
ఉడుపి శ్రీకృష్ణ పెజావర మఠం అధిపతి విశ్వేష తీర్థ స్వామి పరమపదించారు. ఆదివారం ఉదయం పెజావర మఠంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగాలేదు. నిన్నట్నుంచి ఆరోగ్యం అత్యంత విషమించడంతో ఆయనకు మంగళూరులోని KMC హాస్పిటల్ చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో డాక్టర్ల సలహా మేరకు ఆయనను హాస్పిటల్ నుంచి మఠానికి తరలించారు. అక్కడే స్వామీజీకి చికిత్స కొనసాగుతుందని పెజావర్ మఠం ప్రకటించింది. మఠానికి వచ్చిన కాసేపటికే ఆయన కన్నుమూశారు. ప్రజల సందర్శనార్థం మహాత్మగాంధీ మైదానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామిజీ పార్ధివదేహాన్ని ఉంచుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వామిజీ మృతదేహాన్ని సందర్శించి తన నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత స్వామిజీ మృతదేహాన్ని మిలటరీ హెలికాప్టర్‌లో బెంగుళూర్‌లోని నేషనల్ కాలేజీకి తరలిస్తారు. అక్కడ కూడా మరో రెండు గంటల పాటు ప్రజల సందర్శనార్థం స్వామిజీ మృతదేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత బెంగుళూరులో స్వామిజీకి చెందిన విద్యాపీఠ్‌లో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
విశ్వేష తీర్థ స్వామి ఏప్రిల్ 27, 1931న కర్ణాటకలోని రామకుంజలో జన్మించారు. ఆయన అసలు పేరు వెంకట రామ. స్వామీజీ తనకు 8 ఏళ్ల వయసులోనే సన్యాసిగా మారారు. ఆ తరువాత ఆయన పేరును విశ్వేష తీర్థ స్వామిగా మార్చుకున్నారు. ఆయన 1988లో పెజావర మఠానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.
స్వామి విశ్వేష తీర్థ మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో, మనస్సుల్లో స్వామిజీ ఉంటారని మోడీ అన్నారు.
‘పెజవర మఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటారు. ఆయన లక్షలాది మంది ప్రజల హృదయాలలో మరియు మనస్సులలో ఉంటాడు’ అని ప్రధాని ట్వీట్ చేశారు.