
- ఇప్పటి వరకు 55 శాతం చలాన్లు క్లియర్
- మిగతావి క్లియర్ అయ్యేందుకు పోలీసుల స్పెషల్ డ్రైవ్
- ఈ నెల 31 వరకు మరోసారి పొడిగింపు
- భారీ డిస్కౌంట్ ఇచ్చినా పట్టించుకోని వాహనదారులు
హైదరాబాద్, వెలుగు : ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసుకోవడంలో వాహన దారులు మొండికేస్తున్నారు. భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఫైన్లు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్లియర్ చేసుకునేందుకు గత నెల26న డిస్కౌంట్ ఆఫర్ అమల్లోకి వచ్చినది తెలిసిందే. ఆర్టీసీ బస్సులు
తోపుడు బండ్లపై 90 శాతం, బైక్స్, ఆటోలపై 80 శాతం,హెవీ వెహికల్స్‌పై 60 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ఆఫర్ అమలులోకి వచ్చిన మొదటి రోజు నుంచి విశేష స్పందన లభించింది. వాహనదారులు పెద్ద ఎత్తున చలాన్లు క్లియర్ చేసుకున్నారు. ఒక దశలో ట్రాఫిక్ వెబ్ సైట్ సర్వర్ కూడా మొరాయించింది.
45 శాతం పెండింగ్
వాహనదారులు రూ.వేలల్లో ఉన్న చలాన్లకు డిస్కౌంట్‌లో రూ.వందలు చెల్లించారు. రూ.20 చెల్లించిన వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నెల10 వరకు 1.29కోట్లు చలాన్లు క్లియర్ అయ్యాయి. ఇందుకు రూ.113కోట్లు ఫైన్లుగా వసూలు అయ్యాయి. అయితే.. మొత్తం చలాన్లలో కేవలం 55 శాతం మాత్రమే క్లియర్ అయ్యాయి.
ఇంకా 45 శాతం చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో పోలీసులు మరో చాన్స్ ఇచ్చారు. డిస్కౌంట్‌ఆఫర్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే గత16 రోజులుగా వసూలైన పేమెంట్స్కు సంబంధించి తలెత్తిన సమస్యలను పరిష్కరించారు.
వెహికల్ చెకింగ్
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో క్లియరెన్స్ చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ వాహనదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో మినహా వెహికల్ చెకింగ్ నిర్వహించనున్నారు. ట్రాఫిక్ జంక్షన్స్,వెహికల్ మూవ్‌మెంట్ ఎక్కువగా ఉండే ప్రధాన రోడ్లలో చలాన్ల డ్రైవ్ చేయనున్నారు. పెండింగ్ చలాన్లతో చిక్కే వారి వద్ద డిస్కౌంట్ ఆఫర్ ఫైన్లు వసూలు చేయనున్నారు.
అయితే.. గత నెల 25న తేదీ తర్వాత విధించిన చలాన్లకు సంబంధించి మాత్రం మొత్తం అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ వల్ల ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.