Pawan Kalyan: 'OG' సినిమాకు 'ఫ్రెష్ కిక్'! నేటి నుంచి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ అదనంగా!

Pawan Kalyan: 'OG' సినిమాకు 'ఫ్రెష్ కిక్'!  నేటి నుంచి నేహా శెట్టి స్పెషల్ సాంగ్ అదనంగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద సర్ప్రైజ్! సుజీత్ దర్శకత్వంలో వచ్చిన హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రం ' ఓజీ' (They Call Him OG).  విడుదలైన తర్వాత కూడా కొత్త ట్విస్ట్‌తో వార్తల్లో నిలిచింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నేహా శెట్టిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌ను సోమవారం (సెప్టెంబర్ 29) నుంచి అన్ని థియేటర్లలో అదనంగా జోడించబోతున్నారు. సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ పాట లేకపోవడంతో అభిమానులను నిరాశ పరిచింది. ఇప్పుడు ఆ సాంగ్ ను సినిమాలో అదనంగా కలిపి ఫ్యాన్స్‌కు మూవీ మేకర్స్ శుభవార్త అందించారు. గతంలో బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ ఐటెం సాంగ్ గురించి నటి నేహా శెట్టి సోషల్ మీడియాలో హింట్ ఇవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

పాట తొలగింపు వెనుక కారణం ఇదేనా?

సినిమా విడుదలైనప్పుడు పాట లేకపోవడంపై వస్తున్న ప్రశ్నలకు సంగీత దర్శకుడు థమన్ స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. తొలుత చేసిన కటింగ్‌లో ఈ పాట కథనం ప్లోకి అడ్డుగా ఉందని భావించాం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం మేం ఆ పాట స్థానాన్ని మార్చి, కథలో సజావుగా ఇమిడిపోయేలా రీవర్క్ చేశాం అని చెప్పుకోచ్చారు. ఇక నుంచి ఈ స్పెషల్ సాంగ్ అన్ని షోలలో అదనంగా కనిపిస్తుంది. దీనివల్ల సినిమాకు మరింత ఫ్రెష్ ఎనర్జీ వస్తుందని ఆశిస్తున్నాం అని థమన్ పేర్కొన్నారు. ఈ డ్యాన్స్ ట్రాక్ చేరికతో మాస్ ఆడియన్స్‌కు 'OG' మరింత కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

బాక్సాఫీస్‌ వద్ద 'ఓజీ' సునామీ

ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చినా, పవన్ కళ్యాణ్ మేనియా బాక్సాఫీస్‌ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం, ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టింది. తర్వాత వీకెండ్‌లో మాత్రం స్థిరపడింది. సినీ ట్రేడ్ సక్నిల్క్ అంచనా ప్రకారం 'OG' నాల్గవ రోజు (ఆదివారం) రూ. 18.50 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఇది శనివారం నాటి కలెక్షన్లకు దాదాపు సమానం . దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి నాలుగు రోజుల్లో రూ. 140.20 కోట్లకు పైగా నికర వసూళ్లను రాబట్టింది.  ఇక అంతర్జాతీయంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను దాటిన పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచింది. ఆదివారం రోజున తెలుగు రాష్ట్రాల్లో సగటున 39.14% ఆక్యుపెన్సీ నమోదైంది.

ALSO READ : ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ముంబై మాఫియా కథాంశం

దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్... 1980ల బొంబాయి మాఫియా నేపథ్యంలో, పదేళ్లు అజ్ఞాతంలో ఉన్న ఓజస్ గంభీర అలియాస్ 'OG' తిరిగి వచ్చి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడటం ప్రధాన కథాంశం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి గ్యాంగ్‌స్టర్ ఓమి భౌ పాత్రలో తెలుగు తెరకు పరిచయమవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. ముఖ్యంగా, రవి కె. చంద్రన్,  మనోజ్ పరమహంస అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్,థమన్ అందించిన పవర్ ఫుల్ మ్యూజిక్ సినిమాకు సాంకేతిక బలాన్ని అందించాయి. కొన్ని సబ్‌ప్లాట్‌లు బలహీనంగా ఉన్నప్పటికీ.. థమన్ ఉత్సాహభరితమైన సంగీతం యాక్షన్ సన్నివేశాలకు కొత్త ఊపునిచ్చింది.

మొత్తం మీద, ఈ వారం కొత్త సినిమాల పోటీ లేకపోవడం, అదనంగా స్పెషల్ సాంగ్ చేరికతో, 'OG' బాక్సాఫీస్‌ వద్ద మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది.