3 గంటలు క్యూలో ఉన్నా ఓపీ దొరకలే

3 గంటలు క్యూలో ఉన్నా ఓపీ దొరకలే
  • వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో పైలట్ ప్రాజెక్ట్ కింద బయోమెట్రిక్ రూల్ తెచ్చిన సర్కార్ 
  • క్యూ లైన్​లో నిల్చుని ఇబ్బంది పడుతున్న పేషెంట్లు, గర్భిణులు
  • గంటల తరబడి ఎదురుచూసి వెనుదిరుగుతున్నరు
  • సీజనల్ వ్యాధుల సమయంలో సర్కార్ నిర్ణయంతో తిప్పలు

ఎల్ బీ నగర్, వెలుగు: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో సీజనల్ వ్యాధులతో వచ్చే పేషెంట్లతో పాటు జనరల్ చెకప్ చేయించుకునే గర్భిణులకు గంటల కొద్దీ కష్టాలు తప్పడం లేదు. ఓపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ బయోమెట్రిక్ కంపల్సరీ చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న వైద్యమైనా భారీగా పేషెంట్లు క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమర్జెన్సీ  వైద్యమైనా ఓపీ ఉండాల్సిందే. దీంతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు, గర్భిణులు సరైన వైద్యం అందక వచ్చి వెనక్కి పోతున్నారు.

 సీవియర్​గా ఉన్నవాళ్లు చిన్న క్లినిక్స్​కు వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఉదయం నుంచి  గంటల తరబడి క్యూ లైన్​లో వేచి చూసినా చివరకు  వైద్యం అందడం లేదని ఆస్పత్రికి వచ్చిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బయోమెట్రిక్​ పడితేనే..
గతంలో సర్కార్ దవాఖానలో ఓపీ తీసుకుని వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకుని వైద్యం పొందేవారు. ప్రస్తుతం ఆధార్ బయోమెట్రిక్​తోనే ఓపీ ఇచ్చే విధానం అమలులోకి తెచ్చింది. ఆస్పత్రికి వచ్చే పేషెంట్లతో ఓపీ వద్ద భారీగా క్యూ  ఉంటోంది. బయోమెట్రిక్ పడితేనే వైద్యం అందుతుందని తెలియని వారు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణ టెస్టులకు వచ్చే గర్భిణులు, షుగర్ పేషెంట్స్ ఇతర రెగ్యులర్ పేషెంట్లకు కూడా తిప్పలు తప్పడం లేదు. 

బయోమెట్రిక్ వద్ద ఫింగర్ ప్రింట్ పడకపోతే గంటలకొద్దీ ఎదురుచూసి పడేవరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో  క్యూ లైన్ కూడా ముందుకు సాగడం లేదు.  లైన్​లో వెయిట్ చేయలేని పరిస్థితి ఉన్న పేషెంట్స్  మధ్యలోనే వెళ్లిపోతుండగా, స్పృహ తప్పి పడిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. 

ఓపీ సిబ్బంది లేక..
 ప్రతిరోజు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి పేషెంట్ల తాకిడి వందల్లో ఉంటుంది. కానీ  ఓపీ ఇచ్చేవారు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదు. 
ఈ టైమ్​లో బయోమెట్రిక్ రూల్ తేవడంపై పేషెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతిని మార్చడం లేదా సరిపడా సిబ్బందిని నియమించి సామాన్యులకు వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా..
మరోవైపు తెలంగాణ డయాగ్నస్టిక్ సర్వర్​లో సమస్య కారణంగా టెస్టుల సేవలన్నీ నిలిచిపోతున్నాయి. ఒక్క టెస్టుకు  రెండు, రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందని పేషెంట్లు చెబుతున్నారు. 
ఓపీ వద్ద సర్వర్ సమస్య రావడంతో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో టెస్ట్ లు చేయించుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన వారంతా రోజుల తరబడి  నిరీక్షించాల్సి వస్తుందంటున్నారు. మరోవైపు ఆస్పత్రిలో కరెంట్ కూడా సరిగా ఉండదని, దీంతో  టెస్టులకు లేట్ అవుతుందని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని 
కోరుతున్నారు.

సర్వర్ డౌన్ అని వెనక్కి పంపిన్రు
టెస్టుల కోసం మూడు గంటలు వెయిట్ చేసిన. చివరికి సర్వర్ డౌన్ అని వెనక్కి పంపించారు. డాక్టర్​ను కన్సల్ట్​ అయ్యేందుకు రెండు రోజులైతే.. టెస్టులకు కూడా  రెండు రోజులు పడుతుంది. గర్భిణులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చూడాలి.   – కృష్ణవేణి, ఎల్​బీనగర్ 

3 గంటలు క్యూలో ఉన్నా ఓపీ దొరకలే
చాతి నొప్పి వస్తుందని ఆస్పత్రికి వచ్చినం.  మూడు గంటలుగా క్యూలో నిల్చున్నా  ఓపీ దొరకలేదు. కొద్దిసేపు కరెంట్ పోవడంతో  
ఓపీ చిట్టీ కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎమర్జెన్సీ అంటే కూడా డైరెక్ట్​గా  ఓపీ ఇవ్వడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూసినం.
– మహ్మద్ సిరాజ్, సాహెబ్ నగర్

పేషెంట్లకు ఇబ్బంది రాకుండా చూస్తం
ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఓపీ ఇవ్వడం అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం రన్ చేస్తోంది. కిందిస్థాయి సిబ్బంది అవగాహన లోపంతో పేషెంట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బందికి సూచనలు చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.  
– గజ్జి రాజు యాదవ్, డీసీహెచ్ఎస్, రంగారెడ్డి జిల్లా