ఏసీడీ ఛార్జీల బాదుడుపై జనాగ్రహం

ఏసీడీ ఛార్జీల బాదుడుపై జనాగ్రహం
  • ఏసీడీ చార్జీల బాదుడుపై జనాగ్రహం
  • అసలు బిల్లు కంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువ వసూలు
  • డిపాజిట్​ పేరిట గుంజుతున్న డిస్కమ్​లు
  • రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు
  • అప్పటిదాకా బిల్లులు కట్టబోమంటూ ఊర్లలో తీర్మానాలు
  • వసూళ్లకు వస్తున్న కరెంటోళ్ల నిర్బంధాలు

వెలుగు, నెట్​వర్క్: ఇష్టమున్నట్లు కరెంటు బిల్లులను పెంచడం, రకరకాల పేర్లతో అదనపు చార్జీలు వసూలు చేయడంపై జనం మర్లవడ్తున్నారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతున్నారు. బిల్లుల వసూళ్లకు వచ్చే కరెంటోళ్లను నిలదీస్తున్నారు. ఈ నెల కరెంట్​బిల్లుల్లో అడిషనల్​కన్జంప్షన్​ డిపాజిట్(ఏసీడీ) చార్జీలను డిస్కంలు వేశాయి. రెగ్యులర్​ బిల్లుకు మూడు నాలుగు రెట్లు ఈ చార్జీలు ఉన్నాయి. దీంతో జనం మండిపడుతున్నారు. ఇప్పటికే  రెగ్యులర్​ బిల్లులను ఇష్టమున్నట్లు పెంచి.. ఇప్పుడు కొత్తగా డిపాజిట్​పేరుతో వేలకు వేలు వసూలు చేయడం ఏందని  నిలదీస్తున్నారు. ఒక్క నెల బిల్లు కట్టకున్నా కనెక్షన్​ కట్​ చేస్తున్నారని, అట్లాంటిది రెండు, మూడు నెలల బిల్లును అడ్వాన్స్​గా డిపాజిట్​చేయాలంటే ఎక్కడినుంచి తేవాలని వారు  ప్రశ్నిస్తున్నారు. ఏసీడీ చార్జీలు రద్దు చేసే వరకు కరెంట్ బిల్లులు కట్టే ప్రసక్తి లేదంటూ గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు.

300 యూనిట్లలోపు వాడెటోళ్లకు కూడా..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు రాక నష్టాల్లో పూడుకపోయిన డిస్కమ్​లు ఏదో ఒక సాకుతో వినియోగదారులను దోచుకుంటున్నాయి. నిరుడు డెవలప్​మెంట్​చార్జీల పేరుతో సామాన్యుల నడ్డివిరిచిన విద్యుత్ పంపిణీ సంస్థలు.. ఈ నెలలో  ఏసీడీ పేరిట భారం మోపాయి. గతంలో ఇండస్ట్రీలు, కమర్షియల్​కనెక్షన్లకు మాత్రమే ఏసీడీ చార్జీలు వసూలు చేయగా.. నిరుడు 300 యూనిట్లకుపైగా కరెంట్​ వాడిన డొమెస్టిక్​ కనెక్షన్లపైనా ఈ భారం వేశాయి. తాజాగా ఈ నెల నుంచి 300 యూనిట్ల లోపు కరెంట్​వాడుతున్న సామాన్య గృహవినియోగదారులకు కూడా ఏసీడీ చార్జీలు వేస్తున్నాయి. గతేడాది వాడుకున్న యూనిట్లను సగటున నెలకు లెక్కించి, 2 నెలల డిపాజిట్​ను ఈ నెల బిల్లులో వేస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నా.. చాలాచోట్ల అసలు బిల్లుకు మూడు, నాలుగు రెట్లు వేశారు.ఇలా ఈ ఒక్క నెలలోనే నాలుగైదు నెలలకు సమానమైన బిల్లులు చెల్లించాల్సి రావడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రెంట్​కు ఉండేవాళ్లకు, ఓనర్లకు నడుమ పంచాది

ఏసీడీని సర్వీస్​ నెంబర్​పై డిపాజిట్​గా ఉంచుతామని, వినియోగదారులు సర్వీస్​ కనెక్షన్​ రద్దు చేసుకున్నప్పుడు తిరిగి చెల్లిస్తామని ట్రాన్స్​కో ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ, రెగ్యులర్​ బిల్లుల్లోనే ఏసీడీ చార్జీలు వేస్తుండడంతో చాలాచోట్ల ఇండ్ల ఓనర్లకు, రెంట్​కు ఉండేవాళ్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏసీడీ బిల్లు ఇంటి ఓనరే చెల్లించాలని అద్దెకున్నవాళ్లు అంటుంటే.. లేదు అద్దెకున్నవాళ్లు వాడుకున్న యూనిట్ల ఆధారంగానే  యావరేజ్​తీశారు గనుక ఇంట్లో కిరాయికి ఉన్నోళ్లే కట్టాలని ఓనర్లు అంటున్నారు.     

