బీజేపీ సర్కార్​పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది: మోదీ

బీజేపీ సర్కార్​పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది: మోదీ
  • పేదరికం, యువత, మహిళలు, రైతులే నాకు తెలిసిన వర్గాలు
  • వీళ్ల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యం
  • అర్హులైన వారందరికీ పథకాలు వర్తింపజేస్తామన్న ప్రధాని

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. సంక్షేమ ఫలాలు అందాలంటే ‘బాంచన్ దొర’ అని వేడుకోవాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు నిరుపేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. బాంచన్ దొర అనే బతుకులు పోయినయ్ అని అన్నారు. ‘‘నా దృష్టిలో కులం, వర్గం, మతం అంటూ ఏదీ లేదు.. నాకు తెలిసిన వర్గాలు నాలుగు మాత్రమే.. అవే, పేదరికం, యువత, మహిళలు, రైతులు. ఈ నాలుగు వర్గాలు అభివృద్ధి చెందితే.. దేశం డెవలప్ అయితది”అని మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు. ‘మోదీకి గ్యారంటీ వాలీ గాడీ’ పేరుతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగుతున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికి లబ్ధి చేకూరడం లేదో ఆరా తీశారు. ఏఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో వివరించారు.

హామీలన్నీ అమలు చేస్తాం.. మీ ఆశీర్వాదం కావాలి

ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని, దీని కోసం అందరి ఆశీర్వాదాలు కావాలని ప్రధాని మోదీ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని భరోసా ఇచ్చారు. దేశంలోని అన్ని చోట్ల ఈ యాత్ర కొనసాగుతున్నదన్నారు. ప్రతి చోటా మంచి స్పందన లభిస్తున్నదని వివరించారు. పదేండ్లలో చేసిన అభివృద్ధే.. తమ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెంచిందన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమం పట్టించుకోలేదని, అందుకే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా కొన్ని చోట్ల పేదరికం ఉందని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉందని వివరించారు. గతంలో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు కావాలంటే.. నెలల తరబడి తిరగాల్సి వచ్చేదన్నారు. కమీషన్ల కోసం దళారులు ఎగబడేవారని, సంక్షేమ పథకాలు నిరుపేదలకు దక్కేవి కావని తెలిపారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వం తుడిచిపెట్టేసిందన్నారు. తమకు అధికారం కంటే.. ప్రజా సేవే ముఖ్యమని స్పష్టం చేశారు.

మహిళల కోసం ‘డ్రోన్ దీదీ యోజన’

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభించి 15 రోజులైందని, ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని మోదీ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు డ్రోన్ల పంపిణీతో పాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25,000కు పెంచుతామన్నారు. ‘డ్రోన్ దీదీ యోజన’ కింద 15వేల డ్వాక్రా గ్రూప్​లకు డ్రోన్లు అందజేస్తామని తెలిపారు. వీటిని వ్యవసాయం కోసం రైతులకు కిరాయికి ఇచ్చి లబ్ధి పొందొచ్చన్నారు. దీంతో గ్రామాల్లో మహిళలకు గౌరవం పెరుగుతుందన్నారు.