
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం 45 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల సుమారు రూ. 20 వేల కోట్లు కోల్పోతున్నారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ సమాజానికి ఒక పెద్ద సమస్యగా మారిందని, అందుకే ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆదాయ నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నామని అధికార్గాలు తెలిపాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025'ను లోక్‌సభలో బుధవారం ప్రవేశపెట్టింది. ఇది ఈ–-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహిస్తూ, మనీ గేమింగ్‌ను నిషేధిస్తుంది.
ఈ బిల్లు ప్రకారం, ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు అందించే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. కోటి వరకు జరిమానా విధించవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా వేయవచ్చు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ–గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ వంటి పరిశ్రమ సంస్థలు హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఈ బిల్లు ఉద్యోగాలను సృష్టించే రంగాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ విలువ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉందని, వార్షిక ఆదాయం రూ. 31 వేల కోట్లు దాటిందని పేర్కొన్నాయి. ఏటా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ. 20 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తుందని తెలిపాయి.