 కట్టబోమంటూ తీర్మానాలు.. నిర్బంధాలు..

అడ్డగోలుగా వేసిన ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్​ డిమాండ్​ చేస్తున్నారు. అప్పటిదాకా కరెంట్​బిల్లులు కట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్తున్నారు. వారం రోజులుగా ఏదో ఒక చోట నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​ మండలం కాప్రి  గ్రామస్తులు  కరెంట్​ సిబ్బందిని పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. ఏసీడీ చార్జీలు రద్దు చేసేంతవరకు కరెంట్ బిల్లులు కట్టబోమంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామస్తులు తీర్మానం చేశారు.  కరెంట్​ బిల్లుల వసూలు కోసం  పంచాయతీ ఆఫీస్ వద్దకు వచ్చిన ఏఈ రాకేశ్​ కుమార్ తో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే పెరిగిన కరెంట్​ చార్జీల వల్ల ఒక నెల కరెంట్ బిల్లు కట్టడమే భారమవుతున్నదని, ఇప్పుడే ఒకే నెలలో ఏసీడీ పేరిట మూడు నెలల బిల్లు ఎలా కట్టాలని నిలదీశారు.  ఏసీడీ చార్జీలను రద్దు చేసేంత వరకు రెగ్యులర్ బిల్లులు కూడా కట్టబోమన్నారు. ఈ గ్రామంలో సుమారు 1,200 డొమెస్టిక్ కనెక్షన్లు ఉండగా, ఏసీడీ చార్జీల కారణంగా ఇప్పటివరకు  5శాతం మంది కూడా బిల్లులు కట్టలేదు. ఇదే జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో ఏసీడీ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్​ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఇటీవల పోస్ట్​కార్డుల ఉద్యమం ప్రారంభించారు.  ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం , నాయకులగూడెం గ్రామాలకు చెందిన ప్రజలు కరెంట్​బిల్లుల వసూలుకు వచ్చిన సిబ్బందికి నిరసన తెలిపారు. రేకులషెడ్లు, గుడిసెల్లో ఒక ఫ్యాన్, ఒక లైట్ ఉన్న వారికి కూడా రూ.500 చొప్పున ఏసీడీ చార్జీలు వేశారని వాపోయారు. ఈ చార్జీలు వెంటనే రద్దు చేయాలని, లేదంటే  బిల్లులు చెల్లించబోమని తేల్చి చెప్పడంతో  విద్యుత్ సిబ్బంది వెనుదిరిగారు. ఇలా రోజురోజుకూ నిరసనలు పెరుగుతుండడంతో కరెంట్​బిల్లుల వసూలుకు వెళ్లేందుకు సిబ్బంది జంకుతున్నారు. 

ఆఫీసులో బంధించి..

ఆదిలాబాద్​ జిల్లా జైనథ్​ మండలం కాఫ్రి  గ్రామస్తులు శుక్రవారం ​బిల్లుల వసూళ్లకు వచ్చిన కరెంటోళ్లను పంచాయతీ ఆఫీసు లోపల ఉంచి బయట తాళం వేశారు. చేతుల్లో కరెంట్​ బిల్లులు పట్టుకొని నిరసన తెలిపారు. ఏసీడీ పేరుతో అడ్డగోలుగా బిల్లులు వేస్తే ఎట్లా కట్టాలంటూ మండిపడ్డారు. ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గ్రామస్తులను సముదాయించి, ఆఫీసు డోర్లు తెరిచారు.

రూ. 200 బిల్లుకురూ. 1,200 ఏసీడీ..

