
బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌లో పాల్గొంటూ కమిటైన చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ కాగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ‘ఓజీ’ సినిమాను కూడా పూర్తి చేశారు పవన్. విజయవాడలో జరిగిన షెడ్యూల్‌తో పవన్ పోర్షన్‌కు సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. ‘గంభీర కోసం ప్యాకప్.. రిలీజ్ కోసం గేర్ అప్’ అంటూ పవన్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు.
ఇందులో పవన్ కళ్యాణ్ గంభీర అనే ముంబై అండర్ వరల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక మిగతా ఆర్టిస్టులతో ఉన్న బ్యాలెన్స్ షూట్‌ను కూడా కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్. ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.