ఆర్డర్ చేసి.. ఎక్కువ తినేది ఏందో తెలుసా?

ఆర్డర్ చేసి.. ఎక్కువ తినేది ఏందో తెలుసా?

ఆకలేసినా, దాహమేసినా, గరం గరంచాయ్‌ సిప్‌ చేయాలనిపించినా,కరకరలాడే స్నాక్స్‌ తినాలనుకున్నా..అన్నిం టికీ ఫుడ్‌ యాప్‌ లు ఉండనేఉన్నయ్‌ . ఆర్డర్‌ అందుకోగానేజెట్‌ స్పీడ్‌ తో దూసుకొచ్చి ఫుడ్అందించే డెలివరీ బాయ్స్‌ ఉన్నరు.ఏ టైంలో అయినా జనాల ఆకలినితీరుస్తున్న ఫుడ్‌ యాప్స్‌ మస్తున్నయ్‌ .అయితే ఏ ప్రాంతంలో ఉండేవాళ్లుఎట్లాం టి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నరో మనకుతెల్వదు కదా!. అది చెప్పేం దుకే ఒక సర్వేజరిగింది . ఆ సర్వేలో ఆసక్తికరమైనవిషయాలెన్నో తెలిసినయ్‌ ..

చీకట్లోనే నిద్రలేచి ఉదయం టిఫిన్ చేసుకుని.. భోజనం వండుకుని, బాక్స్‌కట్టుకుని ఆఫీసులకు బయలుదేరతారు. కానీ, ఫుడ్‌ యాప్స్‌ కారణంగా అంతలా కష్టపడాల్సిన అవసరం ఉండట్లేదు. టిఫిన్ తయారు చేసే పనిలేదు.. భోజనం వండుకునే అవసరం లేదు. ఏ రందీ పడకుండా ప్రశాంతంగా ఆఫీసులకు వెళ్తున్నారు. ఒకవేళహఠాత్తుగా బంధుమిత్రులు ఇంటికి వచ్చినా కంగారుపడరు. స్మార్ట్ ఫోన్‌‌తో క్లిక్ చేస్తే అనుకున్న ఐటం నిమిషాల్లో డోర్‌‌ డెలివరీఅవుతోంది. అందుకే సిటీలో ఉండేవాళ్ల లైఫ్‌ స్టైల్‌ కొంచెం ఈజీగా మారిందని చెప్పొచ్చు. అయితే, జొమాటో దేశవ్యాప్తంగాసర్వే చేసి.. ఆన్‌‌లైన్‌‌ పుడ్‌ యాప్‌‌ కల్చర్‌‌ తీరుఏ పట్టణంలో ఎలా ఉందనేది తెలిపింది.

బావర్చీ  బిర్యానీ
ఘుమ ఘుమలాడే బిర్యానీ రుచి కోసం ఇంతకాలం రెస్టారెంట్ల ముందు బారులు తీరే జనాల్ని చూశాం. కానీ, ఇప్పుడు ఆ కష్టాలు డెలివరీ బాయ్స్‌‌కి వచ్చాయి. ఆ మధ్య హైదరాబాద్‌‌లోని బావర్చీ రెస్టారెంట్‌‌ ముందు డెలివరీ బాయ్స్‌‌ క్యూలో నిల్చున్న ఫొటో ఒకటి బాగా వైరల్‌‌ అయ్యింది. జొమాటో సంస్థ ఆ ఫొటోను ట్విట్టర్‌‌లో షేర్‌‌ చేసింది. వైరల్‌‌ అయిన ఆ ఒక్క ఫొటో చాలు ఆన్‌‌లైన్ ఫుడ్ కోసం జనాలు ఎట్లా ఎగబడిపోతున్నారో చెప్పడానికి. అయితే నగరంలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్‌‌లతో పోలిస్తే బావర్చీ రెస్టారెంట్‌‌పైనే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయట. రోజుకు కనీసం రెండు వేలకు పైగా ఆర్డర్లు(బిర్యానీ పార్శిల్స్‌‌ ఎక్కువ) చేస్తున్నారని జొమాటో నివేదిక వెల్లడించింది. ఇదంతా  దమ్‌‌ బిర్యానీ మహిమే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిర్యానీ తర్వాత ఎక్కువగా ఆర్డర్‌‌ పెడుతున్న వాటిల్లో కబాబ్‌‌ ఐటమ్స్‌‌, ఫ్రాంకీస్‌‌, మీల్స్‌‌(భోజనం) ఉంటున్నాయి. 

