
దళిత సర్పంచును ఎంపీ అవమానించిండు
ఆందోళనకు దిగిన గ్రామస్తులు
దుబ్బాక, వెలుగు : దళిత సర్పంచును పిలవకుండా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మెదక్ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు, గ్రామ సర్పంచ్ మాచపురం లక్ష్మి యాదగిరి లేకుండానే బుధవారం ఎంపీ పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో గ్రామస్తులు ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్మాట్లాడుతూ దళిత ప్రజాప్రతినిధులను అవమానించడమే ధ్యేయంగా ఎంపీ పని చేస్తున్నారని ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తోన్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఎంపీ మిరుదొడ్డి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.