సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్​లో నిస్తేజం కనిపిస్తున్నది. ఆ పార్టీ తన క్యాండిడేట్​గా పాల్వాయి స్రవంతిని ప్రకటించినప్పటికీ.. చేరికలు పెద్దగా లేవు. రాష్ట్ర నాయకులు నియోజకవర్గంలోనే  మకాం పెట్టి బూత్ ఇన్​చార్జులు, సమన్వయకర్తలతో మీటింగ్​లు పెడ్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్​​తో ఇప్పటికే పార్టీకి తీరని నష్టం జరిగిందని, నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే ఎన్నికల టైం వరకు ఎవరూ ఉండరని లీడర్ల ఎదుట కాంగ్రెస్​ కేడర్​ వాపోతున్నది. హైకమాండ్ ఎన్నికల ఖర్చును భరించే పరిస్థితిలో లేకపోవడంతో ఆ భారాన్ని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించే క్యాండేంట్లపైన మోపినట్లు తెలిసింది. కాగా, బూత్ పరిధిలో ఒక్కో ఇన్​చార్జ్​  కనీసం రూ.5 లక్షల వరకు ఖర్చు భరించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ ఖర్చుకు భయపడి మునుగోడుకు వచ్చేందుకు బూత్ ఇన్​చార్జులు వెనకాముందు ఆలోచిస్తున్నారు. 

వచ్చినట్లే వచ్చి..!

ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో.. తమ పార్టీలో చేరిన లీడర్లు చివరి వరకు ఉంటారో.. పోతారో కూడా ప్రధాన పార్టీల లీడర్లకు అంతుచిక్కడం లేదు. ఇప్పటికైతే వచ్చినోళ్లకు వచ్చినట్లు పార్టీ కండువాలు కప్పి తమ వాళ్లుగా ముద్ర వేసుకున్నప్పటికీ.. తర్వాత చాలా మంది మళ్లీ పక్క పార్టీ వైపు చూస్తుండటం కలవరపెడుతున్నది. చౌటుప్పల్​లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకే రోజులో ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి, బీజేపీ నుంచి టీఆర్ఎస్​లోకి, చివరికి టీఆర్ఎస్ నుంచి మళ్లీ బీజేపీలోకి చేరారు. సర్వేల్ గ్రామంలో ఓ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి, మళ్లీ కాంగ్రెస్​లో చేరారు. చౌటుప్పల్ రూరల్​లో 11 మంది టీఆర్ఎస్  సర్పంచుల్లో  9 మంది బీజేపీలో చేరేందుకు రెడీగా ఉండగా.. వాళ్లకు ఆఫర్లు ఇచ్చి పార్టీ మారకుండా టీఆర్ఎస్ లీడర్లు జాగ్రత్తపడ్డారు. ఇదే మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ సర్పంచులు టీఆర్ఎస్​లో  చేరారు. వీళ్లు బీజేపీతో టచ్​లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. టీఆర్ఎస్ లో చేరేందుకు రూ.5 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మునుగోడు మండలంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరిన ఎంపీటీసీ మెంబర్​ మళ్లీ కాంగ్రెస్​లో చేరిపోయారు. కల్వలపల్లి, కిష్టాపురం సర్పంచ్​లు  కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరారు. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో కూడా ఇదేరకమైన పరిస్థితి నెలకొంది. అయితే ఎస్డీఎఫ్  వర్క్స్​ ఇస్తామని చెప్పి సర్పంచ్​లు, ఎంపీటీసీ మెంబర్స్​, పార్టీ నాయకులు చేజారిపోకుండా టీఆర్​ఎస్​ జాగ్రత్త పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇలా పార్టీ మారుతున్న నేతలెవ్వరు ప్రచారంలో కనిపించడం లేదు. గ్రామాల్లో ఎక్కడా కూడా పార్టీ కోసం పనిచేయడం లేదనే చెప్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు వచ్చినప్పు డు మాత్రమే వారి వెంట కనిపిస్తున్నారు. 