పిజ్జా టౌన్‌
దేశంలో ఫుడ్ యాప్‌‌ల ద్వారా జనాలకు చేరుతున్న ఫుడ్‌‌లో నాలుగో స్థానంలో ఉంది పిజ్జా.  కానీ, గుజరాత్‌‌లోని ఆనంద్‌‌ మున్సిపాలిటీలో మాత్రం జనాలు పిజ్జాని ఇష్టంగా తెప్పించుకుని తింటున్నారు. ఈ ప్రాంతంలో ఐదు పిజ్జా సెంటర్లు ఉన్నాయి. ఒక రోజులో సగటున వందకు ఎనభై ఐదు ఆర్డర్లు పిజ్జావే ఉంటాయి. ఈ కారణంగానే  ‘పిజ్జా టౌన్‌‌’గా ఆనంద్‌‌కి పేరొచ్చింది. ఆర్డర్లు సరిపోక ఒక్కోసారి పొరుగున ఉన్న  టౌన్‌‌ల నుంచి పిజ్జాను తెప్పించుకుంటారు ఇక్కడి ప్రజలు. ఫాస్ట్‌‌ ఫుడ్‌‌ విషయానికొస్తే.. ఎక్కువగా ఆర్డర్లు జమ్మూ కశ్మీర్‌‌లో నమోదు అవుతున్నాయి.

తంబీల తాపత్రయం
ఫుడ్‌‌ డెలివరీ యాప్‌‌లను ఎక్కువగా ఉపయోగించుకుంటున్న టాప్‌‌–5 రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. ఈ రాష్ట్రంలోని ఊటీ నుంచి అత్యధిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే తమిళ ప్రజలు ‘ఇడ్లీ–సాంబార్‌‌’ని కాదని.. ‘చికెన్‌‌ బిర్యానీ’ కోసం ఆన్‌‌లైన్‌‌లో ఎక్కువ ఆరాటపడుతున్నారు. టెంపుల్‌‌ సిటీ మధురైలో ఎక్కువ మంది ప్రజలు సెర్చ్‌‌ చేయడం బిర్యానీపై వాళ్లకున్న ఆసక్తిని తెలియజేస్తోంది.  ఒక్క తమిళనాడులోనే కాదు ఆ మాటకొస్తే దేశం మొత్తం మీద ఆన్‌‌లైన్‌‌ ఫుడ్‌‌ యాప్స్‌‌లో ఎక్కువమంది వెతుకుతున్న ఫుడ్ చికెన్ బిర్యాని. (ఆర్డర్‌‌ పెడుతున్నది మాత్రం పప్పు–చపాతీ).

బ్రేక్‌‌ఫాస్ట్‌‌కి బెజవాడ
24X7.. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఫుడ్ యాప్‌‌‌‌లు ఇప్పుడు ఇదే రూల్‌‌‌‌ను ఫాలో అవుతున్నాయి. బ్రేక్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ మొదలు అర్ధరాత్రి దాటాక కూడా ఫుడ్‌‌‌‌ సర్వీసుల్ని కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని విజయవాడలో దేశంలోనే ఎక్కువ బ్రేక్‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌ ఆర్డర్లు నమోదు అవుతున్నాయి. ఆ ఆర్డర్లలో ఇడ్లీ ఎక్కువగా ఉంటోంది. లంచ్‌‌‌‌ విషయంలో అహ్మదాబాద్‌‌‌‌ ముందంజలో ఉంది. ఫుడ్ యాప్స్‌‌‌‌లో రాత్రులు ఎక్కువ ఆర్డర్లు పెడుతున్నది ముంబై ప్రజలు. అయితే అర్ధరాత్రి దాటాక ఆర్డర్లు పెడుతోంది మాత్రం మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్ ప్రజలే. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పుడ్‌‌‌‌ సర్వీసులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్న ప్రాంతం ఉడిపి(కర్ణాటక)లోని మణిపాల్‌‌‌‌. దేశంలో ఎక్కువ డెలివరీలు అవుతున్న ప్రాంతం ఇదే. తక్కువ ఆర్డర్లు తూర్పుగోదావరి జిల్లా(ఆంధ్రప్రదేశ్)లోని తుని వాళ్లు చేస్తున్నారు.

