ఆసరా పింఛన్ల జాబితాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు

ఆసరా పింఛన్ల జాబితాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు
  • అధికార పార్టీ లీడర్ల అనుచరులు, కుటుంబ సభ్యులకూ మంజూరు
  • అన్ని అర్హతలున్నా తమకు ఆసరా రాలేదని పేదల ఆవేదన
  • పంచాయతీ, ఎంపీడీవో,  మున్సిపల్ ఆఫీసులకు క్యూ
  • న్యాయం కోసం రోజుకో చోట ఆందోళన

వెలుగు, నెట్‌వర్క్: పేదలకు అందాల్సిన ఆసరా పెన్షన్లు పక్కదారి పట్టాయి. పెద్ద సంఖ్యలో అనర్హులకు మంజూరయ్యాయి. అన్ని అర్హతలున్నా దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల పేర్లు లిస్టులో గల్లంతయ్యాయి. టీఆర్ఎస్ నేతలు, వాళ్ల కుటుంబసభ్యులు, లీడర్ల అనుచరులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ఆసరా లిస్టుల్లో చేర్చారని విమర్శలు వస్తున్నాయి. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కూడా పెన్షన్ పొందారు. కొందరు ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్​స్టేషన్ల అడ్రస్‌‌, బినామీ పేర్లతో పింఛన్లు పొందారు. దీంతో అన్ని అర్హతలు ఉండి కూడా తమకు ఆసరా రాలేదంటూ పేదలు పంచాయతీలు, ఎంపీడీఓ, మున్సిపల్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. రోజుకో చోట ఆందోళనకు దిగుతున్నారు.

భారీగా అనర్హులు

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక 2018 డిసెంబర్ నుంచి కొత్త పింఛన్ల మంజూరును నిలిపివేసింది. 57 ఏండ్లు నిండినోళ్లకు కూడా పింఛన్​ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినా అమలుచేయలేదు. తీరా గతేడాది హుజూరాబాద్ ఎన్నికల టైంలో 57 ఏండ్లు నిండినోళ్లకు అప్లై చేసుకునే చాన్స్​ ఇచ్చింది.  10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అప్పటికే 65 ఏండ్లు నిండిన వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ, గీత, చేనేత కార్మికులు తదితర సుమారు 3.15 లక్షల దరఖాస్తులు సర్కారు వద్ద పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏడాది కింది దాకా 13.15 లక్షల మంది అప్లై చేసుకుంటే.. గత నెలలో సర్కారు10 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. పక్కన పెట్టిన 3.15 లక్షల మందిలో 2 లక్షల కు పైగా అర్హులున్నట్లు తెలుస్తోంది. అప్లికేషన్లను స్క్రూ టినీ చేసే టైంలోనే అధికార పార్టీ లీడర్ల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారనే ఆరోపణలు వస్తున్నాయి. భారీగా అనర్హులకు ఆసరా మంజూరు 
చేసినట్లు తెలుస్తున్నది. 

మెదక్ జిల్లా నిజాంపేట్‌‌లో టీఆర్ఎస్​పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్‌‌కు ఆసరా పింఛన్ మంజూరైంది. ఆయనకు వ్యవసాయ భూములతో పాటు ఆస్తులు ఉన్నప్పటికీ శాంక్షన్ చేశారు. ఇదే జిల్లా శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడికి, పెద్ద గొట్టిముక్కుల మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ భర్తకు కూడా పింఛన్లు మంజూరయ్యాయి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో అధికార పార్టీకి చెందిన లీడర్​కు వీవర్స్ పింఛన్ మంజూరయ్యింది. ఆయన, కుటుంబసభ్యులు చేనేత పని చేయరు. ఇదే జిల్లా రామడుగు మండలానికి చెందిన టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీకి గీత కార్మికుల పెన్షన్ మంజూరు చేశారు. 

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) జడ్పీటీసీ అర్గుమీది రామయ్యకు వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రామయ్య.. వేదికపై కాకుండా ప్రైవేట్‌‌గా పెన్షన్​ కార్డు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో గరిదేపల్లి మండలం కట్టవారి గూడెం ఉప సర్పంచ్ ఉపేందర్ రావుకు 47 ఏండ్లు ఉన్నప్పటికీ వృద్ధాప్య పింఛన్ మంజూరైంది. 

ములుగు జిల్లా మంగపేట మండలంలో 1,467 ఆసరా పింఛన్లు మంజూరు కాగా.. అనర్హులకు అదీ ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి పింఛన్లు వచ్చాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఆఫీసర్లను నిలదీశారు. విచారణ చేయడంతో 142 మంది అనర్హులుగా తేలారు. వాళ్లకిచ్చిన పెన్షన్ కార్డులను తిరిగి తీసుకునే పనిలో పడ్డారు. మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ శాంక్షన్ చేశారు. మండలంలో కొత్తగా 106 మందికి ఆసరా మంజూరు కాగా.. ఇందులో 26 మంది టీఆర్ఎస్ లీడర్ల తల్లిదండ్రులు ఉండటం గమనార్హం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన మంగి వీరయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగికి వృద్ధాప్య పెన్షన్ మంజూరైంది. ఆయనకు సింగరేణి నుంచి నెలకు రూ.18 వేల పెన్షన్ వస్తుంది. 8 ఎకరాల పొలం కూడా ఉంది. ఇద్దరు కొడుకులు ఆర్మీలో ఉన్నారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గార పుల్లయ్య భార్యకు పెన్షన్ మంజూరైంది. మణుగూరులో రియల్ ఎస్టేట్, మెటల్ బిజినెస్ చేసే ప్రముఖ వ్యాపారి బేతంచర్ల వెంకటేశ్వరరావుకు పెన్షన్ మంజూరు చేశారు.

