ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సక్సెస్ .. జీవో నంబర్ 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ సక్సెస్ .. జీవో నంబర్ 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల డిమాండ్

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/తిర్యాణి/కోల్​బెల్ట్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాను కన్జర్వేషన్ రిజర్వ్​గా ప్రకటిస్తూ విడుదల చేసిన 49 జీఓను రద్దు చేయాలని ఆదివాసీలు పిలుపునిచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ ప్రశాంతంగా జరిగింది. ఆసిఫాబాద్​లో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు సంపూర్ణ ‌మద్దత్తు పలికి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఆర్టీసీ డిపో ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. వెంటనే జీవో నంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ ​చేశారు. ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. 

తెరుచుకోని విద్య, వ్యాపార సంస్థలు 

ఆదిలాబాద్ బస్ డిపో ఎదుట బైఠాయించిన ఆదివాసీ సంఘాల నాయకులు బస్సులను బయటకు రానివ్వలేదు. అనంతరం పట్టణంలోని ప్రధాన చౌక్​లో తిరుగుతూ వ్యాపార సంస్థలను మూసివేయిం చారు. విద్యాసంస్థలు పూర్తిగా సెలవు ప్రకటించాయి. తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం గణేశ్ మాట్లాడుతూ.. కొమురం భీం జిల్లాలో కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ కారిడార్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 49 జీవో ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు. అటవీ ఉత్పత్తులు హక్కులు కోల్పోవడమే కాకండా 339 ఆదివాసీ గ్రామాలపై ప్రభావం పడుతుందన్నారు. మందమర్రి మున్సిపాలిటీ ఆఫీస్​ ఆవరణలో, రామకృష్ణాపూర్​లోని సింగరేణి సివిక్, రైల్వే సైడింగ్​అడ్డాల వద్ద కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నాలు చేసి 49 జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు.