వానొస్తే మునకే.. గుంతలతో అవస్థలు పడుతున్న ప్రజలు

వానొస్తే మునకే.. గుంతలతో అవస్థలు పడుతున్న ప్రజలు
  • ఉమ్మడి జిల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు హనుమకొండ బస్టాండే కీలకం
  • వానొచ్చినప్పుడల్లా మునుగుతున్న ఆవరణ

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు కీలకమైన హనుమకొండ బస్టాండ్ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఫలితంగా ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. హనుమకొండ బస్టాండ్​ నుంచి నిత్యం 1,200 కుపైగా బస్సులు నడుస్తుండగా, వాటి ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు ప్రయాణం సాగిస్తున్నారు. ఓల్డ్ బస్టాండ్ కూడా శిథిలావస్థకు చేరడంతో ఆఫీసర్లు హనుమకొండలో బస్ టర్మినల్ కు ప్రపోజల్స్ రెడీ చేశారు. బస్టాండ్లు, వరంగల్-1, 2 డిపోలు, ఇతర బిల్డింగులు మొత్తంగా 13 ఎకరాల మేర విస్తరించి ఉండగా, అందులో 5 ఎకరాల స్థలంలో బస్ టర్మినల్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. 60 ప్లాట్ ఫాంలతో ప్లాన్ కూడా రెడీ చేశారు. 

రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, ఆ ప్రాజెక్టును స్మార్ట్ సిటీ పథకంలో చేర్చారు. డీపీఆర్ కూడా ప్రిపేర్ చేశారు. కానీ అప్పటి లీడర్లు పట్టించుకోకుండా బస్ టర్మినల్ ను స్మార్ట్ సిటీ పథకంలో లేకుండా చేశారు. దీంతో హనుమకొండ బస్టాండ్ ఆవరణ చిన్నవాన పడినా చెరువును తలపిస్తోంది. వరద బయటకు వెళ్లే మార్గం లేక నీళ్లు నిలుస్తుండగా, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కోంటున్నాయి.  సీబీఎస్ తోపాటు ఓల్డ్ బస్టాండ్ చుట్టూ నీళ్లు నిలిచి జనాలు అవస్థలు పడాల్సి వస్తోంది. బస్టాండ్ లో ప్లాట్ ఫాంల సమస్య ఉండగా, ఆఫీసర్లు అదనంగా ఏర్పాటు చేశారు.

 ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా కేంద్రంగా నిలుస్తున్న హనుమకొండ బస్టాండ్ సమస్యలకు నిలయంగా మారిందని ఇప్పటికైనా బస్ టర్మినల్ డెవలప్మెంట్ పై ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు దృష్టి పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. బస్​ టెర్మినల్​ విషయమై ఆర్టీసీ వరంగల్​ రీజినల్​ మేనేజర్​ విజయభానును వివరణ కోరగా టెర్మినల్ డెవలప్మెంట్ గురించి గతంలోనే ప్రతిపాదనలు పంపించామని ఆమోదం లభించలేదని తెలిపారు. బస్టాండ్​ఆవరణలో గుంతలను పూడ్చడం, వరద, డ్రైనేజీ నీళ్లు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నామని చెప్పారు.