వేలిముద్రలు లేకున్నా ఆధార్​ కార్డు తీసుకోవచ్చు

వేలిముద్రలు లేకున్నా ఆధార్​ కార్డు తీసుకోవచ్చు

 న్యూఢిల్లీ: ఆధార్​ కార్డ్​ పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి వేలిముద్రలు అందుబాటులో లేనట్లయితే ఐరిస్ (కనుపాప)ను  స్కాన్‌‌ చేసి నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వేళ్లు లేని కారణంగా ఆధార్ తీసుకోలేకపోయిన కేరళ మహిళ జోసిమోల్ పి జోస్ గురించి తెలుసుకున్న కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆమె కార్డు ఇప్పించారు.  “యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఏడీఏఐ) బృందం అదే రోజు కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకంలోని ఆమె ఇంటికి వెళ్లి ఆధార్ నంబర్‌‌ను రూపొందించింది. ఎవరికైనా వేలిముద్రలు లేదా అలాంటి వైకల్యం ఉంటే ప్రత్యామ్నాయ బయోమెట్రిక్స్ తీసుకోవడం ద్వారా ఆధార్ జారీ చేయాలని సూచనలను ఇచ్చాం.

ఈ మేరకు అన్ని ఆధార్ సేవా కేంద్రాలకు సమాచారం పంపించాం” అని ఆయన తెలిపారు. ఆధార్‌‌కు అర్హత ఉండి వేలిముద్రలు అందించలేని వ్యక్తి ఐరిస్ స్కాన్‌‌ను మాత్రమే ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు.  ఏ కారణం వల్లనైనా కనుపాపలను క్యాప్చర్ చేయకుంటే వేలిముద్రను మాత్రమే ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు. వేళ్లు,  కనుపాపల బయోమెట్రిక్‌‌లు రెండింటినీ అందించలేని అర్హత కలిగిన వ్యక్తి, రెండింటిలో దేనినీ ఇవ్వకుండా కూడా కార్డు తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్లు పేరు, లింగం, చిరునామా,  పుట్టిన తేదీ,  సంవత్సరం వంటి వివరాలను ఇవ్వాలి.  ఎన్‌‌రోల్‌‌మెంట్ సాఫ్ట్‌‌వేర్‌‌లో అందుబాటులో ఉన్న బయోమెట్రిక్స్​ను తీసుకుంటారు. వేళ్లు లేదా కనుపాప లేదా రెండూ అందుబాటులో లేవని తెలిసేలా ఫొటో తీస్తారు. ఆధార్ ఎన్‌‌రోల్‌‌మెంట్ సెంటర్ సూపర్‌‌వైజర్ అటువంటి నమోదును ‘అసాధారణ’మని పేర్కొనాలి. యూఏడీఏఐ ప్రతి రోజు సుమారు 1,000 ఇలాంటి అసాధారణ కేసుల్లో ఆధార్​కార్డులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి 29 లక్షల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి.