
మహబూబ్‌నగర్/గద్వాల/వనపర్తి/నాగర్‌కర్నూల్‌టౌన్, వెలుగు : 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన వెంట కలెక్టర్ విజయేందిర బోయి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
నారాయణపేటలో మంత్రి వాకిటి శ్రీహరి, -గద్వాలలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, వనపర్తిలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల ఫ్యామిలీ మెంబర్స్‌ను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
రూపురేఖలు మారనున్నయ్..
రైజింగ్-2047 విజన్‌తో తెలంగాణ రూపురేఖలు మారనున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని చెప్పారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నం
వనపర్తి జిల్లాను అన్నిరంగాల్లో డెవలప్ చేసేందుకు కలిసి రావాలని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగా 17, 490 రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు జిల్లాలో రూ.45.43 కోట్లతో 29 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ల పనులు ప్రారంభించామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ లో వనపర్తి జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచిందన్నారు.
ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతి..
రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,11,16 ఇండ్లకు జీరో బిల్లులు వస్తున్నాయని చెప్పారు. 68,470 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, మొదటి విడతలో 11,622 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్నివర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. స్వల్ప వ్యవధిలో తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కంకణబద్ధమై ఉందని తెలిపారు.
ఉపాధికి పెద్దపీట..
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందిరమ్మ ఇండ్ల కు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని న్యూ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి తెలిపారు. టీజీపీఎస్సీని సంస్కరించి 20 నెలల్లో 60వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. కృష్ణ, గోదావరి జలాల్లో వాటా విషయంలో రాజీ పడబోమన్నారు.