వరంగల్ లో అభిమాని నిరంజన్ కు పవన్ పరామర్శ

వరంగల్ లో అభిమాని నిరంజన్ కు పవన్ పరామర్శ

హనుమకొండ జిల్లా అభిమాని నిరంజన్ ను పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి,  బాగోగులను తల్లిదండ్రులు రాము మానసలను అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ కు లక్ష రూపాయలు నగదు సాయం అందించారు పవన్ కళ్యాణ్

గ్రేటర్‍ వరంగల్‍కు చెందిన నిరంజన్‍ అలియాస్‍ గబ్బర్‍సింగ్‍. ఏడేళ్ల వయసులో అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఎముకలు విరిగిపోయేలా, కడుపు పగలిపోయేలా బాధించే జబ్బుతో పదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ రకం వ్యాధిగ్రస్తులకు ఆయుష్షు తక్కువగానే ఉంటుందని వైద్యరంగం చెబుతోంది. చికిత్స, మందుల కంటే అతడిని ఆనందంగా ఉండేలా చూసుకోవడం ద్వారానే ఆయుష్షు పెంచవచ్చని డాక్టర్లు ఇచ్చిన సలహాతో ఇంట్లో నడుచుకుంటున్నారు. 

నిరంజన్‍కు ఇల్లే ప్రపంచం అయింది. కుటుంబ సభ్యులు, టీవీలో అతనికి నచ్చే సినిమాలే అతనికి జీవం పోస్తున్నాయి. ఈక్రమంలో అతను పవన్‍ కల్యాణ్‍ నటనకు ఫిదా అవుతూ పవర్‍స్టార్‍ ఫ్యాన్‍ అయ్యాడు. తన ముద్దుపేరును గబ్బర్‍సింగ్‍ అని పెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు తన అభిమాన హీరోను కలవాలని ఆశతో ఉన్నాడు. విషయం తెలిసిన పవన్‍ కల్యాణ్‍ తన అభిమానిని కలవాలని నిర్ణయించారు. తాను వరంగల్‍ వస్తానని కబురు పంపాడు. దీంతో ఇవాళ పవన్ రాకతో  అతడి కల నెరవేరింది. 

నిరంజన్‍కు ట్రీట్‍మెంట్‍లేని డీఎండీ వ్యాధి

గ్రేటర్‍ వరంగల్‍ హనుమకొండ కేయూ రోడ్డులోని పెగడపల్లి డబ్బాల్‍ ప్రాంతానికి చెందిన పొనుగోటి రాము, మానస దంపతుల కొడుకు నిరంజన్‍ అరుదైన డ్యూచెన్‍ మస్కులర్‍ డిస్ట్రోఫీ(డీఎండీ) వ్యాధితో బాధ పడుతున్నాడు. జన్యుపరమైన ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. ఐదేండ్ల లోపు ప్రభావం చూపే ఈ వ్యాధి వల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుంది. 

గుండె కండరాలు, శ్వాసకోస ఇబ్బందులు ఎక్కువయ్యే ప్రాణాంతక వ్యాధిగా చెబుతారు.   కాగా, ఏడేండ్ల వయసు నుంచి దాని ప్రభావం కనిపించింది. కిడ్నీలు దెబ్బతిన్నాయి. పొట్ట ఉబ్బరంగా మారింది. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడిని కాపాడుకునేందుకు వరంగల్‍ నుంచి హైదరాబాద్‍, కేరళ వరకు ఎన్నో హాస్పిటళ్ల చుట్టూ తిరిగారు. ఉన్న ఆస్తులు అమ్ముకోవడంతో పాటు లక్షలాది రూపాయలు అప్పులు చేసి డాక్టర్లకు చూపించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 

నిరంజన్‍ ఆయుష్షు పెంచడానికి అతనికి నచ్చేలా ఆనందమయ జీవనం అందించడం తప్పితే ట్రీట్‍మెంట్‍ లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. ప్రస్తుతం నిరంజన్‍ వయసు 17 ఏండ్లయినా వ్యాధి కారణంగా ఐదేళ్ల పిల్లాడిలా కనిపిస్తాడు. అతని పేరేంట్స్  కిరాయి ఇంట్లో ఉంటూ చిన్నపాటి పనులు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నారు. మూడేళ్లుగా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో నిరంజన్‍ మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు మాత్రం పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని.. నిరంజన్‍కు ధైర్యం చెబుతూ అతడికి నచ్చే వాతావరణం కల్పిస్తున్నారు.