తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : బండి సంజయ్

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : బండి సంజయ్

కేసీఆర్ ప్రభుత్వంపై, ఆయన కుటుంబంపై రాష్ర్ట ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్రలో స్పష్టమైందని బండి సంజయ్ అన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 5 విడతల్లో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. పాదయాత్రను ప్రధాని మోడీ అభినందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇదంతా కార్యకర్తల కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో  రాష్ర్ట్ ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహ, కష్టాల్లో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను రాష్ర్ట ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని, బీజేపీ ఏ నిర్ణయం తీసుకోబోతుందని ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ కోసం రాష్ర్ట ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని ప్రజలందరూ అనుకుంటున్నారని, మార్పు జరగాలని కోరుకుంటున్నారని, బీజేపీకి అవకాశం కల్పించాలని భావిస్తున్నారని బండి సంజయ్ చెప్పారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలన, అవినీతి పాలన, రాజకార్ల పాలన కొనసాగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ర్టంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ గుర్తించాలని కోరారు. అన్ని వర్గాలను కేసీఆర్ అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించేవారిని, మీడియా ప్రతినిధులను, కళాకారులను, ప్రజాసంఘాలను, ప్రతిపక్ష నాయకులను అణిచివేస్తున్నారని, చివరకు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చే వారిని కూడా అణిచివేసే ధరోణి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదంటూ బండి సంజయ్ మండిపడ్డారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదన్నారు. దళిత బంధు దళితులకు ఇవ్వకుండా.. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే దళిథబంధు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ముందుగా బీజేపీ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు  బీజేపీ రాష్ర్ట ఇన్ చార్జ్ సునీల్‌ బన్సల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, సీనియర్ నాయకులు విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, NVSS ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి, జీవితా రాజశేఖర్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మాచారి హాజరయ్యారు.