ప్రకృతి అందాల నడుమ పారుపల్లి కాలభైరవుడు

ప్రకృతి అందాల నడుమ పారుపల్లి కాలభైరవుడు
  • రేపటి నుంచి ఉత్సవాలు షురూ
  • ఉగ్ర గోదావరి ఉత్తరవాహిని దిశను మార్చిన వైనం 
  • రాష్ట్రంలోని ఐదు క్షేత్రాల్లోనే  ప్రసిద్ధి

మంచిర్యాల/చెన్నూర్,వెలుగు : ఓవైపు గలగల పారే గోదావరి.. మరోవైపు పచ్చని కొండలతో రమణీయ ప్రకృతి నడుమ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని కొండపై కొలువుదీరిన భైరవస్వామి భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. స్వామివారిని దర్శించుకున్న తర్వాతనే ప్రజలు తమ ఇళ్లలో శుభకార్యాలు చేయడం ఆనవాయితీ. శుక్రవారం నుంచి భైరస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

గోదావరమ్మకు ఎదురుగా నగ్నంగా నిలిచిన భైరవుడు... 

నాసిక్​లోని త్రయంబకేశ్వర్​లో పుట్టిన గోదావరి తనలో ఎన్నో వాగులు, వంకలను కలుపుకుని కొండలు కోనలు చీల్చుకుంటూ మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ వైపునకు మరలింది.  పొక్కూరు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి తన ప్రవాహాన్ని ఉత్తర దిశగా మార్చి మునులు, రుషులు తప్పస్సు చేస్తున్న పారుపల్లి కొండల వైపు ప్రవహించసాగింది. గోదావరి ఉగ్రరూపాన్ని ఆపడం దేవతల వల్ల కూడా కాలేదు. అప్పుడు మునులు, రుషుల తప్పస్సుకు భంగం కలుగకూడదని, వారి తపస్సుకు భంగం కలిగితే సకల ప్రాణకోటికే నష్టం వాటిల్లుతుందని దేవతలు కలవరపడ్డారు. ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న గోదావరమ్మను దారిమళ్లించాలని సకల దేవతలు భైరవుడిని వేడుకున్నారు. అప్పుడు గోదావరి ప్రవాహానికి ఎదురుగా భైరవుడు నగ్నంగా నిల్చున్నాడు.  నగ్న రూపాన్ని చూడలేక గోదావరి తన ప్రవాహాన్ని తూర్పు దిశగా మార్చుకుందట. కొండలపై తపస్సు చేసుకుంటున్న మునులు, రుషులకు, సకల ప్రాణకోటికి ముప్పు తప్పిందని పురాణాలు చెప్తున్నాయి.

పరమ పవిత్రం పంచకోశ ఉత్తరవాహిని...

చెన్నూరు మండలం పొక్కూరు నుంచి ఐదు కోసుల పాటు ఉత్తరంగా గోదావరి  ప్రవహించడం వల్ల పంచకోశ ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్తర వాహిని గోదావరిలో భైరవాష్టమి రోజున స్నానాలు చేసిన భక్తులకు సకల దోషాలు హరించి పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. భైరవుడు గోదారమ్మకు అడ్డంగా నిల్చున్న ప్పటి నుంచే ఈ గుట్టపై శిలగా మారి భక్తుల కోర్కెలను తీరుస్తూ కొంగుబంగారంగా దర్శమిస్తున్నాడని ఇక్కడికి వచ్చే భక్తుల అపార నమ్మకం. ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తెలంగాణలో కాలభైరవస్వామి ఆలయాలు 5 మాత్రమే ఉండగా, అందులో ఒకటి పారుపల్లిలో ఉండడం విశేషం. మిగతా నాలుగు కామారెడ్డి సమీపంలోని శ్రీ కాలభైరవస్వామి ఆలయం, మెదక్​ మండలం కాజిపల్లిలోని కాలభైవరవ దేవాలయం, మేడ్చల్​ జిల్లాలోని కాలభైవర ఆలయం, సూర్యాపేట బాలాజీనగర్​లో మరో ఆలయం ఉంది.  

రేపు భైరవాష్టమి..

ప్రతి సంవత్సరం భైరవాష్టమి వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందట. ఈ నెల 16న  జరిగే  భైరవ జయంతి ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర,  ఛత్తీస్ గఢ్ తదతితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. కోరికలు తీరిన భక్తులు వారి కానుకలను ఆ దేవునికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. భైరవస్వామి జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు నీడ, నీళ్లు, భోజనం వసతులను కల్పిస్తున్నట్టు ఆలయ ఉత్సవ కమిటీ తెలిపింది.  

ఏటా వస్తాం..

మేము ప్రతీ సంవత్సరం హైదరాబాద్ నుంచి మా కుటుంబంతో ఈ భైరవస్వామి ఆలయాన్ని వస్తాం. మా కోర్కెలను తీర్చుమని స్వామివారిని కోరుకుంటాం. కోరికలను ఆలకించి నెరవేర్చాడు కాబట్టి మళ్లీ మా కుటుంబ సభ్యులందరం కలిసి వచ్చి మొక్కులు తీర్చుకుంటాం. - ఓంప్రకాశ్ దేవుడా, వ్యాపారవేత్త, బేగంబజార్, హైదరాబాద్ 

భైరవ -కొండను అభివృద్ధి చేయాలి-..

భైరవకొండను అభివృద్ధి చేసి పారుపల్లికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భైరవ కొండను దేవాదాయశాఖ గుర్తించి పర్యాటకం ప్రాంతంగా తీర్చిదిద్దాలి. గుట్ట వద్ద ఆలయం నిర్మించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. - భద్రయ్యచారి, స్థానిక భక్తుడు