పాశ్వాన్ రికార్డ్ : ఆరుగురు ప్రధానుల కేబినెట్ లో చోటు

పాశ్వాన్ రికార్డ్ : ఆరుగురు ప్రధానుల కేబినెట్ లో చోటు

పాశ్వాన్.. ఆయన పరిస్థితులను పసిగట్టగలడు. పదవులూ పట్టగలడు. బిహార్ లో దళిత్ లీడర్ గా చెరగని గుర్తింపు తెచ్చుకున్న ఆయన… రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో… జనం ఎవరికి పట్టం కడుతున్నారో.. సరిగ్గా అంచనా వేయగలరు.ఆ నేర్పు ఆయన సొంతం. అందుకే.. సమకాలీన రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని… తిరుగులేని ఓ రికార్డ్ ను ఆయన తన పేరిట లిఖించుకోగలిగారు.

రామ్ విలాస్ పాశ్వాన్. బిహార్ లో రాజకీయ చాణక్యుడు. జనతాదళ్ నుంచి వేరుపడి.. సొంత పార్టీ లోక్ జనశక్తిని ఏర్పాటుచేసి.. రాజకీయ శక్తిగా మార్చారు. 1989 నుంచి.. 2019 వరకు.. 30 ఏళ్లలో.. ప్రధానులు ఎందరు మారినా.. ఆయన దాదాపుగా ప్రతి కేబినెట్ లోనూ మంత్రి అయ్యారు. ఆరుగురు ప్రధానుల అండర్ లో పనిచేశారు.

రామ్ విలాస్ పాశ్వాన్.. తాజాగా శుక్రవారం కూడా నరేంద్రమోడీ మంత్రివర్గంలో మినిస్టర్ గా ప్రమాణం చేసి అరుదైన ఘనత సాధించారు.

ఇదీ నేపథ్యం

బిహార్ కు చెందిన రామ్ విలాస్ పాశ్వాన్.. 1969లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ నుంచి తొలిసారి.. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజ్ నారాయణ, జయప్రకాశ్ నారాయణ్ ల ప్రభావంతో.. ఆయన లోక్ దళ్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తర్వాత జనతాపార్టీలో మెంబరయ్యారు. జనతా పార్టీ టికెట్ పైనే .. తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టారు.

హాజీపూర్ లో భారీ మెజారిటీతో ఫేమ్

ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో 4లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొంది.. దేశవ్యాప్తంగా ఫేమ్ అయ్యారు పాశ్వాన్.

తొలిసారి వీపీ సింగ్ కేబినెట్ లో ..

1989లో వీపీ సింగ్ కేబినెట్ లో తొలిసారి కేంద్రమంత్రి అయ్యారు. కార్మిక మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత.. HD దేవెగౌడ, IK గుజ్రాల్ ల ప్రభుత్వాల్లో… ఆయనకు రైల్వే శాఖ మంత్రి బెర్త్ దక్కింది. పదేళ్ల కాలంలోనే ఆయన ముగ్గురు ప్రధానుల కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వాజ్ పేయి హయాంలోనూ..

ఆ తర్వాత.. 1999లో అట్ల బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలోనూ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి పోస్ట్ దక్కించుకున్నారు పాశ్వాన్. 2002లో అదే ప్రభుత్వంలో బొగ్గు గనుల మంత్రిగానూ పనిచేశారు.

2002లో NDAకు దూరం

బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలతో .. సీనియర్ దళిత్ లీడర్ గుర్తింపుతో సొంతంగా లోక్ జన శక్తి పార్టీని స్థాపించారు రామ్ విలాస్ పాశ్వాన్. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ఆయన NDAకు మద్దతు ఉపసంహరించారు. యూపీఏకు మద్దతిచ్చారు.

2004 లోక్ సభ ఎన్నికల తర్వాత… ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో చేరారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో.. 2009 వరకు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి హోదాలో సేవలందించారు.

2009 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు పాశ్వాన్. 2010 నుంచి 2014 మధ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2014 లోక్ సభ ఎన్నికలకు ముందు.. బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. ఎన్డీయేకు దూరమైన జేడీయూ నేత, అప్పటి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఎదుర్కొనేందుకు… లోక్ జనశక్తి, బీజేపీ చేతులు కలిపింది. పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతోపాటు.. 7 సీట్లు ఇచ్చింది బీజేపీ. అందులో ఆరింటిని గెలుపొందింది LJP. హాజీపూర్ నుంచి పాశ్వాన్ తోపాటు.. అతడి కొడుకు చిరాగ్ పాశ్వాన్, సోదరుడు రామ్ చంద్ర పాశ్వాన్ కూడా ఎంపీలుగా గెలుపొందారు.

2014లో మోడీ కేబినెట్ లో పాశ్వాన్ కు చోటు

ఎన్డీయే మిత్రపక్షం హోదాలో..  2014లో నరేంద్రమోడీ మంత్రివర్గంలో ఆయన బెర్త్ దక్కించుకున్నారు. మోడీ కేబినెట్ లో తొలిసారి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీల శాఖ మంత్రిగా ఆయన పని చేశారు.

2019లోనూ మోడీ 2.0 టీమ్ లో చోటు

2019 ఎన్నికల్లోనూ ఎన్డీయే మిత్రపక్షంగానే ఎన్నికలకు వెళ్లి బిహార్ లో విజయం సాధించారు పాశ్వాన్. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. హాజీపూర్ నుంచి పాశ్వాన్ తమ్ముడు పశుపతి కుమార్ పరాస్ ఎంపీగా పోటీచేసి గెలిచారు.

ఐనప్పటికీ.. పాశ్వాన్ కు మోడీ2.0 టీమ్ లో పాశ్వాన్ కు చోటు దక్కింది. 2019లో నరేంద్రమోడీ కేబినెట్ లో మరోసారి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పదవిని పొందారు.

అలా.. వీపీ సింగ్, హెచ్ డీ దేవెగౌడ్, ఐకే గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్రమోడీ .. ఆరుగురు ప్రధానమంత్రుల మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఘనతను రామ్ విలాస్ పాశ్వాన్ సొంతం చేసుకున్నారు.