బస్సుల్లేక జనం తిప్పలు .. విషయం తెలిసికూడా ఏర్పాట్లు చేయని ఆర్టీసీ

బస్సుల్లేక  జనం తిప్పలు .. విషయం తెలిసికూడా ఏర్పాట్లు చేయని ఆర్టీసీ
  • బస్సుల్లేక  జనం తిప్పలు 
  • ఎన్నికలకు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఇబ్బందులు
  • సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వంపై పబ్లిక్ ఆగ్రహం  
  • సిటీ శివార్లలోని టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఉంటున్న జనం ఎన్నికల కోసం సొంతూళ్లకు వెళ్లేందుకు తిప్పలు పడ్డారు. బస్సులు దొరక్క గంటలకొద్దీ బస్టాండ్లలోనే వేచి చూశారు. ఊర్లకు పోయేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బస్సుల్లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలామంది సొంత కార్లు, బైకులతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. దీంతో సిటీ శివార్లలోని భువనగిరి, పంతంగి తదితర టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ, వరంగల్, ఓల్డ్ ముంబై, రాజీవ్ గాంధీ నేషనల్ హైవేలలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, చాలామంది సొంతూళ్లలో ఓటేసిన తర్వాత మళ్లీ గురువారం సాయంత్రమే హైదరాబాద్​కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలోనూ బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. సొంత వెహికల్స్ లో వెళ్లినోళ్లూ తిరిగి రావడంతో మళ్లీ సిటీ శివార్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా, బస్సుల్లేక ప్రయాణికులు తిప్పలు పడగా.. ఆర్టీసీ అధికారులు మాత్రం ఎన్నికల కోసం ప్రత్యేక బస్సులు నడిపామని పేర్కొన్నారు. అదనంగా 750 బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఎంజీబీఎస్​లో ప్రయాణికుల ఆందోళన..  

ఓటు వేసేందుకు గత మూడ్రోజుల నుంచే జనం సొంతూళ్లకు వెళ్లారు. బుధవారం రాత్రి భారీ సంఖ్యలో సిటీలోని ప్రధాన బస్ స్టేషన్లకు చేరుకున్నారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సూర్యాపేట, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాది మంది ఎంజీబీఎస్​కు వచ్చారు. అక్కడ సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సులపై ఎక్కి ప్రయాణించారు. మరికొందరు గంటల పాటు బస్సుల్లో నిల్చొని వెళ్లారు. ఎంజీబీఎస్​కు దాదాపు 2 వేల మంది రాగా.. సరిపడా బస్సులను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఓటు వేయాలని ప్రచారం చేసే ప్రభుత్వమే.. ఊర్లకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. కొన్ని బస్సులే ఏర్పాటు చేశారని, వాటిల్లోనూ రిజర్వేషన్లతో సీట్లు మొత్తం ఫుల్ అయ్యాయని పేర్కొన్నారు. తాము వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ డౌన్ డౌన్, టీఎస్ ఆర్టీసీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. బస్సుల సంఖ్యను ఎందుకు పెంచలేదని అక్కడున్న ఆర్టీసీ అధికారులను నిలదీశారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే రూ.వేలల్లో దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుగు ప్రయాణంలోనూ తప్పని అవస్థలు..  

ఓట్ల కోసం ఊర్లకు వెళ్లిన చాలామంది గురువారం సాయంత్రమే సిటీకి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వాళ్లకు వచ్చేటప్పుడు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఊర్ల నుంచి హైదరాబాద్ కు వచ్చే బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. చాలామంది బస్సులు దొరక్క రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, జనమంతా ఊర్లకు వెళ్లడంతో గురువారం హైదరాబాద్ సిటీ బోసిపోయి కనిపించింది. పోలింగ్ డే కావడంతో షాపులు, ఆఫీసులన్నీ బంద్ చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మెట్రో కూడా ప్రయాణికులు లేక ఖాళీగా కనిపించింది.