ఇన్​కమ్​ట్యాక్స్​ క్యాష్​ ట్రాన్సాక్షన్లపై కఠినమైన రిస్ట్రిక్షన్లు

ఇన్​కమ్​ట్యాక్స్​ క్యాష్​ ట్రాన్సాక్షన్లపై కఠినమైన రిస్ట్రిక్షన్లు

న్యూఢిల్లీ: పన్నుల ఎగవేతలను అరికట్టడానికి ఇన్​కమ్​ట్యాక్స్​ క్యాష్​ ట్రాన్సాక్షన్లపై కఠినమైన రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఆస్పత్రులు, హోటళ్లు లేదా ఏదైనా దుకాణంలో రూ.20 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని కట్టాల్సి వస్తే క్యాష్​ బదులుగా బ్యాంకింగ్ మార్గాల ద్వారా చెల్లించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి సంస్థల్లోని లావాదేవీలను ఐటీ శాఖ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు చెక్​ చేస్తారు.  లోన్​ లేదా డిపాజిట్ కోసం రూ. 20వేలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్​ను స్వీకరించడంపైనా నిషేధం ఉంది. ఇలాంటి లావాదేవీలు తప్పనిసరిగా బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేయాలి. అంతేగాక ఒక వ్యక్తి మరొక వ్యక్తి నుండి మొత్తం రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని క్యాష్​ రూపంలో స్వీకరించడానికి కూడా అనుమతి లేదు. రిజిస్టర్డ్​ ట్రస్ట్ లేదా రాజకీయ పార్టీకి క్యాష్​ రూపంలో చేసిన విరాళాలకు సైతం మినహాయింపులు ఉండవు. ఈ నిబంధనలను అమలు చేయడానికి, ఐటీ విభాగం ఆసుపత్రులు సహా కొన్ని వ్యాపారాల్లో,  సంస్థల్లో క్యాష్​ లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. కొంతమంది ప్రొఫెషనల్స్​ డిపార్ట్‌‌మెంట్ నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. ఆస్పత్రులు వంటి హెల్త్‌‌కేర్ ఇన్‌‌స్టిట్యూట్లలో చేరిన తర్వాత  రోగుల పాన్ కార్డులను తప్పనిసరిగా సేకరించాలని ఐటీశాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. చాలా ఆస్పత్రులు ఇలా చేయడం లేదని, ఇది చట్టవిరుద్ధమని అంటున్నారు. ఇలాంటి ఆసుపత్రులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య సేవలను అందించేవారి డేటాను పరిశీలిస్తున్నామని,   ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో క్యాష్​ చెల్లించిన రోగులను గుర్తిస్తున్నామని ఐటీశాఖ తాజా రిపోర్టు వెల్లడించింది.  ఇవి దాఖలు చేసిన రిటర్నుల్లో తప్పులను గుర్తించేందుకు  యానువల్​ ఇన్ఫర్మేషన్​ స్టేట్​మెంట్​ వంటి డేటాను ఉపయోగిస్తున్నామని పేర్కొంది.

ఆదాయ వివరాలను తనిఖీ చేసి,  సమర్పించడం ఇలా..

 లావాదేవీల గురించి సమస్యలు రావొద్దనుకుంటే అవసరమైన అన్ని పత్రాలను జత చేయడంతో పాటు, ట్యాక్స్​పేయర్లు వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్​),  పన్ను చెల్లింపుదారుల సమాచార సారాంశం (టీఐఎస్​)లో సరైన సమాచారాన్ని ఇచ్చిందీ లేనిదీ ఒక్కటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. పన్ను రిటర్న్‌‌లో సమర్పించిన సమాచారంలో,  ఏఐఎస్,  టీఐఎస్​ వివరాల్లో ఏదైనా తేడా ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏఐఎస్​ను 2021లో ప్రారంభించారు. పోయిన సంవత్సరంలో వ్యక్తిగత ఆర్థిక లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. ఏఐఎస్​లోనే పొదుపు ఖాతా/ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు, టీడీఎస్​, డివిడెండ్‌‌ల ఆదాయాలు, మ్యూచువల్ ఫండ్‌‌లు లేదా అలాంటి ఇతర పెట్టుబడులపై పొందిన వడ్డీతో సహా ఆదాయపు పన్ను చట్టం నిర్దేశించిన సమాచారం అంతా ఉంటుంది. ట్యాక్స్​పేయర్లు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌‌లో వారి ఖాతాలకు లాగిన్ కావడం ద్వారా వారి ఏఐఎస్​ని డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌‌లోని "సర్వీసెస్" ట్యాబ్ కింద  ఏఐఎస్ డౌన్‌‌లోడ్ ఆప్షన్​ కనిపిస్తుంది. టీఐఎస్ కూడా  ఏఐఎస్​లో ఒక భాగం. ట్యాక్స్​పేయర్​కు సంబంధించిన అన్ని వివరాలూ ఉంటాయని గుర్తుంచుకోవాలి.