చంద్రబాబు భార్య భువనేశ్వరిని పరామర్శించిన పవన్ కల్యాణ్

చంద్రబాబు భార్య భువనేశ్వరిని పరామర్శించిన పవన్ కల్యాణ్

స్కిల్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును పవన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లిన పవన్.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో ములాఖత్ లో చంద్రబాబును కలుసుకున్నారు. తరువాత చంద్రబాబు భార్య భువనేశ్వరిని పవన్ పరామర్శించి ధైర్యం చెప్పారు.  ఇవాల్టి  ( సెప్టెంబర్ 14)  ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలిసిన అనంతరం బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.

జగన్ తో ఇక యుద్ధమేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా ఆరు నెలలు మాత్రమే మీకు సమయం ఉందని.. తప్పులు సరిదిద్దుకోవాలని.. యుద్ధమే కావాలంటే చేసి చూపిస్తామని జగన్ ను హెచ్చరించారు.  గత నాలుగున్నర ఏళ్ల జగన్ పాలన అరాచకంగా సాగిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరాచకంలోనే భాగంగా చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని పవన్ ప్రకటించారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు.  జగన్ పరిపాలన బాగుంటే రాజకీయంగా నేను, బాలకృష్ణ, లోకేష్ కలవాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పుకొచ్చారు. ఒకవేళ కలవాల్సి వస్తే అది వ్యక్తిగతంగా తప్ప రాజకీయాల కోసం కాదు అని పవన్ నొక్కి చెప్పారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి లేదని కొట్టి పారేశారు.

Also Read :- టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తున్నాం: చెప్పేసిన పవన్ కల్యాణ్

ఏపీ భవిత కోసమే తాను ఆలోచిస్తానని పవన్ ప్రకటించారు. 2014లో సైతం ఏపీలో టీడీపీకి, కేంద్రంలో ఎన్డీఏకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని చెప్పారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని పవన్ ప్రకటించారు. బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం టిడిపి కోసమో, జనసేన కోసమో కాదన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు. తాను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటివరకు మోడీ పిలిస్తేనే తాను వెళ్లి కలిసినట్లు గుర్తు చేశారు. వారి విలువైన సమయాన్ని వృధా చేయకూడదన్నదే తన అభిమతం అన్నారు. పవన్ తాజా ప్రకటనతో పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చింది.