స్పెషల్డెలివరీ
కోరుకున్న భోజనం కొంచెం ప్రత్యేకంగా కస్టమర్లకు చేరితే ఆ సంబురమే వేరు. అలాంటి స్పెషల్‌ డెలివరీ ఘటనలు కొన్ని ఈ మధ్య కాలంలో వార్తల్లోకి ఎక్కాయి కూడా. ఆ మధ్య గౌహతి (అస్సాం)లో ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ బ్రహ్మపుత్ర నదిని పడవలో  దాటి వెళ్లి మరీ ఫుడ్‌ ఆర్డర్‌ను అందించాడు. బిహార్‌ గయ, భోగల్పూర్‌ పట్టణాల్లో  డెలివరీ బాయ్స్‌  ఎక్కువ మంది బైక్‌ల మీద కంటే సైకిళ్ల మీదే ఆర్డర్లను చేరవేస్తుంటారు. కాలుష్యాన్ని నివారించేందుకు అక్కడి ఫుడ్‌ యాప్‌ల ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్‌ ఆల్వార్‌కు చెందిన  ఒక వ్యక్తి నలభై ఎనిమిది రెస్టారెంట్ల నుంచి ఒకే సమయంలో 292 ఆర్డర్లు పెట్టి రికార్డుల్లోకి ఎక్కాడు. లక్నోలో ఒక భోజన ప్రియుడు సుమారు పదిహేడు వేల రూపాయల విలువ చేసే భోజనం ఒకేసారి ఆర్డర్‌ ఇచ్చి.. స్పెషల్ గిఫ్ట్‌ అందుకున్నాడు.

హ్యాట్సాఫ్‌‌.. హంగ్రీ సేవియర్‌‌
గత కొన్నిరోజులుగా ఇంటర్నెట్‌‌లో జొమాటోకు చెందిన ఒక డెలివరీ బాయ్‌‌ ఫొటో బాగా వైరల్‌‌ అవుతోంది. దివ్యాంగుడైన ఒక వ్యక్తి మూడు చక్రాల సైకిల్‌‌పై డెలివరీ చేస్తున్న ఫొటో అది. ఆ డెలివరీ బాయ్‌‌కి నెటిజన్స్‌‌ ‘హంగ్రీ సేవియర్‌‌’ అనే పేరు కూడా పెట్టేశారు. అయితే అతని గురించి వివరాల్ని హనీ గోయల్‌‌ అనే వ్యక్తి తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశాడు. ‘తమ జీవితం ఇక వ్యర్థం అనుకునే వారికి ఈ వ్యక్తి ఓ స్ఫూర్తి. జొమాటో.. నువ్ చిరకాలం వర్థిల్లు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వ్యక్తి మరింత ఎదగడానికి సహకరించు’ అంటూ హానీ గోయల్ జొమాటోను ఉద్దేశించి రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌‌పై వేలాది మంది స్పందించారు. ‘కాళ్లు లేకున్నా సంకల్ప బలంతో అందరి హృదయాలను ఆకర్షించావ్‌‌.. నీకు హ్యాట్సాఫ్‌‌’ అంటూ ఆ డెలివరీ బాయ్‌‌ ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు.

హనీ ట్వీట్‌‌పై జొమాటో కూడా స్పందించింది. ‘ఈ వీడియోను షేర్ చేసినందుకు థ్యాంక్స్. మా ఫుడ్ డెలివరీ బాయ్స్ మాకెంతో గర్వకారణం. అనేక ఇబ్బందులు పడుతూ కూడా కస్టమర్లకు సరైన సమయంలో ఫుడ్‌ వెరైటీలు సరఫరా చేస్తున్నారు’ అంటూ జొమాటో కేర్ రిప్లై ఇచ్చింది. అతడి వివరాలను పంపించాలంటూ నెటిజన్లను కోరింది.  వీడియో వైరల్‌‌గా అయిన తర్వాత హానీ మరో ట్వీట్ చేశాడు.‘ఆ  దివ్యాంగుడి పేరు రాము అని, అతనిది రాజస్థాన్‌‌ అని పేర్కొన్నాడు.