పోలీస్ ​స్టేషన్​కూ పెన్షన్​

కరీంనగర్ సిటీలోని 46వ డివిజన్‌లో రూరల్ పోలీస్ స్టేషన్ అడ్రస్‌తో కొత్తగా ఆసరా పింఛన్ మంజూరు చేశారు. స్టేషన్ ఇంటి నంబర్ 5 ‑1‑ 1లో మదనపల్లి నర్సయ్య అనే వృద్ధుడు ఉంటున్నాడని చూపుతూ ఓల్డేజ్ పెన్షన్ శాంక్షన్ చేశారు. ఈ నర్సయ్య అసలు అడ్రస్ మాత్రం బయటపడలేదు. ఆయన ఉన్నాడో లేడో, ఆయన పేరుతో ఇంకెవరైనా పింఛన్ కాజేయాలనుకున్నారో తెలియడం లేదు. అధికారులు అప్లికేషన్లను పరిశీలించి, పింఛన్లు మంజూరు చేసే టైంలో కనీసం ఇంటి నంబర్లు కూడా చెక్ చేయలేదనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఇటీవల మంజూరైన ఆసరా పెన్షన్ జాబితాల్లో పెద్ద సంఖ్యలో అనర్హుల పేర్లు చేర్చారని, దీంతో పేదలు నష్టపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన ఈయన పేరు షేక్ అజీమొద్దీన్. వయసు 60 ఏండ్లు. ఈయనకు కంటిచూపు సరిగా లేదు. 65 శాతం వైకల్యం ఉన్నట్టు సదరం క్యాంపులో నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. కంటి చూపు లోపం, వయోభారం వల్ల ఏ పనీ చేయలేకపోతున్నాడు. దీంతో ఏడాదిన్నర కింద వికలాంగుల పెన్షన్ కోసం అప్లై చేశాడు. అయినా పెన్షన్ మంజూరు కాలేదు. ‘‘ఎందరికో పింఛన్ ఇస్తున్నారు. కానీ పేదవాడినైన నాకు మాత్రం ఇయ్యలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

స్థానికంగా లేకున్నా మంజూరు

కరీంనగర్ జిల్లాలో ఆసరా పింఛన్ల జాబితాలు గందరగోళంగా ఉన్నాయి. కరీంనగర్ సిటీకి సంబంధించిన కొత్త పెన్షన్ల లిస్ట్‌‌లో జమ్మికుంట, చిగురుమామిడి, హుజూరాబాద్, అల్గునూరుకు చెందిన వారి పేర్లున్నాయి. స్థానికులు కాకపోయినా కరీంనగర్​సిటీలో పెన్షన్లు మంజూరు కావడం అనుమానాలకు తావిస్తోంది. సిటీలోని మారుతీనగర్‌‌‌‌కు చెందిన వాళ్ల పేరిట చిగురుమామిడి, హుజూరాబాద్ మండలాల్లో పింఛన్లు వచ్చాయి. చొప్పదండికి చెందిన కొందరి పేర్లు హుజూరాబాద్ మండలంలోని జాబితాలో కనిపిస్తున్నాయి. ఇలా ఒక ప్రాంతానికి చెందిన వారి పేర్లు మరో ఏరియా లిస్ట్​లో రాశారు.

రెండుసార్లు అర్జీ పెట్టిన

నాకు 66 ఏండ్లు. బొక్కలు అరిగిపోయి నడవడానికి కూడా చాతనైతలేదు. రెండు సార్లు వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ పెన్షన్ రావడం లేదు. మా ఊల్లో ఆస్తులు ఉన్నోళ్లకు, వయసులో ఉన్నోళ్లకు ఇచ్చి నా లాంటి వాళ్లను వదిలేసిన్రు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
- ప్యారాల యాదగిరి, అశ్వారావుపల్లి, రఘునాథపల్లి మండలం,జనగామ జిల్లా

పెద్ద పెద్దోళ్లకు వచ్చింది

నాకు 62 ఏండ్లు ఉంటయి. పెన్షన్‌‌కు అప్లై చేసినా కానీ శాంక్షన్ కాలేదు. పంచాయతీ ఆఫీస్‌‌ల అడిగితే, ‘మల్ల ఇంకో లిస్ట్ అచ్చేది ఉంది. అండ్ల వస్తది కావచ్చు’ అని చెప్పిన్రు. కానీ ఊల్లె పెద్ద పెద్దోళ్లకు పెన్షన్ వచ్చింది. నాకెందుకు రాలేదో అర్థమైత లేదు.
- బక్కోళ్ల చిన్న వెంకయ్య, నిజాంపేట

ఐదేళ్ల నుంచి తిరుగుతన్న

5 ఏండ్ల కింద నా భర్త చనిపోయిండు. దరఖాస్తు చేసుకున్నా వితంతు పింఛన్ ఇస్తలేరు. ఇప్పుడు మళ్లీ అప్లై చేస్తున్న. సర్పంచ్, కార్యదర్శి చుట్టూ తిరిగినా పట్టించుకుంట లేరు. ఊర్ల అంతా మంచిగున్నోళ్లకు కూడా ఇచ్చిండ్రు. నాకు మాత్రం ఇస్తలేరు. ఈ సారన్నా పింఛన్ ఇప్పియండి సారూ.
- మారుపాక సుశీల, అంకంపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా