
హైదరాబాద్ : పసునూరి రవీందర్ రాసిన "పోటెత్తిన పాట" పుస్తకాన్ని ప్రజా గాయకుడు గద్దర్ ఆవిష్కరించారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ, విమలక్క, నలికంటి శరత్, ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, మిట్టపల్లి సురేందర్, గోరెటి వెంకన్న హాజరయ్యారు.
హృదయంలో సిద్ధార్థుడు, ఆహార్యంలో అంబేద్కరుడు
పసునూరి రవీందర్ ను చూస్తుంటే హృదయంలో సిద్ధార్థుడు, ఆహార్యంలో అంబేద్కరుడు కనిపిస్తున్నారని సుద్దాల అశోక్ తేజ అన్నారు. పసునూరి మాటల సూర్యుడు అని కొనియాడారు. గద్దరన్న ఫిరంగుల్లో ఒక ఫిరంగి పసునూరి అని అన్నారు. పాటంటే సామజవరగమన కాదు.. సాయుధ రణ గమన అని చెప్పారు. తాను సినిమాలోకి వెళ్లాలో లేదో అని గద్దర్ ను అడిగి, పాటలు రాశానని సుద్దాల చెప్పారు. తన తండ్రి ప్రజల కోసం పాటలు రాస్తే తాను సినిమాల కోసం రాస్తానని గద్దర్ కు చెప్పినట్టుగా తెలిపారు. తాను ప్రజాకవిని కాదన్న సుద్దాల.. సినిమాలో కథకు తగ్గట్టు పాటలు రాశానని చెప్పారు. తాను పక్కా సినిమా కవినే అయినప్పటికీ.. సినిమాలో యుద్ధ గీతాలు కూడా రాశానన్నారు. తాను రాసిన కొమురం భీముడో.. కొమురం భీముడో.. పాట గద్దర్ రాసిన పాట నుండే కాపీ చేసినట్టుగా సుద్దాల తెలిపారు. గద్దర్ పాటల విశ్వవిద్యాలయమని చెప్పారు. .
తెలంగాణ అంటేనే ఒక పాట
తెలంగాణ అంటేనే ఒక పాటని విమలక్క అన్నారు. పసునూరి రవీందర్ ‘పోటెత్తిన పాట’ల పుస్తకం చాలా బాగుందని, తనకు ఇష్టమైన కవి పసునూరి అని విమలక్క తెలిపారు.
సుద్దాల పాటలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం
గద్దర్ పెద్ద ప్రమాదకారి అని మిట్టపల్లి సురేందర్ అన్నారు. గద్దర్ పాటలు విని చాలామంది ప్రభావితమై అడవీ బాట పట్టారని చెప్పారు. గద్దర్ ప్రభావం తనపై కూడా ఉందన్నారు. బలమైన సాహిత్యం ఉన్న ప్రజాకవి గద్దర్ అయితే.. కరోనా వైరస్ కంటే ప్రమాదకరం సుద్దాల పాటలు అన్నారు. అన్ని రకాల పాటలు రాసే సత్తా సుద్దాల అశోక్ తేజ సొంతమని చెప్పారు. తనని ఆకర్షించిన వ్యక్తి సుద్దాలనే అని..తాను సినిమాల్లోకి రావాడానికి కారణం కూడా ఆయనే అని తెలిపారు. పసునూరి నుంచి ప్రభావితమై తాను తెలంగాణ ఉద్యమ పాట రాశానని చెప్పారు. అందెశ్రీ, విమలక్క పాటలు ఒక్కసారి వింటే మనల్ని వెంటాడుతాయని, గోరెటి వెంకన్న పాటలు కూడా అత్యంత శక్తివంతమైనవని తెలిపారు.