ఇబ్బందుల్లో ప్రజలు..అదుపులేని దోపిడీ..కానరాని నియంత్రణ

ఇబ్బందుల్లో ప్రజలు..అదుపులేని దోపిడీ..కానరాని నియంత్రణ

ములుకోలతో నీవొకటంటే... తలుపుచెక్కతో నేనొకటిస్తా’’ ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పంథా! నిత్యం విమర్శలు – ప్రతి విమర్శలు, ఆరోపణలు – ప్రత్యారోపణలు. తమను ఎక్కువ చేసుకొని, ఎదుటి వారిని తగ్గించేందుకు వ్యూహాలు– ప్రతివ్యూహాలతోనే రాజకీయ పార్టీలకు కాలం గడిచిపోతున్నది. ఒకప్పటిలా.. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలనే పద్ధతి పోయింది. ఏడాదికి 365 రోజులూ రాజకీయమే!

నిద్ర లేచింది మొదలు అంతా ఇదే అయిపోయింది. నువ్వెంత అంటే, నువ్వెంత! అనుకుంటారు. ఒకర్నొకరు ఘోరంగా తిట్టుకుంటారు, లేదంటే కేసులు పెట్టుకుంటారు. అవసరమైతే తమ వాళ్లతో ప్రత్యర్థి నాయకుల ఇండ్ల మీదికి దాడికీ తలపడతారు. ఇలా నిత్యం వార్తల్లో ఉంటారు తప్ప, పాలక – విపక్షాలకు ప్రజాసమస్యలు మాత్రం పట్టవు. అవసరమైతే, ప్రజా సమస్యలనూ ఆసరా చేసుకొని మరింత తిట్టుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు, ఎదుటి వాళ్లని ఖండ ఖండాలుగా ఖండిస్తారు.

కానీ, అవే సమస్యల పరిష్కారం పట్ల ఎవరికీ చిత్తశుద్ధి, కార్యాచరణ లేదు. దానికంత ప్రాధాన్యతే ఇవ్వరు. ఇస్తే విద్య, వైద్యం, ఉద్యోగ – ఉపాధులు, వ్యవసాయం – భూ వినియోగం ఇలా విస్త్రత జనజీవనంతో ముడివడి ఉన్న ఇన్ని ప్రాధాన్యతాంశాల్లో సమస్యలు ఎందుకు పేరుకుపోయి ఉంటాయి? ఏండ్లుగా ఎందుకు తిష్ట వేస్తాయి? వాటికెందుకు కచ్చితమైన పరిష్కారాలు లభించవు? అక్కడే ఉంది మతలబు! విచ్ఛలవిడిగా డబ్బు ఖర్చుపెట్టడంతో పాటు రాజకీయంగా అనునిత్యం తాము చేసే కసరత్తులు, సాముగరిడీలే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయని వారు బలంగా నమ్ముతున్నారు.

అందుకే, ఆ ఖాతాలో ఎక్కువ మార్కుల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రజలు, వారి అవసరాలు, సమస్యల పరిష్కారాలు, వారి సంక్షేమం – అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు ఇవేవీ వారికి ప్రాధాన్యతాంశాలు కావు. అవి ఓట్ల వర్షం కురిపించవు, అధికారాన్ని అందివ్వలేవని వారి గట్టి నమ్మకం. గద్దెనెక్కి పాలన పగ్గాలు చేపట్టిన అధికార పక్షంతోపాటు బాధ్యతగా జనం కోసం నిలబడాల్సిన విపక్షమూ ఈ పంథానే కొనసాగిస్తున్నది.

సామాన్య జనం సమస్యలపై అంతో ఇంతో కదిలే కమ్యూనిస్టులు పాలకపక్షం చంకలో చేరాక, ఇక ‘ఆ అధ్యాయమూ’ ముగిసినట్టేనేమో? సమకాలీన మీడియా కూడా రాజకీయపక్షాల బాటనే నడుస్తున్నది. అప్పుడప్పుడు ప్రజా సమస్యల్ని, వారెదుర్కొంటున్న కష్టాల్ని, ప్రభుత్వ పథకాల విజయ – వైఫల్యాల్ని ఎలుగెత్తి – ఎండగడుతున్నా, ఎక్కువ సమయం, స్థలం కేటాయించేది మాత్రం ప్రధాన పక్షాల రాజకీయ ఆటలకు, వారి ఆటవిక క్రీడలకే!