కులాలపై ఫోకస్​

ఏ మండలంలో ఏ కులం ఓటర్లు ఎంతమంది ఉన్నారో గుర్తించి, దాని ప్రకారం ఆ కులానికి చెందిన మంత్రులను, ఎమ్మె ల్యేలను అక్కడ ఇన్​చార్జులుగా నియమించాలని టీఆర్​ఎస్​ చూస్తున్నది. ఈ వ్యూహాన్ని హుజూరాబాద్​లోనూ అమలు చేసింది. పద్మశాలీలు ఎక్కువగా ఉన్నచోట ఎల్. రమణ లాంటి నేతలను, గౌడ్స్ ఎక్కువగా ఉన్న దగ్గర మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను, యాదవులు ఎక్కువగా ఉన్న చోట తలసాని శ్రీనివాస్ యాదవ్​ను.. ఇలా కులాల వారీగా మునుగోడులో బాధ్యతలు అప్పగించనుంది. వారంతా ఆయా కుల సంఘాలతో మీటింగులు, కమ్యూనిటీ హాల్స్  నిర్మాణాలు, విందుభోజనాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​లో  నిర్మించిన గిరిజన భవన్ సందర్శన కార్యక్రమాన్ని గురువారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. బీజేపీలోనూ కుల సమీకరణాలు చేస్తున్నారు. ముదిరాజ్ ఓటర్లు ఎక్కువగా ఉన్న మునుగోడు మండల కేంద్రంలో ఈటల రాజేందర్‌‌ను పెట్టారు. మిగిలిన లీడర్లను కూడా కులాల వారీగా నియమించే కసరత్తు చేస్తున్నారు. 

జెడ్పీటీసీకి రూ. 50 లక్షలు సర్పంచ్​, ఎంపీటీసీకి రూ. 10 లక్షలు వార్డు మెంబర్​కు రూ. లక్ష లీడర్ల తీరు చూసి చీదరించుకుంటున్న ఓటర్లు మరో అత్యంత కాస్ట్​లీ ఎన్నికగా మునుగోడు బైపోల్​ సిగ్గనిపిస్తున్నది

సర్పంచులు, ఎంపీటీసీలు తమ అవసరం కోసం, డబ్బుల కోసం అమ్ముడు పోతున్నారు. దానివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. వాళ్లు అమ్ముడు పోయినంత మాత్రాన సామాన్య ప్రజలు ఎవరు వాళ్ల వెంట వెళ్లరు. మేము ఆశించిన అభివృద్ధిని ఏ నాయకుడు చేస్తారో వాళ్ల గురించే మేం ఆలోచిస్తం. అలాంటి వాళ్లకే  మా మద్దతు ఉంటది. రోజుకో పార్టీ మారే నాయకులను చూసి సిగ్గనిపిస్తున్నది.

‑ కొత్త కపిల్, ఇప్పర్తి, మునుగోడు 

పార్టీలు మారడం సరికాదు 

నమ్మి ఓట్లేసి గెలిపిస్తే.. ప్రజా ప్రతినిధులు డబ్బులు తీసుకొని పార్టీలు మారడం సరైంది కాదు. లీడర్లు పార్టీలు మారినా కార్యకర్తలు మారరు. ఓట్లు వేయాలని ఎవరు వచ్చినా.. డబ్బులు ఇస్తే అందరి దగ్గర తీసుకుంటాం. మాకు ఇష్టమైన వాళ్లకే ఓటేస్తం. 

- అచ్చిన మల్లయ్య.. తెరటుపల్లి

వాళ్లు మారినా మేం మారం

ఎన్నికల పుణ్యమా అంటూ సర్పంచులు, ఎంపీటీసీ మెంబర్లు బాగానే డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఎవరు పైసలిస్తే వారు ఆ పార్టీలోకి వెళ్తున్నారని అంటున్నారు. పార్టీలు మారినంత మాత్రాన మేము మారం. మాకు ఎవరైతే రోడ్లు, అభివృద్ధి చేస్తారో వారిని చూసే మేము ఓటేస్తం. 

- మర్కట్ పల్లి అంజమ్మ,  నారాయణపురం