కనిపిస్తే చాలు వెంటపడుతున్నయ్.. హైదరాబాద్లో వీధి కుక్కలతో జనం బెంబేలు

కనిపిస్తే చాలు వెంటపడుతున్నయ్..  హైదరాబాద్లో  వీధి కుక్కలతో జనం బెంబేలు
  • కనిపిస్తే చాలు.. వెంటపడుతున్నయ్ !
  • పిల్లలు, వృద్ధులను వెంటపడి కరుస్తున్నయ్
  • కాలనీలు, బస్తీల్లో గుంపులుగా  తిరుగుతూ వచ్చిపోయే వారిపై  దాడులు 
  • కుక్కల బెడదపై ప్రజావాణిలో భారీగా ఫిర్యాదులు
  • అధికారుల తీరుపై మేయర్ ​విజయలక్ష్మి సీరియస్

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో వీధికుక్కుల బెడద  పెరుగుతోంది. పిల్లలు, వృద్ధులనే ఎక్కువగా టార్గెట్ ​చేస్తున్నాయి. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ వచ్చిపోయే జనాలపై వెంటపడి దాడులకు దిగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి అయిందంటే కాలనీలు, బస్తీల్లో  వాహనాలపై వెళ్లే వారిని సైతం వదలడంలేదు. కుక్క కాటుకు గురై చికిత్స కోసం వచ్చే  బాధితుల సంఖ్య పెరిగిందని నారాయణగూడలోని ఇన్ స్టిట్యూట్​ఆఫ్ ​ప్రివెంటివ్​ మెడిసిన్(ఐపీఎం) అధికారులు తెలిపారు.  

ప్రస్తుతం రోజుకు దాదాపు50 కేసులు వస్తున్నాయని ఐపీఎం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.   కుక్కల బెడద  నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని బల్దియాలోని వెటర్నరీ విభాగం అధికారులు చెబుతున్నారు. కానీ.. సోమవారం బల్దియా ప్రజావాణిలో వీధి కుక్కలపైనే ఎక్కువగా ఫిర్యాదులు రావడం గమనార్హం. దీంతో అధికారుల పనితీరుపై మేయర్​ విజయలక్ష్మి సీరియస్​అయ్యారు. ఎందుకు సరైన చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. వీధి కుక్కలపై నియమించిన హై లెవెల్ ​కమిటీ కూడా సరిగా పని చేయలేదని పేర్కొన్నారు.

కుక్కల బెడదపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేయర్​అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు.  మరో 80వేల కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయని, వాటిని పట్టుకోవడం చాలా కష్టంగా మారిందంటున్నారు.  ప్రస్తుతం 60 బృందాలు పని చేస్తున్నట్టు, కుక్కలను పట్టుకునేందుకు బస్తీలు, కాలనీలకు వెళ్లగానే వెంటనే పసిగట్టి తప్పించుకుంటున్నాయన్నారు.  

ప్రస్తుతం బల్దియా వద్ద 50 వాహనాలు ఉండగా.. పట్టిన కుక్కలను సిటీలోని5  డాగ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నామన్నారు.  ఆయా ప్రాంతాల్లోని 12  ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్స్​కు తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు.  ఐదు రోజులు అబ్జర్వేషన్​లో ఉంచి తిరిగి ఎక్కడి నుంచి పట్టుకు వచ్చారో అక్కడే వదిలేస్తున్నామని అధికారులు తెలిపారు. రోజుకు దాదాపు 200  కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ ​చేయని వాటిని పట్టుకునే పనిలో ఉన్నామన్నారు.  

ఆ కుక్కలను పట్టుకుకోవడం పెద్ద సాహసంగా మారిందని, ఒక ప్రాంతంలో పట్టుకునేందుకు వెళ్లగానే  సిబ్బందిని గుర్తించి పారిపోతున్నాయని, ఎలాగోలా పట్టుకుని వెటర్నరీ ఆస్పత్రులకు తరలిస్తున్నామంటున్నారు. రోజుకు మూడు షిఫ్టుల్లో సిబ్బంది పని చేస్తున్నారన్నారు. ఇటీవల దిల్​సుఖ్​నగర్​లో అపార్ట్​మెంట్​వద్ద బాలుడు ఆడుకుంటుంటే వీధికుక్క దాడి చేసిన ఘటన, బోరబండలో మరో కేసులో పదేళ్ల చిన్నారిపై దాడి వంటివి ఆందోళన కలిగించేలా ఉన్నాయన్నారు.

వీధికుక్కలకు ప్రస్తుతం 85శాతం మేరకు ఆపరేషన్లు చేసినా అవి మళ్లీ దాడులు చేస్తున్న కేసులు నమోదవుతున్నారు.   స్టెరిలైజ్​ చేయని కుక్కలతోనే ప్రమాదం పొంచి ఉందన్నారు. వీధికుక్కల బెడద నియంత్రణకు బల్దియా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.