బడి చదువు బలి, ఉన్నత విద్యకు ఉరి

‘చదువు చారెడు బలపాలు దోసెడు’ అని పాత సామెత. డబ్బు వెచ్చించినా విద్యా ప్రమాణాలు పెంచుకోలేని దుస్థితి!ప్రజలు కేజీ నుంచి పీజీ ఉచిత విద్యను ఆశించిన, నిర్ధిష్టంగా హామీ పొందిన తెలంగాణలో చదువులు అటకెక్కుతున్నాయి. అంతటా విద్యా– పారిశుధ్య – భోజన ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ‘మన ఊరు మన బడి’ ఇంకా బాలారిష్టాల్లోనే ఉంది.

1639 బడుల్లో 950 ఎంపిక చేస్తే, 277 బడుల్లో అమలు మొదలే కాలేదు, 50 శాతం, ఆ పైన పనులు పూర్తయిన బడులు166 మాత్రమే! రాష్ట్ర వ్యాప్తంగా 64 శాతం (1043/1639) బడుల్లో టీచర్ల కొరత ఉన్నది. 24 వేల టీచర్‌‌ పోస్టులు తక్షణం భర్తీ చేయాల్సి ఉంది. ఆర్థికశాఖ ఆమోదం ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వటం లేదు. బడులకు కనీస నిధులు లేవు, 50 శాతం బడుల్లో పారిశుధ్యం పనుల ఖర్చుల్ని ఏదోవిధంగా టీచర్లే సర్దుకు వస్తున్న స్థితి.

సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో తిండికి రోజూ తిప్పలే! ఎక్కడో చోట ఫుడ్​ పాయిజన్​ కేసులతో స్టూడెంట్స్ ఆస్పత్రిలో పడని రోజే లేదు, అయినా ఎవరికీ పట్టదు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌, స్కాలర్షిప్‌‌ లకు రూ.1400 కోట్ల బకాయిలున్నాయి. సగానికి పైగా డిగ్రీ కాలేజీల్లో (85/132) పూర్తికాలపు ప్రిన్సిపాల్స్‌‌ లేరు. సర్కారు విశ్వవిద్యాలయాలను గాలికి వదిలి, ప్రైవేటుకు వాకిళ్లు తెరిచారు. 15 వర్సిటీల్లో 2500లకు పైగా బోధనా సిబ్బంది ఖాళీలున్నాయి. బోధనే కాదు రీసర్చ్‌‌ అధ్వాన స్థితికి చేరింది. ఒకప్పుడు జ్ఞాన కాంతులతో వెలిగిన వర్సిటీలు ఇప్పుడు పాడుగోడల దేవిడీల్లో గుడ్డిదీపాలుగా మిగులుతున్నాయి.

వైద్యో.. నారాయణో ‘హరీ’!

ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన, చేస్తున్న రంగాల్లో వైద్యం ముఖ్యమైంది. ప్రజారోగ్య వ్యవస్థను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని, చెంప చెళ్లుమనిపించి కరోనా గుణపాఠం చెప్పినా మనం నేర్చుకోలేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపు అంతంతే. ప్రభుత్వ అచేతన వల్ల, అప్రాధాన్యత వల్ల ఈ రంగంలో ప్రైవేటు శక్తులు దూసుకువచ్చాయి.

ఒక వంక ప్రభుత్వ జనరల్‌‌ ఆస్పత్రుల్లో వసతులు, మందుల్లేక, సరిపడా వైద్యులు రాక, సిబ్బంది కొరత, ఇలా ఇబ్బందులతో నలుగుతుంటే, మరోవంక ప్రైవేటు దోపిడీకి అడ్డూ– అదుపూ లేని పరిస్థితి. నియంత్రించే వ్యవస్థ సర్కారు వద్ద లేదు. దాంతో, వైద్యారోగ్యం విషయంలో సామాన్యులతో పాటు దిగువ, మధ్య, ఉన్నత మధ్య తరగతివారు కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

కరోనా, తదనంతర కాలంలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు కొత్తగా దారిద్య్రరేఖకు కిందకు దిగజారడం వెనుక ప్రధాన కారణం వైద్య ఖర్చులు అసాధారణంగా పెరగటమేనని ఐక్యరాజ్యసమితి నివేదిక కూడా చెబుతున్నది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో, ముఖ్యంగా 8 కొత్త వైద్య కళాశాలలు – అనుబంధ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాలకు తీవ్ర కొరత ఉందని ప్రభుత్వ బోధానాసుపత్రుల వైద్యుల సంఘం (టీటీజీడీఏ) పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రైవేటు రంగంలోని 37 శాతానికి పైగా ఆస్పత్రుల్ని లోపాయికారిగా నిర్వహిస్తున్నట్టు, ఇటీవలే జరిపిన సర్కారు తనిఖీల్లో వెల్లడైంది. హైదరాబాద్‌‌, రంగారెడ్డి, కరీంనగర్‌‌, మేడ్చల్‌‌, కొత్తగూడెం...ఈ 5 జిల్లాల్లో సదరు ఉల్లంఘనలు అధికమని తేలింది.

