పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

పెన్షన్ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2001–-02 లో జాతీయ పెన్షన్ పథకం పేరుతో సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకంలో18 నుంచి 60 సంవత్సరాల వయసు గల భారత పౌరులు ఎవరైనా చందాదారులుగా చేరవచ్చు. అలా చేరిన ప్రతి వ్యక్తికి ప్రాన్ కార్డ్ (పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ కార్డు) జారీ చేస్తారు. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలో చేరిన ఉద్యోగులకు, 2004 సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి ఉద్యోగి తన బేసిక్ పే, డీఏలో 10 శాతం చందాగా ప్రతి నెల చెల్లించాలి, అంతే మొత్తంను రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ఉద్యోగి ఖాతాకు జమ చేస్తుంది.

షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో..

ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు నెలసరి పెన్షన్ పొందుటకు 40 శాతం పెన్షన్ ఫండు జమలు, బ్రాండ్స్ కొనుగోలుకు కేటాయిస్తారు. ఈ 40 శాతం పెన్షన్ ఫండును  పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్​మెంట్ అథారిటీ నిర్దేశించిన ఏడు సంస్థల్లో  ఒక దాన్ని ఎంపిక చేసుకొని అందులో పెట్టాలి. దాని ఆధారంగా పెన్షన్ నిర్ధారిస్తారు. ఇది షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు.  సీపీఎస్ ​షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ భరోసా ఏమీ ఉండదు. ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా పెన్షన్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కార్పొరేట్ శక్తులు పెన్షన్ ను నిర్ధారిస్తాయి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్ ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ప్రతి నెలా మూల వేతనం డీఏతో పాటు పది శాతం చందా చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత  ప్రభుత్వ చేయూత ఏమీ ఉండదు. సీపీఎస్ ఉద్యోగి మరణించినా, రిటైర్ అయినా ప్రభుత్వానికి ఏమీ సంబంధం ఉండదు.

పెన్షన్ ఎందుకు ఇయ్యాలంటే..

ఉద్యోగులు వారి సేవలందించి సమాజాభివృద్ధికి కృషి చేస్తారు. వారు గౌరవంగా జీవించడానికి పెన్షన్ ఇవ్వాలి. 1980లో  డీఎస్ నకర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దేవకి నందన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులలో ‘పెన్షన్ దయతో, భిక్షతో ఇచ్చేది కాదు.. అది ఉద్యోగి హక్కు’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కానీ నేటి పాలకులు సుప్రీం తీర్పును లెక్కచేయడం లేదు. ప్రభుత్వ ఖజాన మొత్తం ఉద్యోగుల వేతన, పెన్షన్ లకు ఖర్చు చేయాల్సి వస్తున్నదని, దాన్ని తగ్గించేందుకే ఉద్యోగుల పెన్షన్ ను తొలగించినట్టు విష ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి కార్పొరేట్ వర్గాలకు స్టాక్ మార్కెట్​లో లక్షల కోట్ల రూపాయల నిధులను అందుబాటులో ఉంచేందుకే ఈ నూతన పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఐదు లేదా పదేండ్లు ప్రజాప్రతినిధిగా పని చేసినందుకు జీవిత కాలం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉన్నప్పుడు, జీవితాంతం శక్తినంతా  ధారపోసి సేవలందించిన ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు ఇయ్యరు?

కరోనా విలయ తాండవంలో  హెల్త్ ఉద్యోగులు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు, టీచర్లు ఇతర కార్మిక వర్గాలు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన విషయం నిజమే కదా? వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రభుత్వం తరఫున సేవలు అందించేవారు ఉద్యోగులు. అలాంటి కీలక సేవలందించే ఉద్యోగులకు సామాజిక భద్రత లేకుండా పెన్షన్ తీసేయడం ఎంత వరకు సమంజసం? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు లక్షా ఎనభై వేలకు పైగా, ఏపీలో ఒక లక్షా ఎనభై రెండు వేలు సీపీఎస్ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కోసం పోరాటాలు చేస్తున్నారు.

పాలకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యోగులందరికీ ఒకే విధమైన నిబంధనలు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన పాలకులు అధికార పీఠమెక్కినా సీపీఎస్ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేయడం ఆశ్చర్యకరం. సీపీఎస్ అంతం, ఉద్యోగుల పంతం అంటూ  సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగులనే  భేద భావం లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మేధావులు, ప్రజాస్వామిక వాదులు సీపీఎస్  రద్దు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

- తండ సదానందం, రాష్ట్ర కౌన్సిలర్, టీపీటీఎఫ్