పట్నం రేట్లు పెంచుతున్రు!

పట్నం రేట్లు పెంచుతున్రు!
  • ప్రతిపాదనలు రెడీ చేసిన ఆఫీసర్లు
  • పాలక మండలి గ్రీన్​సిగ్నల్​

సిద్దిపేట, వెలుగు: కొమురవెల్లి మల్లన్న పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేవి పట్నాలు. మల్లన్న జాతర ఉత్సవాల్లో అధికారిక కార్యక్రమాల్లో పెద్ద పట్నాలు వేయడం సంప్రదాయమైతే సామాన్య భక్తులు వారి కోర్కెలు నెరవేరితే పట్నాలు వేసి మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ.  మరే ఇతర  ఆలయాల్లో లేనివిధంగా కొమురవెల్లిలో పట్నాల మొక్కు చెల్లింపునకు ఎంతో ప్రత్యేకత ఉంది.  ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో వేసే ఈ పట్నం మొక్కుల టికెట్ల ధరలను పెంచడానికి ఆలయ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా రెండు రోజుల క్రితం పాలకవర్గం ఆమోదించింది.  దీంతో ప్రతిపాదనల్ని ఆఫీసర్లు ఉన్నతాధికారులకు సమర్పించారు.  కొద్ది రోజుల్లో కొమురవెల్లి ఆలయంలో పెంచిన పట్నం టికెట్ల రేట్లను అధికారికంగా ప్రకటించేందుకు ఆఫీసర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 

పట్నం టికెట్లతోనే అధిక ఆదాయం
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సంవత్సరాదాయంలో అత్యధిక భాగం పట్నం టికెట్ల అమ్మకం ద్వారానే లభిస్తోంది. కొమురవెల్లి మల్లన్న సంవత్సరాదాయం  రూ. 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉండగా ఇందులో దాదాపు రూ. 3 కోట్లు పట్నం టికెట్ల అమ్మకం ద్వారానే సమకూరుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు. వీరిలో 60 శాతానికి పైగా పట్నాలు, బోనాల మొక్కులు చెల్లించుకుంటారు. పట్నం టికెట్ల రేట్ల పెంపుతో ఏటా దాదాపు కోటి రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఆర్జిత సేవల్లో  భాగంగా అభిషేకాలు, నిత్య కల్యాణాలు, ఒడిబియ్యం, కుంకుమార్చన, వాహన పూజలు, బోనాలతో పాటు మూడు రకాల పట్నాల టికెట్లను ఆలయ అధికారులు అమ్ముతుంటారు.  ఆలయానికి చెందిన 150 మంది ఒగ్గు పూజారులు వివిధ రకాలైన పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకునేలా చూస్తారు. భక్తులు ఆలయం నుంచి  రశీదులు పొందిన తర్వాతే ఒగ్గు పూజారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్నాల ద్వారా వచ్చిన ఆదాయంలో సగం ఒగ్గు పూజారులకు సంవత్సరాంతంలో చెల్లిస్తే మిగిలిన ఆదాయం ఆలయానికి చెందుతుంది.
 

30 నుంచి 85 శాతానికి పైగా పెంపు
కొమురవెల్లిలో భక్తులు చెల్లించే పట్నాలకు ఎంతో ప్రశస్తి ఉంది. పట్నం అంటే మల్లికార్జున స్వామి కల్యాణమనే అర్థం. హైందవ సంప్రదాయం ప్రకారం పెండ్లికి ముందు నిర్వహించే పోలు బియ్యం పోసే ప్రక్రియ మాదిరిగా కొమురవెల్లిలో వీర శైవ ఆగమ శాస్త్రం ప్రకారం పట్నం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ పట్నాల్లో పసుపు, కుంకుమ, గులాబి కుంకుమ, తంగేడు ఆకులతో తయారైన ఆకుపచ్చ చూర్ణంతోపాటు, బియ్యాన్ని వినియోగిస్తారు.  ఈ పట్నాలను ఐదు వరుసల నుంచి 41 వరుసల వరకు ఒగ్గు పూజారులు వేస్తారు. భక్తులు మూడు రకాల పట్నాలతో మల్లన్న కు మొక్కులు చెల్లించుకుంటారు.  కొమురవెల్లిలో భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది చిలకపట్నం, ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం, ఆలయం లోపల వేసేది ముఖ మండప పట్నం గా పేర్కొంటారు. ఆలయం లోపల స్థానిక ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తే, బయట ఇతర ప్రాంతాలకు చెందినవారు వేస్తారు. మల్లన్నను కులదైవంగా భావించే భక్తులు ఏడాదికి లేక రెండు, మూడు సంవత్సరాలకు ఒకసారి పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. చిలక పట్నానికి 80 నుంచి 150, నజర్ పట్నానికి 150 నుంచి 200, 
ముఖ మండప  పట్నానికి 200 నుంచి 300 రూపాయల మేర టికెట్ల ధరలను పెంచడానికి అధికారులు రెడీ అయ్యారు. పాలక మండలి నిర్ణయంతో సామాన్య భక్తులపై భారం పడుతుందన్న విమర్శలు వస్తున్నాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుతున్నాం
ప్రత్యేక పరిస్థితుల్లో పట్నం టికెట్ల రేట్లను పెంచడానికి నిర్ణయించాం. పాలకవర్గం ఆమోదంతో టికెట్ల రేట్ల పెంపుపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. అనుమతి లభించగానే సవరించిన రేట్ల ప్రకారం టికెట్ల అమ్మకాలు ప్రారంభిస్తాం. ఆదాయం తగ్గుతుండటం, ఇతర వసూళ్లను అరికట్టడానికే టికెట్ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నాం. 
– బాలాజీ, ఈవొ, కొమురవెల్లి దేవస్థానం