సర్పంచ్​లను కేసీఆర్ పురుగుల కన్నా హీనంగా చూసిండు : రేవంత్​రెడ్డి

సర్పంచ్​లను కేసీఆర్  పురుగుల కన్నా  హీనంగా చూసిండు : రేవంత్​రెడ్డి
  • సీఎం కేసీఆర్​పై పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఫైర్​
  • నిధులివ్వకుండా కేసులు పెట్టి వేధించిండు
  • పుస్తెలమ్మి, అప్పులు తెచ్చి అభివృద్ధి చేసినా పైసా ఇయ్యలే
  • అప్పులు తీర్చలేక చాలా మంది ప్రాణాలు విడిచిన్రు
  • అలాంటి కేసీఆర్​ పాలనకు చరమగీతం పాడుదాం
  • స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏ ప్రభుత్వ పాలనకైనా పునాదులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులేనని, అలాంటి వాళ్లను కేసీఆర్​ పురుగుల కన్నా హీనంగా చూశారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఫైర్​ అయ్యారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఉండే బాధ్యత, ప్రజల్లో ఉండే గౌరవం తెలుసని అన్నారు. కానీ, కేసీఆర్​ హయాంలో స్థానిక ప్రజా ప్రతినిధులంతా ఎన్నెన్నో అవస్థలు పడ్డారని, అవమానాలకు గురయ్యారని ఆయన తెలిపారు. 

ఆదివారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు రేవంత్​ బహిరంగ లేఖ రాశారు. ‘‘పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి పార్టీలకతీతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేసీఆర్​ పాలనకు చరమగీతం పాడాలి. కాంగ్రెస్​ను గెలిపించాలి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టి వేధించి, పార్టీలు మారేలా చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఘనత కేసీఆర్​ది. నిర్ణయాధికారం లేక, నిధులు రాక వాళ్లు పడిన బాధలు గుర్తుండే ఉంటాయి. 

ALSO READ :- ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి : రత్నాకర్ ఝా

సర్కారు నిధులు విడుదల చేయకున్నా గ్రామాలు, మున్సిపాలిటీలు, పట్టణాల అభివృద్ధి కోసం సొంత నిధులను ఖర్చు చేశారు. భార్య మెడలో బంగారుపుస్తెలు అమ్మి ఆ సొమ్ముతో ఊరికి ఉపకారం చేసిన వాళ్లూ ఉన్నారు. కొందరు వడ్డీకి అప్పులు తెచ్చి మరీ అభివృద్ధికి పట్టం కట్టారు. అయితే, ప్రభుత్వం మాత్రం నయాపైసా ఇవ్వలేదు సరికదా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులనూ రాష్ట్ర ప్రభుత్వమే కాజేసింది. సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో.. ఊరి మంచి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్ట లేక కొందరు సర్పంచ్​లు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

మరి కొందరు ఉపాధి హామీ కూలీలుగా, వాచ్​మెన్లుగా పని చేస్తున్న ఘటనలూ మన కండ్ల ముందే ఉన్నాయి” అని లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే రూ. పది లక్షలు ఫండ్​ ఇస్తామని ఆశ చూపి.. తీరా ఏకగ్రీవం అయ్యాక తూచ్ అని తండ్రీకొడుకులు కేసీఆర్​, కేటీఆర్​ కలిసి ఆడిన డ్రామాలూ గుర్తుండే ఉంటాయని తెలిపారు. 

ఎందరో బాధితులు..

ఎందరో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేసీఆర్​ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లేనని రేవంత్​ తన లేఖలో పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని శ్రీరాములపల్లి సర్పంచ్ మంజుల పల్లె ప్రకృతి వనం నిధులు రాక ఆత్మహత్యా యత్నం చేశారు. నిజామాబాద్​ జిల్లా ఆరేపల్లి సర్పంచ్​ ఇరుసు మల్లేశ్​ పగలు సర్పంచ్​గా, రాత్రి పూట సెక్యూరిటీ గార్డుగా పని చేశారు. కామారెడ్డి జిల్లా మర్కల్​ సర్పంచ్​ జూకంటి సంగారెడ్డి ఉపాధి కూలీగా మారారు. రైతు వేదిక కోసం అప్పు చేసి, బిల్లులు రాకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా పెద్ద పడిశాల సర్పంచ్ రావుల మల్లేశ్​ పెయింటర్​గా మారి తానే రంగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిర్యాల వెంకన్న భిక్షాటన చేసి నిరసన తెలిపారు. అభివృద్ధి చేసి సకాలంలో బిల్లులు రాకపోవడంతో నల్గొండ జిల్లా ఎరుగండ్లపల్లి సర్పంచ్ శాంతమ్మ పుస్తెల తాడు అమ్మి వడ్డీలు చెల్లించారు. సూర్యాపేట జిల్లా అడ్లూరు సర్పంచ్ కందుకూరి స్వాతి ఆత్మహత్యాయత్నం చేశారు. సంగారెడ్డి జిల్లా పెద్ద ముబారక్ పూర్ సర్పంచ్ ఆసం దింగబర్ ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా సోమారం గ్రామ సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. 

