ధాన్యం అమ్ముకోవడానికి రైతుల పాట్లు

ధాన్యం అమ్ముకోవడానికి రైతుల పాట్లు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక... మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ప్రారంభమైనా.. ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్ముకోవాలంటే టోకెన్ల తప్పనిసరి చేశారు. దాంతో రైతులు ప్రభుత్వ ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు. అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల వ్యవసాయ అధికారి ఆఫీస్ ముందు టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. క్యూలైన్లో నిలబడలేక పాస్‎బుక్‎లు రైతులు పెట్టారు. నాలుగు రోజుల నుంచి టోకెన్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి చలిలో ఆఫీస్ ముందు నిలిచున్నామని చెప్తున్నారు. టోకెన్ల కోసం గంటల తరబడి నిలబడలేక పొలం పాస్‎బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలైన్లో  పెడుతున్నారు.  గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు లేకపోవడంతో పాటు మిల్లర్లు వడ్లు కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.