7 లక్షలకు చేరిన పీవీల స్టాక్​.. వెల్లడించిన ఫాడా

7 లక్షలకు చేరిన పీవీల స్టాక్​..    వెల్లడించిన ఫాడా

న్యూఢిల్లీ: కార్లు వంటి ప్యాసింజర్ వాహనాల (పీవీ) స్టాక్‌‌‌‌‌‌‌‌లు 7 లక్షల యూనిట్లకు పైగా పోగుపడ్డాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది.   ఇది 60–-64 రోజుల బిల్ట్-అప్ స్టాక్ అని తెలిపింది.  ప్రస్తుత ఇన్వెంటరీ ఆల్​టైం హై అని, వచ్చే నెల మొదటివారంలో ఇది చాలా వరకు అమ్ముడుపోవచ్చని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. సాధారణంగా డిసెంబర్ చివరి వారం నుంచి డీలర్లు వచ్చే ఏడాది కోసం వెహికల్స్​ షిప్​మెంట్లను తీసుకుంటారని చెప్పారు.   

ఈసారి కంపెనీలు ఇంకా కొత్త ఏడాదికి బిల్లింగ్​ను మొదలుపెట్టి ఉండకపోవచ్చని అన్నారు.   మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్  సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో పీవీ రిటైల్ అమ్మకాలు 4.30 లక్షల యూనిట్లను దాటొచ్చని అన్నారు. ఇది ఆటోమొబైల్ అమ్మకాల చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్య అని,  కొన్ని ఇన్వెంటరీలను క్లియర్ చేయడంలో సహాయపడవచ్చని చెప్పారు. డిసెంబరులో హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌లు దాదాపు 2,85,000 యూనిట్లు అమ్ముడుకావచ్చని  ఆయన చెప్పారు. 

‘‘ఈ ఏడాది జనవరి/ఫిబ్రవరి తర్వాతి నెలల్లో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి.  డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనూ వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయాయి. గత సంవత్సరం డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో 2.75 లక్షల హోల్​సేల్​ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా అమ్ముడైన యూనిట్ల సంఖ్య 2.76 లక్షలు ఉంది. అయితే ఈ సంవత్సరం అది దాదాపు 2.85 లక్షల యూనిట్లు దాటొచ్చు’’ అని అన్నారాయన.