V6 News

చిరు వ్యాపారులకు నష్టం చేస్తే ఊరుకోం : పీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్రెడ్డి

చిరు వ్యాపారులకు నష్టం చేస్తే ఊరుకోం : పీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్రెడ్డి

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా గోడకు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారులకు నష్టం చేసేలా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి పేర్కొన్నారు.  సోమవారం కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొట్టి శ్రీరాములు  విగ్రహ ప్రాంతం, గంజు స్కూల్ ఏరియాలో నిర్మించనున్న బిల్డింగ్​లకు మారుస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదన్నారు.  

షాపులు ఖాళీ చేసి వెళ్లి పోవాలని చెప్పటం సబబుకాదన్నారు. సర్వే నంబర్​ 6లో నివాసం ఉంటున్న 12 మంది బాధితులను సురక్షిత ఏరియాలకు తరలించకుండా షెడ్లను తొలగించటంతో రోడ్డున పడ్డారన్నారు. అభివృద్ధిని తాము అడ్డుకోవటం లేదన్నారు.

 మున్సిపల్ నిధులతో బిల్డింగ్​లు నిర్మిస్తామని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ముందంజలో ఉందన్నారు.  ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో నాయకులు నిమ్మ విజయ్​కుమార్​రెడ్డి, పంపరి శ్రీనివాస్,  జూలూరి సుధాకర్,  చాట్లం వంశీ, సలీం, గడ్డమీది మహేశ్, మామిండ్ల రమేశ్, రంగ రమేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.