పారాసిటమాల్ వేసుకుంటే కరోనా రాదని చెప్పి తప్పుదోవ ప‌ట్టించాడు

పారాసిటమాల్ వేసుకుంటే కరోనా రాదని చెప్పి తప్పుదోవ ప‌ట్టించాడు

జగిత్యాల: అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కరోనా టెస్టులు సరిగా చెయ్యడం లేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో సగటున ప్రతి పది లక్షల మందికి 16 వేల మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నార‌న్న ఉత్త‌మ్.. తెలంగాణలో కూడా ప్రతి 10 లక్షల మందికి 650 టెస్టులు మాత్రమే చేశారని అన్నారు. మాజీ మంత్రి రత్నాకర్ రావు దశదిన కర్మకు హాజరయ్యేందుకు జ‌గిత్యాల‌ వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మే 14 వరకు రాష్ట్రంలో కేవలం 20 వేల మందికే కరోనా టెస్టులు చేశార‌ని చెప్పారు. రోజూ 250 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నార‌న్నారు.

సీఎం కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, డిక్షనరిలో ఎన్ని తిట్లు ఉంటే అన్ని తిడుతున్నాడని అన్నారు ఉత్త‌మ్. మొదట్లో పారాసిటమాల్ వేసుకుంటే కరోనా రాదని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమ‌ర్శించారు. సూర్యాపేట జిల్లాలో అధికారుల పర్యటన తర్వాత అస్స‌లు టెస్టులే చెయ్యలేదని అన్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలనూ ఇక్కడ పట్టించుకోలేదని అన్నారు. కరోనా టెస్టుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పారు.‌

కేసీఆర్ కు, అధికారులకు మధ్య సమన్వయం లేదని, వలస కూలీలను ఆదుకునే విషయంలో కేసీఆర్ విఫలం అయ్యారని ఉత్త‌మ్ విమ‌ర్శించారు. ప్రభుత్వం దగ్గర వలస కూలీల లెక్కలు లేవని,కూలీలు వెళ్ళిపోతే.. ప్రభుత్వానికి తిప్పలు తప్పవని హెచ్చ‌రించారు.

pcc chief uttam kumar reddy press meet in jagtial