మా ఇంట్ల నాలుగు బల్బులు, మూడు ఫ్యాన్లు ఉన్నయ్​. ప్రతి నెల రెండు వందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది. నిరుడు డెవలప్మెంట్ చార్జీల పేరిట రెండున్నర వేలు వసూలు చేసిన్రు. ఇప్పుడు ఏసీడీ చార్జీలని బిల్లులో అదనంగా రూ. 1,200 వేసిన్రు. కరెంట్ బిల్లులతో పేదలను పరేషాన్ చేస్తున్నరు. ఏసీడీ చార్జీలు రద్దు చేసే దాకా కరెంట్ బిల్లులు కట్టేది లేదని మా ఊరోల్లమంతా తీర్మానం చేసుకున్నం.

- ఎల్​. గంగాధర్, జగ్గసాగర్,
మెట్​పల్లి, జగిత్యాల జిల్లా 

బిల్లు రూ. 545, ఏసీడీ చార్జ్​లు రూ. 3,030

జగిత్యాల పట్టణానికి చెందిన గాజుల రాజేందర్ ఇంటి కరెంట్​ బిల్లు ప్రతి నెలా రూ. 500 నుంచి- 600 వరకు వచ్చేది. ఈ నెల కూడా రూ. 545 కరెంట్ బిల్లు వచ్చింది. కానీ, రూ. 3,030 అదనంగా ఏసీడీ చార్జెస్ వేశారు. ఈ మొత్తం కట్టాలని, లేదంటే కరెంట్​ కనెక్షన్​ కట్​ చేస్తామని కరెంటోళ్లు  చెప్తున్నారు. రెగ్యులర్​గా వచ్చే బిల్లుకు ఐదు రెట్లు చార్జీలు వేసి ఒకేసారి కట్టాలంటే ఎట్లా అని రాజేందర్​ప్రశ్నిస్తున్నాడు. రెగ్యులర్ బిల్లు తీసుకోవాలని ఆఫీసుకు పోతే సిబ్బంది ససేమిరా అన్నారు. ఏసీడీ చార్జెస్​తో కలిపి కడ్తేనే తీసుకుంటామని చెప్పడంతో రాజేందర్​ వెనుదిరిగాడు. 

ఈయన బొమ్మెన రాజేందర్.  జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ వాసి. జీపు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. రాజేందర్​ ఇంటికి  ప్రతి నెలా రూ. 200 నుంచి 400 వరకు కరెంట్ బిల్లు వస్తుంది. ఈ నెల రూ. 445 కరెంట్ బిల్లు రాగా అదనంగా ఏసీడీ చార్జీల పేరిట రు.1,285 వేశారు. చాలీచాలని జీతంతో కుటుంబ అవసరాలు తీరుస్తున్న రాజేందర్ కు ఇంత మొత్తం బిల్లు ఎలా కట్టాలో తెలియక ఆందోళనకు గురవుతున్నాడు.  

ఆందోళన బాటలో ప్రతిపక్షాలు

ఏసీడీ చార్జీలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన బాటపడ్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలుచోట్ల బీజేపీ, కాంగ్రెస్​ నేతలు నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా  రామగుండం ఎన్‌‌పీడీసీఎల్‌‌ ఏఈ ఆఫీస్‌‌ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏసీడీ బిల్లుల పెంపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, వాటిని వెంటనే రద్దు చేయాలని లీడర్లు డిమాండ్‌‌ చేశారు. కాంగ్రెస్​ నేత, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో నేతలు పెద్దపల్లి ట్రాన్స్​కో ఎస్​ఈ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఏసీడీ చార్జీలు ఎత్తేయాలంటూ ఎస్​ఈకి వినతిపత్రం అందజేశారు.  కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డీఈ ఆఫీసు ఎదుట ఆందోళన కు దిగారు. ఏసీడీ చార్జీలు వెంటనే ఎత్తేయాలని డిమాండ్​ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్​ చేసి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు.  

కరెంట్ బిల్లు కంటే ఏసీడీ బిల్లే ఎక్కువ 

ఈ నెలలో మాకు రూ.300 రెగ్యులర్​ బిల్లు వస్తే.. ఏసీడీ చార్జీలు రూ.4 వేలు వేశారు. ఇదేందని అధికారులను అడిగితే డిపాజిట్​ అని చెప్తున్నారు. ఇదెక్కడి అన్యాయం? డిపాజిట్ల పేరుతో ఇంతలా దోచుకుంటరా?  ఏసీడీ చార్జీలు వెంటనే రద్దు చేయాలి. అప్పటిదాకా కరెంట్​ బిల్లులు కట్టం.
-సామ పోతారెడ్డి, కాప్రి గ్రామం, 
జైనథ్ మండలం, ఆదిలాబాద్​ జిల్లా