మద్యంతో జరిగే అనర్థాలను గుర్తించిన ఏడు గ్రామాల ప్రజలు

మద్యంతో జరిగే అనర్థాలను గుర్తించిన ఏడు గ్రామాల ప్రజలు

మెదక్ (నిజాంపేట), వెలుగు :  మెదక్​ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట మండల పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు మద్యంతో జరిగే అనర్థాలను గుర్తించారు. ఊళ్లలోని బెల్ట్​ షాపులన్నీ మూసి వేయించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సంపూర్ణ మద్య నిషేధ తీర్మానాలు చేశాయి. లిక్కర్ అమ్మినా, కొన్నా ఫైన్ వేస్తామని ప్రకటించాయి. ఇప్పుడు ఆ పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అదేదారిలో వెళ్లేందుకు మరికొన్ని గ్రామాలు ప్రయత్నిస్తున్నాయి. 

బెల్ట్​షాప్​లు బందైన ఊర్లు ఇవే.. 

ఉమ్మడి రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం, బచ్చురాజ్ పల్లి, కె.వెంకటాపూర్, నార్లాపూర్, చల్మెడ గ్రామాలలో బెల్ట్​ షాప్​లలో ఇదివరకే లిక్కర్ అమ్మకాలు బంద్ చేశారు. తాజాగా కల్వకుంట, రజాక్​పల్లిలోమద్య నిషేధం అమలులోకి వచ్చింది. 

నిజాంపేట మండలం చల్మెడలో రెండు నెలల కింద సర్పంచ్ నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్​ ఆధ్వర్యంలో ఊర్లో ఎవరూ లిక్కర్ అమ్మొద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎవరైనా మందు అమ్మితే వారికి రూ.50 వేల ఫైన్, పట్టించిన వారికి రూ.5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు.

కల్వకుంట గ్రామంలో ఐదు వేల జనాభా ఉండగా 12 బెల్ట్​ షాప్​లు ఉండేవి. మద్యానికి బానిసలుగా మారి ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఓ వ్యక్తి పొద్దంతా ఫుల్లుగా మందు తాగి తన ఇంటి ముందు కాలుజారి  కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన నేపథ్యంలో గ్రామంలోని యూత్ అంతా ఒక్కటై బెల్ట్​ షాప్​లు బంద్​ చేయించారు. ఈ క్రమంలో సర్పంచ్ కృష్ణవేణి, ఉప సర్పంచ్ పద్మలత  అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటుచేసి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఎవరైనా లిక్కర్ అమ్మితే రూ.10 వేలు, కొంటే రూ.5 వేల ఫైన్ విధిస్తామని, లిక్కర్ అమ్ముతున్నట్లు గుర్తించినవారు  ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి రూ.2 వేల నజరానా ఇస్తామని తీర్మానం చేశారు. 

కల్వకుంట గ్రామస్తుల స్పూర్తితో ఆ ఊరికి సమీపంలో ఉన్నరజాక్ పల్లిలో ఈనెల 10న సర్పంచ్ ధర్మ సునీత, ఉప సర్పంచ్ నారాగౌడ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఊరిలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో లిక్కర్ అమ్మిన వారికి రూ.5 వేలు, కొన్నవారికి రూ.2 వేల ఫైన్ విధిస్తామని ప్రకటించారు. 

వెంకటాపూర్​లో పదిహేనేళ్లుగా 

రామాయంపేట మండలం కె.వెంకటాపూర్​ లో 2009 నుంచే సంపూర్ణ మద్యపాన  నిషేధం అమలవుతోంది.  అప్పట్లో మందు అమ్మిన వారికి రూ.25 వేల ఫైన్ వేసి, పట్టుకున్న వారికి రూ.5 వేలు బహుమతి  ఇచ్చారు. మిగిలిన పైసలను హనుమాన్ టెంపుల్ డెవలప్​మెంట్​కు ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు మద్యపాన నిషేధానికి సహకరించారు. దీంతో 15 ఏండ్లుగా సక్సెస్​ ఫుల్​గా మద్య నిషేధం అమలవుతోందని మాజీ సర్పంచ్​ సత్యనారాయణ తెలిపారు.

లిక్కర్ అమ్మితే ఫైన్ పక్కాగా వేస్తాం.. 

గ్రామంలోని బెల్ట్​ షాప్​లలో లిక్కర్ తాగి న్యూసెన్స్ చేస్తున్నారని ఊరిలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాం. అమ్మిన వారికి రూ.50 వేలు ఫైన్, పట్టిచ్చిన వారికి రూ.5 వేలు ఇస్తామని తీర్మానం చేశాం. దీనిని పక్కగా అమలు చేస్తున్నాం. 

– చప్పెట నర్సిహారెడ్డి, చల్మెడ సర్పంచ్​

ఊరిలో గొడవలు బందయినయ్​....

ఊళ్లో బెల్ట్​షాప్​లు బంద్​ పెట్టినప్పటి నుంచి గొడవలు జరగడం లేదు. తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులంతా కట్టుబడి ఉన్నారు. దీంతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడింది.  చాలా సంతోషంగా ఉంది.

– స్వామి, కల్వకుంట