
మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు ప్రకటించారు. బుధవారం (అక్టోబర్ 08) మంత్రులు పొన్నం, లక్ష్మణ్ లతో భేటీ అనంతరం ఈ వివాదానికి తెరపడినట్లు మహేష్ కుమార్ చెప్పారు.
బుధవారం ఉదయం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇంట్లో మంత్రులు పొన్నం, లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తో పాటు ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేన రెడ్డి , సంపత్ కుమార్, అనిల్ , వినయ్ కుమార్ తదితర నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివాదం ముగిసిందని పీసీసీ చీఫ్ చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తనకూ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు.. పార్టీ సంక్షేమం తప్పఎటువంటి దురుద్దేశం లేదని చెప్పారు.
తాను అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం మంత్రి బాధ పడి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. తనకు అలాంటి ఆలోచన లేదని.. ఆ ఒరవడిలో పెరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదని అన్నారు. కరీంనగర్ లో మాదిగ సామాజిక వర్గంతో పాటే కలిసి పెరిగామని.. ఆ అపోహ ఉండవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు మంత్రి పొన్నం.
సామాజిక న్యాయానికి పోరాడే క్రమంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి ముందుకెళ్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో.. రాహుల్ గాంధీ సూచన మేరకు బలహీనవర్గాల బిడ్డగా 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేస్తానని తెలిపారు. తామంతా ఐక్యంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైన సామాజిక న్యాయం కోసం పని చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు.