చెట్లు నరికి ఫారెస్ట్​ భూమి కబ్జాకు యత్నం

చెట్లు నరికి ఫారెస్ట్​ భూమి కబ్జాకు యత్నం

గండీడ్, వెలుగు: మహమ్మదాబాద్ మండలం గాదిర్యాల్  అటవీ ప్రాంతంలోని ఏండ్ల నాటి చెట్లను నరికివేసి భూమిని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా, ఫారెస్ట్​ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని సర్వే నెంబర్ 70లోని భూమిని ప్రభుత్వం కొన్నేండ్ల కింద పట్టా చేసి ఇచ్చింది. అయితే వారు పక్కనే ఉన్న అటవీ భూమిపై కన్నేశారు. తాజాగా అడవిలో ఉన్న భారీ చెట్లను కొట్టి ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు.

దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఫారెస్ట్ భూమిని కాజేస్తున్నారని, ఫారెస్ట్  సిబ్బంది వచ్చారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి వచ్చిన ఫారెస్ట్​ అధికారులను ఈ విషయమై గ్రామస్తులు నిలదీశారు. ఈ విషయమై మహమ్మదాబాద్  ఎఫ్ఆర్వోను సంప్రదించగా, గాదిర్యాల్  గ్రామంలో చెట్లు నరికి కబ్జాకు యత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.