చస్తే బీమా ఇచ్చుడుకాదు.. రైతుకు ధీమా ఇయ్యాలె

చస్తే బీమా ఇచ్చుడుకాదు.. రైతుకు ధీమా ఇయ్యాలె

సీఎం కేసీఆర్​పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ '

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రైతులు బతకడానికి ధీమా ఇవ్వాలి కానీ చస్తే బీమా ఇస్తామనడం దుర్మార్గమని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అప్పుడు బీమా ఇస్తున్నారని, నష్టపరిహారం ఇస్తే రైతుకు చావాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు పుట్టెడు కష్టాల్లో ఉంటే సీఎం కేసీఆర్ మాత్రం వేరే రాష్ట్రం పోయి అక్కడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు. ఇక్కడి రైతుల కడుపు నింపిన తర్వాత ఎవ్వరి సమస్యలు పట్టించుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఎనిమిదేళ్లలో ఒక్క రైతు దగ్గరికి కూడా వెళ్లి పరామర్శించని కేసీఆర్.. పంజాబ్ వెళ్లి అక్కడి రైతు కుటుంబాలకు చెక్కులు ఇచ్చి రావడం దారుణమన్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ది కోసమే చేసిందని, ఆయనకు రైతుల మీద ప్రేమే లేదన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం కాంగ్రెస్ హయాంలో తెచ్చిన పథకాలే అమలు అవుతున్నాయని జగ్గారెడ్డి చెప్పారు.