
ఎల్బీనగర్, వెలుగు: సిటీ శివార్లకు బస్సుల్లో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, సరిగా బస్టాప్‌లు లేక శివారు ప్రాంతాల జనం ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిల్చోడానికి జాగా లేకపోవడంతో ఎండలో ఎండుతూ వానకు తడుస్తున్నారు. అభివృద్ధి పేరుతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలంటూ ఎల్బీ నగర్, నాగోల్, చింతల్‌కుంట, సాగర్ రోడ్, అల్కాపురితో పాటు పలు ప్రాంతాల్లో బస్టాప్ షెల్టర్స్ తొలగించేశారు. వీటిని తొలగించి ఐదేళ్లు దాటిపోతున్నా తిరిగి నిర్మించలేదు.
ప్రతిరోజూ తిప్పలే..
ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) పనుల నేపథ్యంలో నాగోల్ నుంచి ఎల్ బీనగర్ , చింతలకుంట నుంచి ఎల్ బీనగర్ వైపు, సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ వరకు దాదాపు 25 బస్షెల్టర్లను బల్దియా అధికారులు తొలగించారు. కానీ తిరిగి వాటిని నిర్మించలేదు. కాగా ఆ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. శివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, హయత్ నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్ పేట, బాలాపూర్, బడంగ్ పేట, మీర్ పేట ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, స్టూడెంట్లు ఎల్ బీనగర్ మీదుగానే వెళ్తుంటారు. కాగా ప్రతిరోజు వీరికి తిప్పలు తప్పడం లేదు.
విజయవాడ స్టాప్‌లో కనిపించని బస్ షెల్టర్
ఏపీతో పాటు రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం జిల్లాలకు, చాలా ప్రాంతా లకు విజయవాడ బస్టాప్ నుంచే బస్సులు వెళ్తుంటాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు చింతల్‌కుంట, ఎల్ బీనగర్ మధ్య ఉన్న విజయవాడ స్టాప్‌వద్ద ఎక్కుతుంటారు. రోజూ వందల బస్సులు, వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే ఈ ప్రాంతంలో ఒక్క బస్టాప్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిల్చుంటున్నారు. ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యను చూస్తే 10 బస్ షెల్టర్స్ పెట్టినా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సమన్వయ లోపంతోనే బప్టాప్ల ఏర్పాటులో ఆలస్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
అవసరం లేని చోట ఎందుకు?
బస్టాప్‌ల వద్ద షెల్టర్స్ లేక ప్రయాణికులు ఇబ్బందిడుతున్నా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. అవసరంలేని చోట ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ బస్టాప్ లాంటి ప్రాంతాల్లో అయితే కనీసం టాయిలెట్స్ కూడా లేకపోవడం ప్రయాణికులకు అవస్థగా మారింది. అవసరం ఉన్న ప్రతీ చోట బస్ షెల్టర్ నిర్మించాలి.
- రఘు, డిపో మేనేజర్, హయత్ నగర్
ఐదేండ్లుగా ఇదే పరిస్థితి..
ఉద్యోగ రీత్యా నేను ప్రతిరోజు ఎల్బీనగర్ నుంచి మాదాపూర్‌కు వెళ్తాను. బస్టాప్‌ల వద్ద షెల్టర్స్ లేక ఇబ్బంది పడుతున్నాం.వానాకాలంలో తడిసిపోతున్నాం. ఐదేండ్ల నుంచి ఇదే పరిస్థితి. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు.
- గణేష్, ఎల్ బీనగర్