- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సర్కారు దవాఖానాల్లో పరిస్థితి
- జనరల్ హాస్పిటల్లో 200 బెడ్స్, మాతా శిశుసంరక్షణ కేంద్రంలో 160 బెడ్స్
- అంతంతమాత్రంగానే పని చేస్తున్న ఫ్యాన్లు
- ఏసీలు, కూలర్ల ఏర్పాటుకు ఫండ్స్లేవంటున్న వైద్యాధికారులు
- డీఎంఎఫ్టీ, ఇతరత్రా ఫండ్స్ కేటాయించాలని కలెక్టర్కు పలువురి విజ్ఞప్తి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఉక్కపోతతో పేషెంట్లు అల్లాడుతున్నారు. ఏసీలు, కూలర్లు అసలే లేవు. ఉన్న కొన్ని ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో లోపల ఉండలేక, బయటికి వెళ్లలేక రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం జిల్లాలో దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీ పరిస్థితి..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం రామవరంలోని 100 బెడ్ల మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో చేరుతున్న బాలింతలు, గర్భిణులు, చిన్నారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 100 బెడ్ల హాస్పిటల్లో ప్రస్తుతం రోగుల సంఖ్యకనుగుణంగా 160 బెడ్లకు పెంచారు. బాలింతలు, గర్భిణులు రోజూ కనీసం 60 మందికి పైగానే ఉంటారు. చిన్నారులకు మాతా, శిశు సంరక్షణ కేంద్రంలోనే ట్రీట్మెంట్ఇస్తుంటారు. కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్జనరల్ హాస్పిటల్లో 200పైగా బెడ్స్ ఉన్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్జనరల్ హాస్పిటల్తో పాటు మాతా
శిశు సంరక్షణ కేంద్రంలో ఉక్కపోతతో పేషెంట్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడ ఏసీలు, కూలర్లు లేవు. ఫ్యాన్లు ఉన్నా లేనట్లుగానే పరిస్థితి ఉంది. జిల్లాలో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదువుతుండడంతో వేడి ఎక్కువగా ఉంటుంది. హాస్పిటళ్లలో ఉక్కపోతను తట్టుకోలేక ఏడుస్తున్న పసిబిడ్డలను తల్లులు వరండాలోకి తీసుకువచ్చి గాలికి తిప్పుతున్నారు. ఏదైనా విద్యుత్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారమయ్యే పరిస్థితి లేదు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంతో పాటు జిల్లా జనరల్ హాస్పిటల్లో ఎలక్ట్రీషియన్ లేకపోవడంతో ప్రైవేట్ఎలక్ట్రీషియన్ వచ్చేంత వరకూ రోగులకు ఇబ్బందులు తప్పవు. వడదెబ్బ బాధితులు ఈ హాస్పిటళ్లకు వస్తే ఇక్కడ వేడితో మరింత ఇబ్బందులు పడే దుస్థితి నెలకొంది.
ఫండ్స్ లేక..
మాతా, శిశు సంరక్షణ కేంద్రంతో పాటు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లోని వార్డుల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసేందుకు ఫండ్స్ లేవని వైద్యాధికారులు చెబుతున్నారు. కలెక్టర్ స్పందించి డీఎంఎఫ్టీ, ఇతరత్రా ఫండ్స్ కేటాయించి ఏసీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సింగరేణి, నవభారత్, కేటీపీఎస్ లాంటి సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, బడా వ్యాపారులైనా ఈ సమస్య పరిష్కారానికి తమ వంతు సాయం అందిస్తారని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.