పతాక స్థాయిలో నిరుద్యోగం

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పతాకస్థాయిలో ఉంది. ఎన్నికల గాలమే తప్ప కొత్త కొలువులకు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కల్పన హామీ ఇచ్చి నెరవేర్చటం లేదు. ఉద్యోగులకు జీతాలు సకాలంలో/సక్రమంగా రావటం లేదు.  ప్రభుత్వం ఒక్క రైతు బంధు ఇస్తూ.. మిగతా సాగు పథకాలను ఆపేసింది. ఫలితంగా నేటికీ అన్నదాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫించన్లు కొత్తవి ఇచ్చినట్టే ఇచ్చి, నిలిపివేశారు, పాతవాటిలోనూ వేర్వేరు సాకులతో కత్తెర వేస్తున్నారు. దళితబంధు ఆశ్రితపక్షపాతాన్ని, ఎమ్మెల్యేల సిఫారసులను హైకోర్టే తప్పుబట్టింది. ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షలిచ్చే ప్రతిపాదన కార్యరూపం కావట్లేదు. సాంకేతిక కారణాలతో ‘ఆసరా’కూ అగచాట్లు తప్పట్లేదు. కష్టాల కడలి నుంచి ఆర్టీసీ గట్టెక్కట్లేదు. రోడ్లకు రోగమొచ్చింది, నిధులు విడుదల కావట్లేదు. ఏకరువు పెడితే.. ఇలా సమస్యలు బోలెడున్నాయి. వాటన్నిటినీ వెనుక సీట్లోకి నెట్టి రాజకీయమే తెరమీద రాజ్యమేలుతున్నది. ఇది ఎవరి మేలు కోసం? జవాబు లేని ప్రశ్న!

నిత్యం రగిలే రావణ కాష్టం

రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న భూ విధానం అధ్వానంగా ఉన్నది. ఎటూ తేల్చని సర్కారు నాన్చుడు ధోరణి వల్ల గిరిజనులు, అటవీ అధికారుల మధ్య పోడు భూముల రగడ నిత్యం రగులుతున్నది. కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో గుత్తికోయలు ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ అధికారిని పాశవికంగా కత్తితో మెడనరికి చంపారు. బతుకుదెరువు కోసం అటవీభూమి చదును చేసి గిరిజనులు పోడు వ్యవసాయం చేయడం, అటవీ అధికారులొచ్చి హరితహారం కింద మొక్కలు నాటడం, ఇద్దరి మధ్య ఘర్షణ! రాజధాని చుట్టుపక్కల సగటున ఎకరం ఇరవై, ముఫ్పై కోట్ల పైనే పలుకుతున్నదని, జిల్లాల్లోనూ కోట్లలో ఉందని చెప్పే సర్కారు, భూనిర్వాసితులకు అయిదారు లక్షలు విదిల్చి, గొంతెత్తితే అణచివేస్తున్నది.

సాంకేతికత వినియోగం పేరు చెప్పి రెవెన్యూలో తీసుకువచ్చిన ‘ధరణి’ ఓ సమస్యల పుట్ట! అవినీతి నిర్మూలనకని తెచ్చిన వ్యవస్థ అవినీతికి ఆటపట్టయింది. అక్కడ జరుగుతున్నన్ని అరిష్టాలు మరెక్కడా లేవని, కోటిన్నర ఎకరాల భూముల్లో సమస్యలు తెచ్చిపెట్టిందని కచ్చితమైన ఆరోపణలు, ఘాటైన విమర్శలూ ఉన్నాయి. లోపాలను సరిదిద్దరు సరికదా, నిర్వహణ పరమైన సర్కారు తప్పిదాలకు కూడా పౌరులే డబ్బు కట్టాల్సివస్తున్నది. ఫీజు కట్టిన తర్వాత కూడా ఫలితం దక్కని సందర్భాలెన్నో! భూముల ధరలు అమాంతం పెరిగిపోయాక... కుటుంబాలు ఛిద్రమయ్యాయి, మానవ సంబంధాలు వికలమయ్యాయి. భూ హత్యలు నిత్యం ఎక్కడోచోట నమోదవుతున్నాయి. వేదికలపై ఉపన్యాసాలు, పత్రికా ప్రకటనలు తప్ప విపక్షం చేసిన ప్రజా ఉద్యమాలు నిల్‌‌!  - దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ,