లాయర్లకు పిచ్చెక్కిస్తున్న విడాకుల కేసులు : AIలో విషయాలు తెలుసుకుని వాదనలు..

 లాయర్లకు పిచ్చెక్కిస్తున్న విడాకుల కేసులు : AIలో విషయాలు తెలుసుకుని వాదనలు..

ఈ రోజుల్లో ఏ చిన్న డౌట్  వచ్చినా చాలామంది  ఏఐ చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ఉద్యోగాలు ఇలా ప్రతి అంశంపై ఏఐని అడుగుతున్నారు. చివరికి విడాకులు, పిల్లల సంరక్షణ హక్కులు వంటి క్లిష్టమైన న్యాయ విషయాల్లోనూ ఏఐ సలహాలు తీసుకుంటున్నారు. అయితే ఏఐ ఇచ్చే న్యాయ సలహాలు అన్ని సందర్భాల్లో సరైనవేనా ? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏఐ ఇచ్చే సమాధానాలను నమ్మి కోర్టులకు వెళ్లడం వల్ల కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుటుంబ న్యాయవాదులు చెబుతున్నారు. ఏఐ సలహాలతో తయారు చేసిన పేజీల కొద్దీ పిటిషన్లు, న్యాయపరమైన వాదనలతో  క్లయింట్లు వస్తున్నారని అంటున్నారు.

ఏఐ సలహాలతో న్యాయవాదులకు కొత్త సమస్యలు
టొరంటోకు చెందిన కుటుంబ న్యాయవాది స్టీవెన్ బెన్మోర్‌కు ఇటీవల ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన క్లయింట్ కోరిన విధంగా ఆయన ఒక వివాహపూర్వ ఒప్పందాన్ని తయారు చేశారు. అయితే ఆ తర్వాత క్లయింట్ ఏకంగా 13 సవరణలతో కూడిన లిస్ట్  పంపించారు. ఆ సవరణలు చాలా క్లిష్టంగా ఉండటంతో, వాటిని ఒక మనిషి ఆలోచించడం కూడా కష్టమని బెన్మోర్ చెప్పారు.

తన క్లయింట్ ఏఐ చాట్‌బాట్ సలహాలు తీసుకున్నారని ఆయనకు అర్థమైంది. ఆ చాట్‌బాట్ ఇచ్చిన సలహాలు ఎందుకు తప్పో వివరించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తే, క్లయింట్‌కు అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తుందని కూడా ఆయన భావించారు.

బెన్మోర్‌కు ఇలాంటి అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారి కాదు. విడాకులు, పిల్లల సంరక్షణ హక్కులు, వివాహపూర్వ ఒప్పందాలు వంటి కేసుల్లో ఏఐ సలహాలు తీసుకుని న్యాయవాదుల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు.

కార్డెల్ & కార్డెల్ అనే కుటుంబ న్యాయ సంస్థ 133 మంది న్యాయవాదులపై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 80 శాతం మంది న్యాయవాదులు  క్లయింట్లు పంపిన లేఖలు, పిటిషన్లు, న్యాయపరమైన సూచనలు ఏఐ ద్వారా తయారైనవేనని భావిస్తున్నట్లు చెప్పారు.

ఏఐ ఇచ్చే న్యాయ సలహాలు ఎందుకు ప్రమాదకరం?
ఒక వ్యక్తి తనకు జరిగిన విషయాలను మాత్రమే ఏఐకి వివరిస్తే, ఆ సమాచారం ఆధారంగా చాట్‌బాట్ సమాధానం ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి చెప్పిన విషయాలు పూర్తిగా నిజమా? అవతలి వ్యక్తి వాదన ఏమిటి? కోర్టులో ఏ ఆధారాలు ఉన్నాయి? అనే విషయాలను ఏఐ పూర్తిగా పరిశీలించలేకపోవచ్చు. దీంతో కొన్నిసార్లు ఒక వ్యక్తి కోరుకున్న సమాధానమే ఏఐ నుంచి వస్తుంది. కానీ అదే సమాధానం కోర్టులో సరైనదని చెప్పలేం.

విడాకుల సమయంలో ఆర్థిక సమస్యలు, పిల్లల సంరక్షణ వంటి అంశాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. న్యాయవాదిని నియమించుకోవడానికి డబ్బు, సమయం అవసరం. అర్ధరాత్రి అయినా వెంటనే సమాధానం చెప్పే ఏఐని ఆశ్రయించడం సులభంగా మారింది. అయితే ఏఐ ఇచ్చే సమాచారం న్యాయవాది సలహాకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ సలహా నమ్మి న్యాయమూర్తికి లేఖ రాసిన వ్యక్తి
జార్జియాలోని లాగ్రాంజ్‌కు చెందిన 35 ఏళ్ల లోగన్ బర్న్స్ తన విడాకుల కేసులో చాట్‌జీపీటీ సలహాలు తీసుకున్నారు. ఆయన   రూఫింగ్ సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. గత ఏడాది తన వివాహం బ్రేక్ ఆయినప్పుడు ఆయన ఒక న్యాయవాదికి 2,500 డాలర్లు అడ్వాన్స్‌గా చెల్లించారు. అయితే తర్వాత భార్యాభర్తలు విడాకుల ప్రక్రియను నిలిపివేసి, రాజీ పడేందుకు ప్రయత్నించారు.

ఆ సమయంలో ఆయన భార్య పిల్లలను తీసుకుని మోంటానాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. రాజీ ప్రయత్నాలు విఫలమవడంతో పిల్లల సంరక్షణ హక్కుల కోసం పోరాటం మొదలైంది. ఈ కేసులో ఒక న్యాయవాది 7,000 డాలర్లు అడగడంతో బర్న్స్ మరో మార్గాన్ని ఎంచుకున్నారు. నెలకు 19.99 డాలర్లు చెల్లించి చాట్‌బాట్ సేవలను ఉపయోగించడం ప్రారంభించారు. "ఇది ఒక న్యాయవాది చేయాల్సిన పనిని,  ఒక పారాలీగల్ చేయాల్సిన పనిని చేస్తోంది" అని ఆయన అన్నారు.

చాట్‌జీపీటీ చెప్పిన నిబంధనతో కోర్టులో ఇబ్బంది
ఒక బిడ్డ ఒక రాష్ట్రంలో ఆరు నెలలు నివసించిన తర్వాత, సాధారణంగా ఆ రాష్ట్రంలోని కోర్టులకు పిల్లల సంరక్షణ హక్కులపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని చాట్‌జీపీటీ బర్న్స్‌కు వివరించింది. అయితే ఆయన పిల్లలు మోంటానాలో ఆరు నెలల కంటే తక్కువ కాలమే ఉన్నారు. దీంతో పిల్లల సంరక్షణ కేసును జార్జియాకు బదిలీ చేయాలని బర్న్స్ భావించారు. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాచారాన్ని నమ్మి, మోంటానా కోర్టుకు ఈ కేసును విచారించే అధికారం లేదని న్యాయమూర్తికి లేఖ రాశారు.

కానీ న్యాయమూర్తి ఆయన వాదనను అంగీకరించలేదు. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, బర్న్స్ స్వయంగా అత్యవసర అభ్యర్థనను కూడా దాఖలు చేశారని వివరించారు. దీంతో బర్న్స్ న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయనకు పిల్లల తాత్కాలిక సంరక్షణ హక్కు ఉంది.


భరణం తగ్గించుకోవాలని ఏఐని నమ్మి.. రెండేళ్లు పోరాటం
లాస్ ఏంజిల్స్‌కు చెందిన కుటుంబ న్యాయవాది హొస్సేన్ బెరెంజీకి ఒక క్లయింట్ నుంచి ఇలాంటి కేసు వచ్చింది. ఒక ఆన్‌లైన్ వెల్ నెస్ కంపెనీ యజమాని తన విడాకుల ఒప్పందంలో భారీ భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. కొన్నేళ్ల తర్వాత తన వ్యాపారం నుంచి తక్కువ ఆదాయం వస్తోందని, భరణం తగ్గించుకోవచ్చా అని ఏఐని అడిగాడు. చాట్‌బాట్ అతనికి ఈ కేసులో సులభంగా విజయం సాధించవచ్చని చెప్పింది.

అయితే ఆ చాట్‌బాట్ అతని ఆర్థిక నివేదికలను, వ్యాపార ఖర్చులను పరిశీలించలేదు. అతను చెప్పిన విషయాలనే నమ్మి సమాధానం ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఒక న్యాయవాదిని నియమించుకుని, ఏఐ సూచించిన వ్యూహాన్ని అనుసరించమని కోరాడు. 2024 చివర్లో భరణం తగ్గించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అవతలి పక్షం న్యాయవాది అదే కంపెనీ రికార్డులను పరిశీలించి, అతని ఆదాయం నిజంగా తగ్గలేదని వాదించారు. దాదాపు ఏడాది తర్వాత న్యాయమూర్తి కూడా ఆ వాదనను అంగీకరించారు. దీంతో ఆ వ్యక్తి తన న్యాయవాదిని నిందించి, బెరెంజీ సంస్థను ఆశ్రయించాడు.