కొమురం భీం జిల్లా గుండి గ్రామ సర్పంచ్ అరుణ నగలు అమ్మి  అప్పులకు వడ్డీలు చెల్లించారు. రంగారెడ్డి జిల్లా కాశగూడెం గ్రామ సర్పంచ్ అజహరుద్దీన్ (ఏకగ్రీవంగా ఎన్నికైనా ఆ నిధులు కూడా ఇవ్వలేదు) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మావినేల సర్పంచ్ చంద్రప్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

జనగామలో రేవంత్ రెడ్డిపై కేసు 

జనగామ, వెలుగు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జనగామ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం కేసు నమోదైంది. ఈ నెల 15న జనగామలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పరువుకు భంగం కలిగించేలా రేవంత్ మాట్లాడారని, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, రూమర్స్ స్ప్రెడ్ చేశారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. దీంతో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్.. జనగామ అసెంబ్లీ ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ మురళీ కృష్ణకు ఫిర్యాదు చేశారు. 

పేదలకు ఎంట్రీ లేని ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బాంబులతో పేల్చి వేయ్యాలని అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయ్యా, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ 150 గదులతో పదెకరాల్లో రూ.2 వేల కోట్లతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారని విద్వేష పూరితంగా మాట్లాడారన్నారు. ప్రగతి భవన్ ముందు గద్దర్ 3 గంటల పాటు వెయిట్ చేసినా కేసీఆర్ అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వలేదని, దళిత గిరిజనులకు, స్టూడెంట్లకు, నిరుద్యోగులకు లోపలికి ఎంట్రీ లేదని రేవంత్ రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ ఆఫీసర్​ మురళీకృష్ణ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 171జీ, 188, 505(2), 125 ఆర్పీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

ఎన్నికల్లో మీ పాత్ర కీలకం

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పాత్రే ఎన్నికల్లో కీలకమని రేవంత్​ తెలిపారు.  ‘‘పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండి. స్థానిక సంస్థల బలోపేతానికి, స్థానిక ప్రజా ప్రతినిధులుగా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. రేపటి నాడు స్థానిక ప్రజాప్రతినిధుల కష్టాలు తీర్చే బాధ్యత, వాళ్ల గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్​ తీసుకుంటుంది. స్థానిక సంస్థలకు పూర్వవైభవాన్ని ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్​ప్రభుత్వానిదే. పాలనలో మీ భాగస్వామ్యం ఉంటుంది. 

నిధుల సమస్య తీరుతుంది. మీ పల్లెకు మీరే పెద్ద దిక్కుగా తిరిగి నిలబడగలిగే పరిస్థితి వస్తుంది. పదేండ్లుగా మిమ్మల్ని వేధించిన, నిధులు ఇవ్వక హేళన చేసిన, మన సహచరుల చావులకు కారణమైన కేసీఆర్​ పాలనకు చరమగీతం పాడుదాం. కాంగ్రెస్ కు అండగా నిలవండి. మీరు ఏ పార్టీలో ఉన్నా ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం కృషి చేయండి. మీ పల్లె రుణం తీర్చుకునే అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. పార్టీలకు, జెండాలకు, ఎజెండాలకు అతీతంగా వార్డు సభ్యుడు నుంచి సర్పంచ్ వరకు.. కౌన్సిలర్​నుంచి మున్సిపల్ చైర్మన్​ వరకు, కార్పొరేటర్​ నుంచి మేయర్ల వరకు అందరికీ ఇదే నా విజ్ఞప్తి’’ అని బహిరంగ లేఖలో రేవంత్​ కోరారు.