- పేదలకు పోషకాలు అందాలని రేషన్‌లో ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తున్న కేంద్రం
- పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు సప్లయ్
- ప్రజలకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం
ఆదిలాబాద్, వెలుగు: పేదలకు బలమైన ఆహారాన్ని అందించాలని రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ కలిపి పంపిణీ చేస్తుండగా.. అవగాహన లేక జనం వాటిని తినడం లేదు. బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ గింజలు తేలికగా వేరే రంగులో ఉండడం, అన్నం ముద్దగా అవుతుండడంతో అవి ప్లాస్టిక్ బియ్యమనుకొని వండుకోవడం లేదు. బియ్యం ఇట్ల ఎందుకున్నాయని డీలర్లను అడిగితే, వాళ్లకు తెలియక వాళ్లేం చెప్పకపోవడంతో వాటిని పక్కన పడేస్తున్నారు. కేంద్రం సప్లై చేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ గురించి, వాటిలోని పోషక విలువల గురించి రాష్ట్ర అధికారులు ప్రజలకు కనీస అవగాహన కల్పించడం లేదు. దీంతో 4 నెలలుగా రేషన్‌షాపుల నుంచి తీసుకుంటున్న ఫోర్టిఫైడ్ రైస్ ను ప్రజలు వాడుకుంటలేరు. కొందరు ఫోర్టిఫైడ్ రైస్ గింజలను ఏరిపారేసి వండుకుంటుండగా.. చాలామంది అమ్ముకుంటున్నారు.
పోషకాలు కలుపుతరు...
దేశవ్యాప్తంగా 2024 నాటికి పోషక విలువలున్న బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పీఏం పోషణ్‌అభియాన్ కింద అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేస్తోంది. రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ చేసేందుకు ఏప్రిల్ లో కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. రైస్ ఫోర్టిఫికేషన్కోసం ఏడాదికి దాదాపు రూ.2,700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొదటివిడత 151 జిల్లాలను ఎంపిక చేయగా, మార్చి 2023 నాటికి 291 జిల్లాలకు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో పోషకాహార లోపం, రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. రేషన్ షాపుల ద్వారా మే నుంచి ఫోర్టిఫైడ్రైస్ సప్లై చేస్తోంది. ఈ రైస్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి పోషకాలు చేరుస్తారు. మామూలుగా బియ్యాన్ని పాలిష్ చేసినప్పుడు సహజంగా ఉండే ఖనిజాలు, పోషకాలు పోతాయి. బియ్యంలో పోషక విలువలను జత చేయడాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు. బియ్యాన్ని పిండి చేసి అందులో విటమిన్లు, ఖనిజాలను కలిపి తిరిగి బియ్యపు గింజలుగా తయారు చేస్తారు. ఇలా తయారైన వాటినే ఫోర్టిఫైడ్ కెర్నాల్స్ అంటారు. పీడీఎస్ బియ్యంలో ఒక్క శాతం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నాల్స్ ను కలుపుతారు. ఇలా కలిపిన బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అందిస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేస్తారు.
అమ్ముకుంటున్నరు..
ఈ బియ్యం గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించకపోవడం వల్ల వాటిని తినడానికి భయపడుతున్నారు. ఆదిలాబాద్‌తో పాటు మిగిలిన మూడు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో 356 రేషన్ షాపులున్నాయి. దాదాపు 2 లక్షల కార్డులుండగా 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ప్రజలు ఈ బియ్యాన్ని వండుకోవడం లేదు. ఆసిఫాబాద్ ప్రజలు ఈ బియ్యాన్ని తినకుండా దళారులకు అమ్ముతుండడంతో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సగం ఫోర్టిఫైడ్.. సగం మామూలు రైస్ పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆ బియ్యాన్ని చూసి ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ లబ్దిదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా చోట్ల ఫోర్టిఫైడ్రైస్గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. డీలర్లకు కూడా ఈ రైస్ గురించి తెలియక లబ్ధిదారులు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. ప్లాస్టిక్ బియ్యం అనుకుని వాటిని అమ్ముకొని సన్నరకం బియ్యం కొనుక్కుంటున్నారు.
ఏరిపడేసిన..
మాకు 20 కిలోల రేషన్ బియ్యం వస్తుంది. రెండు నెలల కింద తీసుకున్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం గింజలున్నయని తీసి పడేసిన. వేరే వారిని అడిగితే అందరికీ ప్లాస్టిక్ బియ్యమే వచ్చినయన్నరు. ఆ బియ్యం వండుకోలేదు. అవి మంచి బియ్యమని ఎవరూ చెప్పలేదు. ఆ బియ్యం ఒక్క నెలనే వచ్చాయి. ఇప్పుడు మామూలు బియ్యం వస్తున్నాయి.
- రాములు యాదవ్, గిర్నూర్
అన్ని షాపులకు సప్లై..
జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులకు ఫోర్టిఫైడ్ రైస్ ను సరఫరా చేస్తున్నాం. ఈ రైస్ ద్వారా పోషక విలువలు లభిస్తాయి. లబ్ధిదారులు ఈ బియ్యం వండుకొని తినాలి. జిల్లా వ్యాప్తంగా 9 వేల మెట్రిక్ టన్నులు సప్లై చేయగా అందులో 4 వేల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం.
- సుదర్శన్, డీఎస్ఓ, ఆదిలాబాద్