ఆ తర్వాత ఫోరెన్సిక్ అకౌంటెంట్‌ను నియమించి కంపెనీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించారు. కంపెనీ ఉత్పత్తుల్లో చాలా వరకు పాడైపోవడం, అమ్మకాలు జరిగినప్పటికీ నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉండటం వంటి విషయాలు బయటపడ్డాయి. ఇటీవల జరిగిన విచారణలో న్యాయమూర్తి అతని ఆర్థిక పరిస్థితి మారిందని తాత్కాలికంగా అంగీకరించి, ప్రస్తుతం భరణం చెల్లింపులను నిలిపివేశారు.

అయితే ఏఐ చెప్పిన సులభమైన విజయం కోసం రెండు న్యాయ సంస్థలను ఆశ్రయించాల్సి వచ్చిందని, దాదాపు రెండేళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందని బెరెంజీ తెలిపారు.

ఏఐతో పిటిషన్లు.. న్యాయమూర్తి హెచ్చరిక
డెన్వర్‌కు చెందిన కుటుంబ న్యాయవాది మహా కమల్ మరో కేసులో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. పిల్లల తల్లి కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఒక తండ్రి వరుసగా పిటిషన్లు దాఖలు చేయడం ప్రారంభించాడు. న్యాయమూర్తి ఒక పిటిషన్‌ను తిరస్కరిస్తే, మరోటి దాఖలు చేసేవాడు. ఆ పిటిషన్లు ఏఐ ద్వారా తయారైనట్లు అనిపించిందని కమల్ తెలిపారు. వాటిలో ఒక పిటిషన్‌లో అసలు ఉనికిలో లేని న్యాయపరమైన సూత్రాన్ని ప్రస్తావించారని ఆమె గుర్తించారు. ఇప్పటికే తొమ్మిది ఫిర్యాదులు దాఖలయ్యాయి. దీంతో న్యాయమూర్తి తల్లిదండ్రులిద్దరినీ పిలిపించి, మరోసారి ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తే జరిమానాలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆ తండ్రి పిటిషన్లు దాఖలు చేయడం ఆపలేదు. చివరికి న్యాయమూర్తి తరువాత పిటిషన్లను విచారణకు స్వీకరించబోమని చెప్పారు. దింతో తల్లిదండ్రులు రాజీకి వచ్చారు.

ఏఐతో 145 పిటిషన్లు.. చివరికి న్యాయవాది సంతకం తప్పనిసరి
ఏఐ సలహాలతో కోర్టులను ఆశ్రయిస్తున్న వారిపై న్యాయమూర్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి తన విడాకుల కేసులో స్వయంగా వాదించుకుంటూ, ఏఐ సహాయంతో కనీసం 145 పిటిషన్లు దాఖలు చేశాడు. తన వాదనను వివరించేందుకు ఏఐ రూపొందించిన 45 పేజీల పత్రంతో పాటు 863 పేజీల అనుబంధాన్ని అప్పీల్ కోర్టుకు పంపించాడు. దీంతో మే నెలలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఆ వ్యక్తి దాఖలు చేసే పిటిషన్లపై న్యాయవాది సంతకం తప్పనిసరి అని, అలా లేకపోతే వాటిని తిరస్కరించాలని కోర్టు క్లర్క్‌ను ఆదేశించింది.

మొత్తంగా చూస్తే.. ఏఐ ఇచ్చే సమాచారం ప్రాథమిక అవగాహన కోసం ఉపయోగపడవచ్చు. కానీ విడాకులు, పిల్లల సంరక్షణ హక్కులు, భరణం వంటి కీలక న్యాయ విషయాల్లో ఏఐ సలహాలనే పూర్తిగా నమ్మడం ప్రమాదకరం. ప్రతి కేసులో వాస్తవాలు, ఆధారాలు, చట్టాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఏఐ ఇచ్చిన సమాచారాన్ని న్యాయవాదితో పరిశీలించుకోవడం అవసరం.